నాగజ్యోతి ఎంపిక వ్యూహాత్మకమే!

ABN , First Publish Date - 2023-08-22T04:34:34+05:30 IST

ములుగు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా బడే నాగజ్యోతిని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ వ్యూహాత్మకంగానే ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోంది.

నాగజ్యోతి ఎంపిక వ్యూహాత్మకమే!

సీతక్కను ఎదుర్కొనేందుకు బీఆర్‌ఎస్‌ కసరత్తు

నాగజ్యోతికి ఏడాది కాలంగా బీఆర్‌ఎస్‌ ప్రాధాన్యం

కేటీఆర్‌ పర్యటన సమయంలోనే అభ్యర్థిత్వం ఖరారు!

ములుగు, ఆగస్టు 21: ములుగు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా బడే నాగజ్యోతిని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ వ్యూహాత్మకంగానే ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోంది. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం, అనుభవం కూడా లేని ఆమెను ప్రకటించడంలో బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం భారీ కసరత్తు చేసింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్కను ఎదుర్కోవాలంటే దీటైన అభ్యర్థిని రంగంలోకి దించాలనే ప్రయత్నంలో నాగజ్యోతిని ఎంపిక చేశారు. మాజీ నక్సలైట్‌ అయిన సీతక్క కోయ సామాజిక వర్గానికి చెందిన వారు. ఆమెకు కోయలతో పాటు మావోయిస్టు భావజాలం ఉన్న ఓ వర్గం అండగా ఉంటోంది. సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజాదరణ పొందారు. ఈ క్రమంలో నక్సలైట్‌ నేపథ్యం ఉన్న నాగజ్యోతిపై బీఆర్‌ఎస్‌ దృష్టి పెట్టింది. కోయ సామాజిక వర్గానికే చెందిన ఆమె తల్లిదండ్రులు రాజేశ్వరి, నాగేశ్వర్‌రావు ఇద్దరూ పీపుల్స్‌వార్‌ పార్టీలో అజ్ఞాతంలో పనిచేశారు. బాబాయి దామోదర్‌ ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. దీంతో ఇటు సామాజిక వర్గం ఓటర్లు, అటు వామపక్ష భావజాల వర్గాన్ని ప్రభావితం చేయొచ్చనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్‌ నాగజ్యోతిని ఎంపిక చేసినట్టు స్పష్టమవుతోంది. నిజానికి గత ఏడాదిగా నాగజ్యోతికి బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ప్రాధాన్యమిస్తూ వస్తోంది. ఆమె 2019లో స్వతంత్ర అభ్యర్థిగా తాడ్వాయి మండలం కాల్వపల్లి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. తర్వాత బీఆర్‌ఎస్‌ నుంచి తాడ్వాయి జడ్పీటీసీగా గెలిచారు. జూన్‌ 7న ములుగు సభలో మంత్రి కేటీఆర్‌ నాగజ్యోతిని హైలెట్‌ చేస్తూ కాబోయే ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ చెప్పకనే చెప్పారు. రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాలుగేళ్లలోనే ఎమ్మెల్యే అభ్యర్థిగా నాగజ్యోతికి అవకాశం దక్కింది.

Updated Date - 2023-08-22T04:34:34+05:30 IST