పుట్టినరోజునే ప్రాణం తీసుకుంది

ABN , First Publish Date - 2023-01-21T03:21:14+05:30 IST

చదువులో వెనుకబడిపోతున్నామనే ఒత్తిడిని ఓ సీఏ(చార్టెడ్‌ అకౌంటెంట్‌) విద్యార్థిని తట్టుకోలేకపోయింది. తన పుట్టిన రోజు నాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

పుట్టినరోజునే ప్రాణం తీసుకుంది

చదువు ఒత్తిడి తాళలేక సీఏ విద్యార్థిని ఆత్మహత్య

కూకట్‌పల్లి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): చదువులో వెనుకబడిపోతున్నామనే ఒత్తిడిని ఓ సీఏ(చార్టెడ్‌ అకౌంటెంట్‌) విద్యార్థిని తట్టుకోలేకపోయింది. తన పుట్టిన రోజు నాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌, కూకట్‌పల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కూకట్‌పల్లి బాలాజీనగర్‌కు చెందిన కె.కిరణ్‌కుమార్‌ బాలానగర్‌లో ప్లాస్టిక్‌ కంపెనీ నిర్వహిస్తున్నారు. కిరణ్‌ కుమార్‌ కుమార్తె హర్షిత(20) ప్రస్తుతం సీఏ చదువుతోంది. హర్షిత కొంతకాలంగా చదువు విషయంలో తీవ్ర ఒత్తిడికి గురవుతుండేది. హర్షిత పుట్టిన రోజు గురువారం కాగా.. తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. రాత్రి వేళ పడక గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. శుక్రవారం ఉదయం ఇంటికి తిరిగొచ్చిన తల్లిదండ్రులు ఎంత కొట్టినా హర్షిత తలుపులు తీయలేదు. దీంతో వారు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. కానీ అప్పటికే హర్షిత చనిపోయి ఉంది. ఈ మేరకు కిరణ్‌ కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పుట్టినరోజు నాడే హర్షిత ఆత్మహత్యకు పాల్పడటంతో పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-01-21T03:21:15+05:30 IST