Share News

నడుము చుట్టూ నోట్ల కట్టలు

ABN , First Publish Date - 2023-11-29T04:13:06+05:30 IST

నడుము చుట్టూ నోట్ల కట్టలను పెట్టుకుని వెళుతున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. రూ.10 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

నడుము చుట్టూ నోట్ల కట్టలు

5 లక్షల చొప్పున తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్‌

భద్రాద్రి జిల్లా దమ్మపేటలో 10 లక్షలు పట్టివేత

ఖాజాగూడలో ఓ కారులో 1.68 కోట్లు స్వాధీనం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) : నడుము చుట్టూ నోట్ల కట్టలను పెట్టుకుని వెళుతున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. రూ.10 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నెమలిపేట పెట్రోల్‌ బంకు ప్రాంతంలో మంగళవారం ఎన్నికల అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు దమ్మపేట మండల కేంద్రం నుంచి బైక్‌పై వెళుతూ అనుమానాస్పదంగా కనిపించారు. వారిని వెంబడించిన పోలీసులు ఒక్కొక్కరు రూ.5 లక్షల నగదు నడుము చుట్టూ కట్టుకొని తరలిస్తున్నట్లు గుర్తించారు. దమ్మపేటలోని మందలపల్లి చెక్‌పోస్టు వద్ద రూ.80వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో తరలిస్తున్న రూ.1.68 కోట్ల డబ్బును మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసులు పట్టుకున్నారు. ఖాజాగూడ గ్రీన్‌ గ్రేస్‌ అపార్టుమెంట్‌ నుంచి బయటకు వచ్చిన ఇన్నోవా కారులో రూ.1.68 కోట్ల నగదు దొరికింది.

వాహనంలో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా.. జడ్చర్లకు చెందిన కాంగ్రెస్‌ అభ్యర్థికి సంబంధించిన డబ్బు అని వెల్లడించారు. వరంగల్‌ జిల్లా కిలా వరంగల్‌ మండలం నక్కలపల్లిలో ఎన్నికల పరిశీలన బృందం రూ.2.66 లక్షలను పట్టుకుంది. సంగెం మండలం ఆశాలపల్లి నుంచి వరంగల్‌ వైపు వస్తున్న కారును సోదా చేయగా ఈ నగదు దొరికింది. మంచిర్యాల జిల్లాలో రూ. 78.98 లక్షలు, కరీంనగర్‌ జిల్లాలో రూ. 3.58 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలంలో రూ.8 లక్షల విలువైన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. హనుమకొండ మండలం గుండ్లసింగారం డిపో నుంచి మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరుకు చెందిన తొమ్మిది మద్యం షాపులు, రెండు బార్లకు వాటి యజమానులు వ్యాన్‌లో మద్యం తరలిస్తున్నారు. ఇందులో సుమారు రూ.8 లక్షల విలువైన 48 మద్యం పెట్టెలు ఉన్నాయి. కిష్టాపురం క్రాస్‌ రోడ్‌ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టు దగ్గర పోలీసులు ఈ వ్యాన్‌ను పట్టుకున్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో సోమవారం అర్ధరాత్రి పోలీసులు పెద్ద మొత్తంలో మద్యాన్ని పట్టుకున్నారు. లారీలో 170 మద్యం పెట్టెలు ఉన్నాయని, విలువ రూ.20.40 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-11-29T04:13:07+05:30 IST