బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2023-03-02T02:30:13+05:30 IST

ఎంతోకాలంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన సర్పంచ్‌

బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ ఆత్మహత్యాయత్నం

సుల్తానాబాద్‌, మార్చి 1: ఎంతోకాలంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన సర్పంచ్‌ ఎంపీడివో కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం జరిగింది. సుల్తానాబాద్‌ మండలం రేగడి మద్దికుంటకు చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన సర్పంచ్‌ అన్నేడి రవీందర్‌రెడ్డి గ్రామంలో రూ.7 లక్షలకు పైగా ఖర్చు చేసి సీసీ రోడ్డు నిర్మించారు. అలాగే గ్రామ పంచాయతీ నిర్వహణకు సంబంధించిన మరో లక్షన్నర బిల్లులు రావాల్సి ఉంది. వీటి కోసం సర్పంచ్‌ పదిహేను రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో అందరూ చూస్తుండగానే క్రిమిసంహారక మందు తాగగా వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామానికి చెందిన పనులు చేసినా బిల్లులు పాస్‌ చేసి నిధులు జీపీ అకౌంట్‌లో వేయడం లేదని, పైగా బిల్లుల క్లియరెన్స్‌కు తనను డబ్బులు డిమాండ్‌ చేశారని ఆరోపించారు. ఎంపీవో ఫయాజ్‌ అలీకి రూ.5వేలు ఇచ్చానని, మరో రూ.10 వేలు డిమాండ్‌ చేస్తున్నాడని ఆరోపించారు. ప్రభుత్వం ఎపుడు నిధులు మంజూరు చేసినా తమ బిల్లుల క్లియరెన్స్‌కు ఆఫీసుల చుట్టూ తిరగడమే కాకుండా మామూళ్లు ఇచ్చుకోవాల్సి వస్తోందని, ఈ మామూళ్ల వేధింపులు తాళలేకనే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వివరించారు. కాగా, తాను సర్పంచ్‌ను డబ్బులు అడుగలేదని, ఆయనే తనను దుర్భాషలాడారని ఎంపీవో వివరణ ఇచ్చారు.

Updated Date - 2023-03-02T02:30:13+05:30 IST