ఆధ్యాత్మిక నగరి బూరుగడ్డ
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:13 AM
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలంలోని బూ రుగడ్డలో కొలువైన శ్రీశాల్మలీకంద శ్రీఆదివారాహ, శ్రీలక్ష్మీనర్సింహ, శ్రీవేణుగోపాలస్వామి దేవాలయం ఆధ్యాత్మి క శోభతో విరాజిల్లుతోంది. భృగు మహర్షి నడయాడిన నేల. భృగుమహర్షి తపస్సు చేసిన ప్రాంతం కావడంతో బూరుగడ్డగా ఈ ప్రాంతం వాసికెక్కింది.
భృగుమహర్షి నడయాడిన నేల
దక్షిణ భారత దేశంలో అరుదైన దేవాలయాల్లో ఒకటి
కాకతీయుల కాలంలోనే ఆలయ నిర్మాణం
24 అడుగుల అనంతపద్మనాభస్వామి ఏకశిలా విగ్రహం
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలంలోని బూ రుగడ్డలో కొలువైన శ్రీశాల్మలీకంద శ్రీఆదివారాహ, శ్రీలక్ష్మీనర్సింహ, శ్రీవేణుగోపాలస్వామి దేవాలయం ఆధ్యాత్మి క శోభతో విరాజిల్లుతోంది. భృగు మహర్షి నడయాడిన నేల. భృగుమహర్షి తపస్సు చేసిన ప్రాంతం కావడంతో బూరుగడ్డగా ఈ ప్రాంతం వాసికెక్కింది. దీంతో పాటు కాకతీయుల కాలంలోనే 116 శివాలయాలు ఉన్న ఆధ్యాత్మిక కేంద్రంగా వర్థిల్లింది. ఈ దేవాలయంలో ఒకే పీఠంపై ముగ్గురు దేవతామూర్తులు కొలువు దీరడంతో పాటు నాలుగో దేవదేవుడు అనంతపద్మనాభస్వామి యోగ నిద్రలో ఉన్న విగ్రహం సాక్షాత్కరిస్తుంది.
- హుజూర్‌నగర్
దేవాలయంలో చంద్రపుష్కరిణి, సూర్యపుష్కరిణలు ఉన్నాయి. వాటిల్లో వేసవిలో సైతం నీరు పుష్కలంగా ఉండడం గమనార్హం. ఆలయ ప్రాంగణంలో 940 ఏళ్ల నాటి పారిజాత వృక్షం ఇప్పటికీ ఉండడం విశేషం. దక్షిణభారత దేశంలోనే హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డలో 24అడుగుల అనంతపద్మనాభస్వామి ఏకశిలా విగ్రహం ఉండడం విశేషం. భృగుమహర్షి తపస్సు చేసిన ప్రాంతం కావడంతో బూరుగడ్డగా వాసికెక్కింది. శతాబ్దాల క్రితం ఇక్కడ 116 శివాలయాలతో నిత్యం శివ నామస్మరణతో మార్మోగిన బూరుగడ్డ నేటికీ ఆధ్యాత్మికతకు నెలవైంది. శతాబ్దాలు, దశాబ్దాలు దాటినా చెక్కుచెదరని ఈ ఆలయం నిత్య ధూప, దీప, నైవేద్యాలతో భక్త్తులను అక్కున చేర్చుకుంటుంది.
దేవాలయానికి వందల ఎకరాల మాన్యం భూములు
ఈ దేవాయానికి సంబంధించి హుజూర్‌నగర్, గోపాలపురం గ్రామాల పరిధిలో సుమారు 560ఎకరాల మాన్యం భూములు ఉన్నాయి. కాగా ప్రతి ఏటా ఈ ఆలయానికి కౌలు చెల్లించడంతో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. కాగా గోపాలపురం గ్రామం 80 శాతం, గోపాలపురం ఆంజనేయస్వామి దేవాలయం కూడా దేవాలయ భూముల్లోనే కొలువుదీరి ఉంది. ఈ ఆలయానికి ప్రతిఏటా సుమారు రూ.14 లక్షల ఆదాయం లభిస్తుంది. సుమారు 465 ఎకరాలకు కౌలు ఇస్తున్నారు. దేవాలయ మాన్యంలో 120 సర్వే నెంబర్‌లో ఉండగా 330 మంది కౌలుదారులు ఉన్నారు. గోపాలపురం, హుజూర్‌నగర్, ముత్యాలనగర్, రాయనిగూడెం గ్రామాలకు చెందిన రైతులు కౌలుకు చేస్తున్నారు.
నైవేద్యం లేకుండానే..
