REVANTH : కాంగ్రెస్ గ్యారంటీలతో బీఆర్‌ఎస్ కకావికలం
ABN , First Publish Date - 2023-09-20T04:43:20+05:30 IST
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని, కాంగ్రెస్ గ్యారంటీలతో బీఆర్‌ఎస్ నేతలు కకావికలం అవుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

కేసీఆర్ ప్రభుత్వానికి మిగిలింది 99 రోజులే
సోనియా రాకతో బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం ముసుగులు తొలగాయి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 19 : రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని, కాంగ్రెస్ గ్యారంటీలతో బీఆర్‌ఎస్ నేతలు కకావికలం అవుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా గాంధీ తెలంగాణకు రావడంతో బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీల అసలు రంగు బయటపడిందని చెప్పారు. తమకు అధికారం ఇస్తే ఏం చేస్తామో చెబుతూ ప్రజల్లోకి వెళ్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు గాంధీభవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విజయభేరి సభలో సోనియాగాంధీ ఆరు గ్యారంటీలు ప్రకటించగా, వంద రోజుల్లో వాటిని అమలు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ట్రాక్‌రికార్డు చూసి నిర్ణయం తీసుకోవాలని ప్రజలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మధ్య తేడా గమనించాలని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, అర్హులకు పోడు భూముల పట్టాలు, ఆరోగ్య పథకాలు అమలు చేసి చూపించామన్నారు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు అంటూ కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు.
2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, తెలంగాణ ఏర్పాటయ్యాక కేసీఆర్ ఇచ్చిన హామీలపై చర్చ పెడితే ఎవరు మాట తప్పారో తెలిసిపోతుందని సవాలు విసిరారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మరో 99 రోజులే మిగిలుందని ఈ సందర్భంగా అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఏర్పాటు కలను నెరవేర్చిన సోనియా గాంధీ రాష్ట్రానికి వస్తే స్వాగతించాల్సిన బీఆర్‌ఎస్ నేతలు విమర్శించారని ధ్వజమెత్తారు. రాజకీయ విచక్షణ కోల్పోయిన బీఆర్‌ఎస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ సభకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు. సోనియాగాంధీ రాకతో బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం ముసుగులు తొలగిపోయాయని ఆరోపించారు. విజయభేరి, సీడబ్ల్యూసీ సమావేశాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఇక, కాంగ్రెస్ పార్టీపై హరీశ్ రావు పిచ్చి వాదనలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే, కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత ధరణిని రద్దు చేస్తామని రేవంత్ పునరుద్ఘాటించారు. ధరణి స్థానంలో మెరుగైన విధానాన్ని తీసుకువస్తామని చెప్పారు. ధరణి కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం, దొరల ధోరణికి ప్రతిరూపం అని ఆరోపించారు. మత విద్వేషాలతో రాజకీయాలు చేసే బీజేపీకి భరతమాత గురించి మాట్లాడే అర్హత ఉందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.