BRS : బీఆర్‌ఎస్ గుండెల్లో రైళ్లు
ABN , First Publish Date - 2023-09-23T02:56:06+05:30 IST
దేశానికే తెలంగాణ రాష్ట్రం రోల్‌మాడల్ అన్నారు. తెలంగాణలో అమలయ్యే పథకాలు దేశంలో ఎక్కడా లేవని, తమకూ ఇటువంటి పథకాలు కావాలని ఇతర రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయని,
తమ పథకాలు దేశానికే ఆదర్శమంటూ ఇన్నాళ్లూ ఆర్భాటం
ఎన్నికల వేళ అధికారపార్టీలో మొదలైన గుబులు
ఓవైపు ప్రజా వ్యతిరేకత.. మరోవైపు కాంగ్రెస్ జోరు
ఆ పార్టీ 6 గ్యారెంటీలకు పెరుగుతున్న ఆదరణ
దళితబంధు, ఇతర పథకాల్లో అవినీతి, కమీషన్లు
లబ్ధిదారులకు అంతంతమాత్రంగానే ఫలితాలు
కొత్త పథకాలపై కసరత్తులో ముఖ్యమంత్రి కేసీఆర్
రైతులకు ఉచిత ఎరువులపై మరోసారి హామీ
పింఛన్ పెంపు, మహిళలకు బస్సుల్లో ఉచిత జర్నీ
ఉద్యోగులకు వేతన సవరణ, మధ్యంతర భృతి
అక్టోబర్ 16న వరంగల్ సభలో బీఆర్‌ఎస్ మేనిఫెస్టో!
హైదరాబాద్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): దేశానికే తెలంగాణ రాష్ట్రం రోల్‌మాడల్ అన్నారు. తెలంగాణలో అమలయ్యే పథకాలు దేశంలో ఎక్కడా లేవని, తమకూ ఇటువంటి పథకాలు కావాలని ఇతర రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయని, అందుకనే టీఆర్‌ఎ్‌సను బీఆర్‌ఎస్ పేరుతో జాతీయపార్టీగా మార్చామన్నారు. 2014లో మోదీ ప్రధాని అభ్యర్థిగా రంగంలోకి దిగినప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ‘గుజరాత్ మాడల్’ అట్టర్‌ఫ్లాప్ అయ్యిందని, తమదైన తెలంగాణ మాడల్‌ను దేశవ్యాప్తం చేస్తామని ప్రకటించారు. ఇంత ఘనంగా మాట్లాడినవాళ్లు ఇప్పుడు దేశం సంగతేమోగానీ ముందు తెలంగాణ ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలియక ఆగమాగం అవుతున్నారు. ప్రజల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తున్న వ్యతిరేకత ఓవైపు భయపెడుతుంటే, మరోవైపు, కాంగ్రెస్ వినూత్న పథకాలను ప్రకటించి ప్రజల్లో దూసుకుపోవటంతో కలవరపడుతున్నారు. ఇదీ బీఆర్‌ఎ్‌సలో ప్రస్తుత పరిస్థితి.
అమ్ములపొదిలో ఏమున్నాయ్?
ఆగస్టులో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ మాట్లాడుతూ, తమ వద్ద ఉన్న అమ్ములపొదిలో చాలా అస్త్రాలున్నాయని ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఎన్నికల వేళ ఆ అమ్ములపొద నుంచి కేసీఆర్ తీసే అస్త్రాలేమిటి అన్నదానిపై బీఆర్‌ఎ్‌సలో ఆసక్తి నెలకొంది. మరోవైపు, ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తోన్న పథకాలపై జనం స్పందన తెలుసుకోవటానికి కేసీఆర్ వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పలు జిల్లాలకు పంపారు. ప్రధానంగా దళితబంధుపై జనం నుంచి వస్తున్న స్పందన, బీసీ, మైనారిటీలకు ప్రకటించిన రూ.లక్ష సాయం పథకం, సొంతస్థలం ఉండి ఇంటిని నిర్మించుకునే వారికి అందించే రూ.3లక్షల సాయం పథకమైన ‘గృహలక్ష్మి’పై జనంలో జరిగే చర్చను క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నారు. దళితబంధు విజయవంతంగా నడుస్తుందని అధికారులు పుస్తకాలు అచ్చువేయించి ఇస్తున్నప్పటికీ.. ఆ పథకం అందరికీ అందకపోవడం, ఎమ్మెల్యేలు కమీషన్ తీసుకుంటున్నారంటూ స్వయంగా సీఎం కేసీఆరే పేర్కొనటం నేపథ్యంలో దీనిపై దళితుల్లోనే పెద్ద ఎత్తున అసమ్మతి నెలకొంది. బీసీ, మైనారిటీలకు అందించే రూ.లక్ష సాయం పథకం కూడా పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందడంలేదు. దీంట్లో కూడా రాజకీయ నేతల జోక్యం పెరిగిందని, లబ్ధిదారులకు కాకుండా బీఆర్‌ఎస్ అనుకూల వర్గాలకే ప్రాధాన్యమిస్తున్నారనే విమర్శలున్నాయి.