తమిళనాడులోని త్రివేండ్రంలో 28అడుగుల అనంతపద్మనాభస్వామి విగ్రహం ఉండగా, ఇక్కడ 24అడుగుల్లో అనంత పద్మనాభుడు మూడు ద్వారాల వెనుక భాగంలో యోగ నిద్రలో ఉన్న విగ్రహాన్ని తిలకించవచ్చు. తలాపున మానిక పెట్టుకుని యోగనిద్రలో కొలువుదీరి ఉండడంతో తల భాగం ఎత్తుగా ఉంటుంది. కాగా స్వామివారి తలపైన నాగశేష పడిగ పురివిప్పి ఉంటుంది. కాగా స్వామివారికి నైవేద్యం కిం ద రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టెడు బియ్యం, పుట్టెడు పప్పు అనగా ఎనిమిది బస్తాల బియ్యం, ఎనిమిది బస్తాల పప్పును నైవేద్యంగా సమర్పించేవారు. సుమారు 350 సంవత్సరాల క్రితం కరవుకాటకాలు రావడంతో స్వామివారికి నైవేద్యాన్ని నివేదించలేకపోయారు. కొన్నేళ్ల తర్వాత మళ్లీ స్వామివారికి నైవేద్యం సమర్పించేందుకు ప్రయత్నించారు. నైవే ద్యం కింద 560 ఎకరాల బియ్యం, 560 ఎకరాల పప్పును ఒకేరోజు నైవేద్యంగా సమర్పించాలని కోరినట్లు, భక్తులు అంత నైవేద్యం చెల్లించలేమని వేడుకున్నారని, గతంలో మాదిరిగా నాకు నైవేద్యం అవసరం లేదని స్వామి వారు చెప్పడంతో ఆ నాటి నుంచి ఈనాటి వరకు నైవేద్యం లేకుండానే అనంతపద్మనాభస్వామికి భాద్రపద శుద్ధ చతుర్ధ శి రోజున అనంతపద్మనాభస్వామి వ్రతంలో విశేషమైన పూ జలు నిర్వహిస్తున్నారు. ప్రతినెలా భక్తులతో చతుర్ధశి నాడు అనంతపద్మనాభస్వామి విగ్రహం వద్ద కోటి వత్తులతో దీపారాదన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. భాద్రపద శుద్ధ చతుర్ధశి రోజున అనంతపద్మనాభుడిని దర్శించుకునేందుకు వేలమంది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. అనంతపద్మనాభస్వామి విగ్రహ పాదాలు స్పృషిస్తే మానవుని పాదాలు ఎంత మెత్తగా ఉంటాయో ఆ విధమైన తలంపు ఉంటుందని భక్తుల నమ్మకం. అదేవిధంగా స్వామివారి రెండు పాదాలు స్పృషించడం వల్ల 500 సంవత్సరాల, ఐదు జన్మల పాపాలు పోయి పుణ్యం వస్తుందని ప్రతీతి.
ఈ దేవాలయంలో దక్షిణ భారతదేశ తమిళ సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఎన్నో విశిష్ఠతలు కలిగిన బూరుగడ్డ దేవాలయానికి ఏపీ, తెలంగాణ తెలుగు రాష్ర్టాలతో పాటు తమిళనాడు నుంచి భక్తులు తరలివచ్చి స్వామివార్లకు పూజలు చేయడం విశేషం. ఈ దేవాలయంలో అర్చకులు ముడుంబై హరీ్‌షకుమారాచార్యులు, ముడుంబై శ్రీనివాసాచార్యులు తమిళ సంప్రదాయం ప్రకారం పూజలు చేయడం మరో విశేషం. ప్రతి ఏటా క్షేత్ర పౌర్ణమి సందర్భంగా దేవాలయంలో పదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తుంది. దక్షిణ భారత దేశంలోని అనేక దేవాలయాలలో చేసే పూజా విధానాన్ని అనుసరిస్తూ ఈ దేవాలయంలోను పూజలు నిర్వహిస్తున్నారు. కాగా గోదాదేవి అమ్మవారికి భోగి పండుగ నాడు శ్రీవేణుగోపాలస్వామి వారితో కల్యాణం నిర్వహిస్తున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
చెన్నగోపీనాథుని కోసం నిర్మించిన ఆలయం
బూరుగడ్డలో కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం చెన్న గోపీనాధుని కోసం నిర్మించారు. కాగా చెన్నగోపీనాథుని విగ్రహాన్ని కాకతీయుల కాలంలో కర్నాటక రాష్ట్రం నుంచి తీసుకొచ్చారు. ఆలయ నిర్మాణ సమయంలో తురుష్కులు దండయాత్ర చేసినప్పుడు చెన్నగోపీనాథుని విగ్రహాన్ని తీసుకెళ్లి ధ్వంసం చేశారు. దీంతో ఈ ఆలయంలో శ్రీఆదివరాహా లక్ష్మీనర్సింహ, వేణుగోపాలస్వామి వార్లను ప్రతిష్ఠించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. కాగా ఆలయంలోని శిలా శాసనంలో మాత్రం ఈ మందిరాన్ని చెన్నగోపీనాథుని మందిరంగా లిఖించడం గమనార్హం.
24 అడుగుల అనంత పద్మనాభస్వామి విగ్రహం
దక్షిణ ముఖంతో ఉన్న శ్రీవేణుగోపాలస్వామి దేవాలయాన్ని పూర్వం చెన్నగోపినాథుని ఆలయంగా పిలిచేవా రు. రెండువేల సంవత్సరాల క్రితం ఈ దేవాలయంలో 24 అడుగుల అనంత పద్మనాభస్వామి విగ్రహాన్ని ఏర్పాటుచేయగా 1170 కాకతీయుల కాలంలో ప్రతాపరుద్ర మహారా జు పరిపాలనా కాలంలో సత్రం బొల్లంరాజు ఈ ఆలయా న్ని నిర్మాణం చేసినట్లు శాసనాల్లో లిఖించారు. ఈ దేవాలయంలో శ్రీశాల్మలీకంద, శ్రీగోదాదేవి అమ్మవారు, 18 మం ది ఆళ్వారుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. దేవాలయంలో ఒకే పీఠంపై శ్రీఆదివరాహా, శ్రీలక్ష్మీనర్సింహా, శ్రీవేణుగోపాలస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించగా, ఒక వైపు అనంతపద్మనాభస్వామి, మరో వైపు గోదాదేవి అమ్మవారు, ఇంకో వైపు ఆళ్వా రులు, దేవాలయం సమీపంలో రెండు శివాలయాలు ఉన్నాయి. దీంతో పాటు దేవాలయంలో చంద్ర పుష్కరిణి, సూర్యపుష్కరిణి అనే రెండు కోనేర్లు ఉన్నాయి.