మళ్లీ దరఖాస్తుల పరిశీలన
ABN , First Publish Date - 2023-03-02T03:13:06+05:30 IST
ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జీవో నంబరు 59 కింద దరఖాస్తు చేసుకొన్న వారందరి స్థలాలను క్రమబద్ధీకరించేందుకు పరిశీలించనుంది. అయితే 2022 మార్చి నాటి మార్కెట్
జీవో 59 కింద మరింత వెసులుబాటు
దరఖాస్తు చేసుకునే నాటికి స్థలం
స్వాధీనంలో ఉంటే క్రమబద్ధీకరణకు అర్హత
2022 మార్చినాటి విలువ ప్రకారం రుసుము
తిరస్కరించిన దరఖాస్తుల పరిశీలనకు వీలు
హైదరాబాద్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జీవో నంబరు 59 కింద దరఖాస్తు చేసుకొన్న వారందరి స్థలాలను క్రమబద్ధీకరించేందుకు పరిశీలించనుంది. అయితే 2022 మార్చి నాటి మార్కెట్ విలువలే (రిజిస్ట్రేషన్ వాల్యూ) ప్రామాణికంగా క్రమబద్ధీకరణ రుసుం తీసుకోనున్నారు. దీంతో దరఖాస్తుదారులకు రుసుం భారీగా పెరిగే అవకాశం ఉంది. క్రమబద్ధీకరణ కోసం జీవో నంబరు 59 కింద దరఖాస్తులు చేసుకొనేందుకు ప్రభుత్వం విధించిన కటాఫ్ తేదీని ఎత్తివేస్తూ చీఫ్ కమిషనర్ ఆఫ్ లాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ) నవీన్ మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన అఖిల పక్ష సమావేశం అనంతరం 2014 డిసెంబరులో ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ కోసం జీవో నంబరు 59 జారీ చేశారు. తర్వాత కొన్ని స్థలాలను క్రమబద్ధీకరించారు. ఆ తర్వాత వచ్చిన విజ్ఞప్తుల మేరకు 2022 ఫిబ్రవరిలో ఆ జీవో కింద మళ్లీ దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. దీంతో 63,748 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను 2022 సెప్టెంబరులో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అందులో 35వేల దరఖాస్తులను పరిశీలనలోనే తిరస్కరించారు. తిరస్కరించిన దరఖాస్తుల్లో 2014 జూన్2 నాటికి స్వాధీనంలో లేని భూముల దరఖాస్తులు కూడా ఉన్నట్లు అధికారులు తేల్చారు. అయితే ఈ జీవో కింద కిందటి ఏడాది వరకు దరఖాస్తులు సమర్పించే నాటికి స్వాధీనంలో ఉన్న వారికే అర్హత కల్పిస్తూ తాజాగా ప్రభుత్వం పాత జీవోకు సవరణ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో తిరస్కరించిన వారి దరఖాస్తుల పరిశీలనకు వీలు కలిగింది. స్వాఽధీనంలో ఉన్నట్టుగా ఆధారాలు సమర్పిస్తే క్రమబద్ధీకరణకు అర్హులేనని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
భారంగా క్రమబద్ధీకరణ రుసుం
క్రమబద్ధీకరణ కోసం 2014లో జారీ చేసిన ఉత్తర్వుల్లో అప్పటి మార్కెట్ విలువలను ప్రామాణికంగా తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం జారీ చేసిన ఉత్తర్వులో మాత్రం మార్కెట్ విలువలను ప్రస్తావించలేదు. దీంతో దరఖాస్తుదారులందరు అప్పటి మార్కెట్ విలువలే తీసుకొని క్రమబద్ధీకరిస్తారని భావించారు. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో క్రమబద్ధీకరణ 2022 మార్చి నాటి మార్కెట్ విలువలనే (రిజిస్ట్రేషన్ వాల్యూ) ప్రామాణికంగా తీసుకోనున్నట్లు పేర్కొనడంతో అర్జీదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉత్తర్వుల్లో పేర్కొన్న మార్కెట్ విలువలను తీసుకుంటే క్రమబద్ధీకరణ రుసుం భారీగా పెరగనుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రమబద్ధీకరణకు గుర్తించిన లబ్ధిదారులకు వివిధ రేట్ల (స్లాబ్ విధానం)ను అమలు చేయనున్నారు. నోటిఫైడ్ చేసిన స్లమ్ ఏరియా (మురికివాడలు)లో ఉండే వారికి 126-150 గజాల విస్తీర్ణానికి మార్కెట్ విలువ (రిజిస్ట్రేషన్ వాల్యూ)లో 10 శాతం, ఇతర ప్రాంతాల్లోని వారికి 20 శాతం చొప్పున చార్జీలు వసూలు చేయనున్నారు. 250 గజాల వరకు 25 శాతం, 500 గజాలకు 50 శాతం, 1000 గజాలకు 70 శాతం, 1000 గజాలకుపైన ఉన్న వారికి 100 శాతం మార్కెట్ విలువ (రిజిస్ట్రేషన్ వాల్యూ)ను రుసుముగా వసూలు చేయనున్నారు. కొనుగోలు చేసిన స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లు, నిర్మాణాలకు పన్ను చెల్లింపు రశీదు, కరెంట్ బిల్లులను ఆధారాలుగా చూపితేనే క్రమబద్ధీకరణ చేయనున్నారు.
మార్కెట్ విలువలు ఇలా...
రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ విలువలు (రిజిస్ర్టేషన్ వాల్యూ) ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్ ఆధారంగా 2022 ఫిబ్రవరిలో ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. జిల్లాల్లో గజం భూమి విలువ రూ.300 నుంచి రూ.14,200 వరకు ఉంది. పంచాయతీలు, మండల, జిల్లా కేంద్రాలు, ప్రధాన రహదారుల పరిధిలో ఒక్కో విధంగా మార్కెట్ విలువలను నిర్ధారించారు. హైదరాబాద్‌ను ఆనుకొని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో గజం మార్కెట్ విలువ రూ.14,200 నుంచి రూ.52,700 వరకు ఉంది. ఈ ప్రాంతాల్లో జీవో నంబరు 59 కింద క్రమబద్ధీకరించుకునే వారికి భారీగా రుసుముల భారం పడనుందని కొందరు ఆందోళన చెందుతున్నారు.