‘గృహలక్ష్మి’ పథకం అసలు ఎన్నికల నాటికి అందుతుందా లేదా అన్న సందిగ్ధత ఏర్పడింది. ఈ వివరాలతో కూడిన నివేదిక సీఎంకు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుత పథకాలపై జనంలో ఉన్న అసంతృప్తిని తొలగించేలా కొత్త పథకాలకు రూపకల్పన చేయటంపై బీఆర్‌ఎస్ మల్లగుల్లాలు పడుతోంది. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలపై అంతర్మథనంలో పడింది. వచ్చే ఎన్నికల్లో జనంలోకి వెళ్లేందుకు ఏయే పథకాలను తీసుకురావాలి, వాటితో ఎంతమేర ఓటర్లను ఆకర్షించవచ్చనే అంశంపై పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు.. కొత్త పథకాలను ప్రవేశపెట్టింది తామేనని, ఇపుడు కాంగ్రెస్ వచ్చి చేస్తామంటే ప్రజలు నమ్ముతారా అని బీఆర్‌ఎస్ భావిస్తూ వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలు జనంలో చర్చనీయాంశంగా మారాయి. రైతులు, మహిళలు, యువతకు హస్తం పార్టీ ఇచ్చిన హామీలపై రోజురోజుకు క్షేత్రస్థాయిలో ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ పునరాలోచనలో పడింది. తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్నందున ప్రభుత్వ వ్యతిరేకత సహజమే కానీ, విపక్షం బలంగా లేకపోవటంతోపాటు తాము అమలు చేస్తున్న పథకాల అండతో గట్టెక్కుతామని బీఆర్‌ఎస్ ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చింది. కానీ, ఊహించినట్లుగా పరిస్థితులు లేకపోవటంతో కలవరం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ఫీనిక్స్ పక్షిలా పుంజుకోవటం, ప్రజలను ఆకట్టుకునేలా పథకాలను ప్రకటించటం, ఇంటింటికీ ఆ పథకాల గ్యారెంటీ కార్డులను అందజేయటం బీఆర్‌ఎ్‌సను, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను పునరాలోచనలో పడేశాయి. కాంగ్రెస్ పథకాలపై జనంలో జరుగుతున్న చర్చకు అడ్డుకట్ట వేయాలంటే కొత్త పథకాలు ప్రకటించాల్సిందేనని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. కానీ, ప్రజల్ని ఆకర్షించేలా ఎటువంటి కొత్త పథకాలను తీసుకురావాలన్నదానిపై స్పష్టతకు రాలేకపోతున్నారు. ప్రస్తుతానికైతే ‘ఉచిత ఎరువుల’ పథకాన్ని మరోసారి తెరమీదకు తీసుకురానున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆరునూరైనా ఇస్తామన్నారు కానీ..
2017 ఏప్రిల్ 13న రైతులతో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రైతులందరికీ వచ్చే ఏడాది (2018) నుంచి 24 లేదా 26 లక్షల టన్నుల ఎరువులను ఉచితంగా అందిస్తామన్నారు. కానీ ఏండ్లు గడుస్తున్నా.. ఆ హామీ అమలు కాలేదు. ఇప్పుడు, వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీని ప్రముఖంగా పేర్కొనాలని బీఆర్‌ఎస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. ఎకరాకు 2 బస్తాల చొప్పున యూరియా అందించాలని ప్రాఽథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే యూరియాను కేంద్రం రాయితీతోనే అందిస్తోంది. మిగతా ఎరువులైన డీఏపీ, ఎన్‌పీకేతోపాటు పురుగుమందుల ధరలుఅధికంగా ఉంటున్నాయి. దీంతో ఉచిత ఎరువుల హామీలో యూరియాని మాత్రమే అందిస్తారా, ఇతర ఫెర్టిలైజర్లను కూడా కలుపుతారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. రైతులను ప్రసన్నం చేసుకోవటానికి ఎరువుల పథకంపై యోచిస్తున్న బీఆర్‌ఎస్.. ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చటానికి కసరత్తు చేస్తోంది. పీఆర్సీ, ఐఆర్‌పై ప్రకటన చేయాలని, త్వరలో నిర్వహించబోయే కేబినేట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇస్తున్న సంక్షేమ పింఛన్లను పెంచాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఖమ్మం సభలో కాంగ్రెస్.. పింఛన్ కింద రూ.4 వేలు ఇస్తామని ప్రకటించింది. దీనిపై వెంటనే స్పందించిన బీఆర్‌ఎస్.. దివ్యాంగులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.3,016 పింఛన్‌కు అదనంగా మరో వెయ్యి కలిపి నెలకు రూ.4,116 ఇస్తామని ప్రకటించింది. ఇదే క్రమంలో ఆసరా పింఛన్లను కూడా పెంచాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించాలనే దానిపైనా బీఆర్‌ఎ్‌సలో కసరత్తు సాగుతోంది. బీఆర్‌ఎస్ మేనిఫెస్టోను అక్టోబర్ 16న వరంగల్‌లో నిర్వహించే సభలో ప్రకటించనున్నట్టు సమాచారం. అక్టోబర్ మొదటివారంనాటికి కొత్త పథకాలపై నిర్ణయం తీసుకోనున్నారు.