Share News

మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు

ABN , Publish Date - Dec 14 , 2023 | 03:49 AM

మాజీ మంత్రి మల్లారెడ్డిపై మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట్‌ పోలీసుస్టేషన్‌లో బుధవారం కేసు నమోదయింది.

మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు

ఆయనపై భూకబ్జా ఆరోపణలు

ఎఫ్‌ఐఆర్‌లో ఇంటిపేర్లు నమోదు

చేయకపోవడంపై బాధితుల ఆందోళన

మూడుచింతలపల్లి, డిసెంబరు 13: మాజీ మంత్రి మల్లారెడ్డిపై మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట్‌ పోలీసుస్టేషన్‌లో బుధవారం కేసు నమోదయింది. మూడుచింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామ పరిధిలో సర్వే నంబర్‌ 33, 34, 35లోని సుమారు 47 ఎకరాల 18 గుంటల గిరిజనుల భూములను మాజీ మంత్రి మల్లారెడ్డి తన అనుచరులతో కలిసి కబ్జా చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎఫ్‌ఐఆర్‌ కాపీని బాధితులకు అందజేశారు. ఎఫ్‌ఐఆర్‌లో కబ్జాదారుల ఇంటి పేర్లను నమోదు చేయకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసును తప్పుదోవ పట్టించేందుకే పోలీసులు ఇంటి పేర్లు నమోదు చేయలేదని పేర్కొంటూ వారు పోలీసుస్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. తాము లేనప్పుడు రాత్రికిరాత్రే తమ ఇంటి పెద్ద మనిషిని మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులు మూడుచింతలపల్లి మండల తహసీల్దార్‌ కార్యాలయానికి తీసుకెళ్లి మాయ మాటలు చెప్పి భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని ఆరోపించారు. రాత్రి 11 గంటల సమయంలో తహసీల్దార్‌ రిజిస్ట్రేషన్‌ ఎలా చేస్తారని ప్రశ్నించారు. తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, తహసీల్దార్‌పై కలెక్టర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసి తమ భూములను రక్షించుకుంటామని భూబాధితులు పేర్కొన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 03:49 AM