బీఆర్‌ఎస్‌-బీజేపీ డబుల్‌ డ్రామా

ABN , First Publish Date - 2023-07-21T03:10:57+05:30 IST

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాల సందర్శనకు బయలుదేరడం, ఆయనను పోలీసులు వెంబడించి అరెస్టు చేయడం, ఆయన రోడ్డుపై బైఠాయించడం...

బీఆర్‌ఎస్‌-బీజేపీ డబుల్‌ డ్రామా

కాంగ్రెస్‌ నాయకుల ధ్వజం

పార్లమెంటు జరుగుతుంటే కేంద్రమంత్రి

కిషన్‌ రెడ్డికి తెలంగాణలో ఏం పని?

ముందు మణిపూర్‌లో తిరగాలి: సీతక్క

తొమ్మిదేళ్ల తర్వాత డబుల్‌ బెడ్‌ రూం

ఇళ్లు గుర్తొచ్చాయా?: దయాకర్‌

హైదరాబాద్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాల సందర్శనకు బయలుదేరడం, ఆయనను పోలీసులు వెంబడించి అరెస్టు చేయడం, ఆయన రోడ్డుపై బైఠాయించడం... ఇదంతా బీఆర్‌ఎస్‌, బీజేపీలు కలిసి ఆడుతున్న డ్రామా అని కాంగ్రెస్‌ నాయకులు విమర్శించారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే కిషన్‌ రెడ్డి ఆ సమావేశాల్లో పాల్గొనకుండా ఇక్కడ నాటకాలాడుతున్నారని ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల సమస్య ఎప్పటి నుంచో ఉందని ఆమె గుర్తుచేశారు. వాటి సందర్శనకు వెళుతున్న కిషన్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసే అంత అవసరం లేదన్నారు. మణిపూర్‌లో అలర్లు, దారుణ ఘటనలు జరుగుతుంటే దానిపై సైలెంట్‌గా ఉన్న ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి తెలంగాణలో డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన తెలంగాణలో తిరిగే ముందు ఈశాన్య రాష్ట్రాల్లో తిరగాలని హితవు పలికారు. వర్షాలు వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకుండా బీఆర్‌ఎస్‌, బీజేపీలు రాజకీయ నాటకాలకు తెరలేపాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌ విమర్శించారు. బీజేపీకి తొమ్మిదేళ్ల తర్వాత డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల గురించి ఇప్పుడు గుర్తు వచ్చిందా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎ్‌సను కాపాడేందుకే కిషన్‌ రెడ్డి నిరసన చేపట్టారని, ఆయనకు సీఎం కేసీఆర్‌ సహకరిస్తున్నారని ఆరోపించారు.

వర్షాలతో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని, ఆయా ప్రాంతాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కిషన్‌ రెడ్డి డ్రామా చూస్తే ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం సైతం నవ్వుకుంటారని ఏఐసీసీ ఆదివాసీ సెల్‌ ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్‌ వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రిని పోలీసులు అరెస్ట్‌ చేస్తారా? అని ప్రశ్నించారు. బండి సంజయ్‌కి క్రెడిట్‌ పోతుందని కిషన్‌ రెడ్డి అరెస్ట్‌ చేయించుకున్నారన్నారు. ఇది బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఆడుతున్న డ్రామా అని, అవసరమైతే కవితను అరెస్ట్‌ చేస్తారని, కేసీఆర్‌పై బీజేపీ కేసు పెట్టే చాన్స్‌ ఉందన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ కుమ్మక్కు రాజకీయాల్లో ఇదొక భాగమని మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. బాట సింగారంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణ పరిశీలనకు తాము పలుసార్లు వెళ్లామని, అప్పుడు తమను ఎవరూ అడ్డుకోలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్‌ పడిపోతున్న నేపథ్యంలో కేసీఆర్‌ కావాలనే మళ్లీ లేపే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

Updated Date - 2023-07-21T03:10:57+05:30 IST