ముహూర్తం కుదరడం లేదా?
ABN , Publish Date - Dec 18 , 2023 | 12:27 AM
దివ్యాంగుల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన మూడు చక్రాల బ్యాటరీ వాహనాలు పంపిణీకి నోచడం లేదు.
ఆరు నెలలుగా మూలన పడేసిన బ్యాటరీ వాహనాలు
నెలల తరబడి ఎదురు చూస్తున్న దివ్యాంగులు
సీట్లు చిరిగి, తుప్పు పడుతు న్నా పట్టించుకోని అధికారులు
భువనగిరి అర్బన్, డిసెంబరు 17: దివ్యాంగుల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన మూడు చక్రాల బ్యాటరీ వాహనాలు పంపిణీకి నోచడం లేదు. అవి జిల్లాకు చేరి ఆరు నెలలు అవుతోంది. ప్రజాప్రతినిఽధు లు సమయం ఇవ్వకపోవడంతో వాటిని పంపిణీ చేయడం లేదని తెలుస్తోంది. ఈ సంవత్సరం జూన్ 14వ తేదీన 98 బ్యాటరీ వాహనాలు జిల్లాకు వచ్చా యి. పంపిణీ చేసేందుకు గతంలో అధికారులు మం త్రి, ఎమ్మెల్యేల చుట్టు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేదేమీ లేక అధికారులు వాటిని డీపీఆర్వో కార్యాలయం ఎదుట కొన్ని మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణలోని ఖాళీ ప్రదేశం లో మరికొన్నింటిని ఉంచారు. కొద్దిపాటి స్థలంతో ఉన్న కార్యాలయ గదులు ఇరుకుగా మారి సిబ్బంది విధులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. బయట పార్క్ చేసిన బ్యాటరీ వాహనాలపై కవర్ కప్పారు. పిచ్చి మొక్కలు పూర్తిగా వాటిపైనే పర్చుకున్నాయి. దీనికి తోడు ఎలుకల సంచారంతో వాటికి ఏర్పాటు చేసిన సీట్లకు ఉండే కవర్లు పూర్తిగా చిరిగిపోతున్నాయి. అంతకుముందు ప్రజాప్రతినిధులు సమయం ఇవ్వకపోవడం.. ఈ లోగా అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో బ్యాటరీ వాహనాలను పంపిణీ చేయలేదు.
అసలు పంపిణీ జరిగేనా?
అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో బ్యాటరీ వాహనాల పంపిణీ నిలిచిపోయింది. త్వరలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్, తర్వాత లోక్‌సభ, జూన్, జూలైలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి. సర్పంచ్ ఎన్నికలకు ముందే బ్యాటరీ వాహనానలు పంపిణీ చేయాలని దివ్యాంగులు కోరుతున్నారు. వరుసగా ఉన్న ఎన్నికల నేపథ్యంలో కోడ్ వస్తే ఈ బ్యాటరీ వాహనాలు పరిస్థితి ఏమిటని, అప్పటి వరకు అవి మంచిగా ఉంటాయా అని తెలియని పరిస్థితి నెలకొంది. వీలైనంత త్వరగా పంపిణీ చేస్తే తమకు ఉపయోగం ఉంటుంద ని, తర్వాత ఇచ్చినా ప్రయోజనం ఉండదని దివ్యాంగులు పేర్కొంటున్నారు.
ప్రజాప్రతినిధులు సమయం ఇవ్వగానే పంపిణీ చేస్తాం
గతంలోని ప్రజాప్రతినిధులు సమయం ఇవ్వకపోవడంతో పంపిణీ ఆలస్యమైంది. ఈలోగా అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చింది. అలస్యం కావడానికి ఎన్నికల ప్రక్రియ అడ్డంకిగా మారింది. అందుకే త్వరలో మంత్రి, ఎమ్మెల్యేల సమయం తీసుకుంటాం. వారు సమయం ఇచ్చిన వెంటనే పంపిణీ చేస్తాం.
- జి. అన్నపూర్ణ (ఇన్‌చార్జి, జిల్లా మహిళ, శిశు సంక్షేమ అధికారి)