రాష్ట్రంలో 2032నాటికి 5,600 మెగావాట్ల కొత్త ప్లాంట్లు

ABN , First Publish Date - 2023-06-02T02:45:03+05:30 IST

తెలంగాణలో 2032నాటికి 5,600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కొత్త ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయని కేంద్ర విద్యుత్‌ సంస్థ(సీఈఏ) ప్రకటించింది.

రాష్ట్రంలో 2032నాటికి   5,600 మెగావాట్ల కొత్త ప్లాంట్లు

కేంద్ర విద్యుత్తు సంస్థ నివేదిక

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో 2032నాటికి 5,600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కొత్త ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయని కేంద్ర విద్యుత్‌ సంస్థ(సీఈఏ) ప్రకటించింది. ఇదే సమయంలో రామగుండం-బీలోని 62.5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న యూనిట్‌-2 కేంద్రాన్ని మూసివేయాల్సి రావచ్చని పేర్కొంది. ఈ మేరకు జాతీయ విద్యుత్తు ప్రణాళికను సీఈఏ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 30ఏళ్లు దాటిన థర్మల్‌ కేంద్రాలను మూసివేయాలన్న నిబంధనలో భాగంగా రామగుండంలోని అతిపురాతన యూనిట్‌ను మూసివేయాల్సిన పరిస్థితి రావొచ్చని తెలిపింది. 2022-32మధ్యకాలంలో ఎన్‌టీపీసీ తొలిదశకు చెందిన మరో 800 మెగావాట్లు (ప్రస్తుతం 800 మెగావాట్లు అందుబాటులోకి వచ్చింది), యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు చెందిన 4 వేల మెగావాట్ల సామర్థ్యమున్న ఐదు యూనిట్లు, సింగరేణిలో 800 మెగావాట్ల మూడో యూనిట్‌ అందుబాటులోకి వస్తుందని గుర్తు చేసింది. తెలంగాణలో 4,959.19 మెగావాట్ల సౌరవిద్యుత్తు ఉత్పత్తి జరుగుతుండగా.. 20,410 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూలత/అవకాశం ఉందని సీఈఏ గుర్తు చేసింది. ఇక 2026-27నాటికి తెలంగాణకు 92,967 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు అవసరం ఉంటుందని, ఇది 2031-32నాటికి 1,20,549 మిలియన్‌ యూనిట్లకు చేరుతుందని పేర్కొంది. 2021-22లో రాష్ట్రంలో అత్యధిక డిమాండ్‌ 14,176 మెగావాట్లు ఉండగా...2026-27లో 19,529 మెగావాట్లు, 2031-32లో 27,059 మెగావాట్లుగా ఉండనుందని అంచనా వేసింది.

ట్రాన్స్‌కోకు టారిఫ్‌ సబ్సిడీ విడుదల

వివిధ వర్గాలకు రాయితీ, ఉచితంగా విద్యుత్తు సరఫరా చేయడానికి వీలుగా జూన్‌కు రూ.958.33 కోట్ల టారిఫ్‌ సబ్సిడీని ప్రభుత్వం ట్రాన్స్‌కోకు విడుదల చేసింది. వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్తుతోపాటు మిషన్‌ భగీరథ, వాటర్‌బోర్డు, ఎత్తిపోతల పథకాలకు కరెంట్‌ సరఫరాతోపాటు 200 యూనిట్లలోపు గృహ వినియోగదారులకు రాయితీతో విద్యుత్తును అందిస్తున్నందుకుగాను ఈ సబ్సిడీని ప్రభుత్వం ప్రతి నెలా అందిస్తోంది.

Updated Date - 2023-06-02T02:45:03+05:30 IST