Share News

క్యాంప్‌ నుంచి వచ్చిన బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు

ABN , Publish Date - Dec 26 , 2023 | 12:00 AM

భువనగిరి మునిసిపల్‌ అవిశ్వాస తీర్మాన రాజకీయం వేడెక్కుతోంది.

క్యాంప్‌ నుంచి వచ్చిన బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు

అడ్వాన్సగా రూ.1లక్ష ఇచ్చినట్టు వినికిడి

వారి అసంతృప్తిని సొమ్ము చేసుకోవాలనుకుంటున్న విపక్షాలు

భువనగిరి టౌన, డిసెంబరు 25: భువనగిరి మునిసిపల్‌ అవిశ్వాస తీర్మాన రాజకీయం వేడెక్కుతోంది. పాలక పక్షంగా ఉన్న బీఆర్‌ఎ్‌సలో స్వపక్ష కౌన్సిలర్లే తిరుగుబావుటా ఎగురవేయగా, ఈ పరిణామాలను సద్వినియోగం చేసుకోవాలని విపక్షాలు యత్నిస్తున్నాయి. మునిసిపల్‌ చైర్మన ఎనబోయిన ఆంజనేయులు, వైస్‌చైర్మన చింతల కిష్టయ్యను గద్దె దించే లక్ష్యంతో క్యాంప్‌నకు వెళ్లిన పాలకపక్షం బీఆర్‌ఎస్‌ అసంతృప్త కౌన్సిలర్లు నాలుగు రోజుల అనంతరం సోమవారం భువనగిరికి తిరిగి వచ్చారు.

మునిసిపల్‌ చైర్మన పదవిపై కన్నేసిన బీఆర్‌ఎ్‌సకే చెందిన ఓ కౌన్సిలర్‌ ఈ అసంతృప్త కౌన్సిలర్లకు పెద్ద మొత్తంలో ప్యాకేజీని ఆఫర్‌ చేస్తూ అడ్వాన్సగా రూ.1లక్ష చొప్పున చెల్లించారని స్థానికంగా గుప్పుమంటోంది. అదే సమయంలో తన మద్దతుదారులతో సంతకాల సేకరణ చేపట్టడం కూడా ఆసక్తిగా మారింది. చైర్మన, వైస్‌చైర్మనపై మూడు నెలల క్రితమే 19మంది సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మాన నోటీసును అందజేసినప్పటికీ, తాజాగా మరోమారు సంతకాల సేకరణను చేపట్టడం చర్చనీయాంశమైంది. తనకు మద్దతు ఇస్తూ అడ్వాన్స తీసుకున్న కౌన్సిలర్లు మాట తప్పకుండా ఉండేందుకే రూపొందించిన వ్యూహంలో భాగంగానే తన మద్దతుదారుల నుంచి సదరు కౌన్సిలర్‌ సంతకాలను సేకరిస్తున్నట్టు పలువురు పేర్కొంటున్నారు.

రాష్ట్రంలో మారిన రాజకీయ చిత్రం నేపథ్యంలో సమష్టిగా ఉండాల్సిన బీఆర్‌ఎస్‌ అందుకు భిన్నంగా స్వపక్షంలో విపక్షంగా మారి ప్రస్తుత చైర్మన, వైస్‌చైర్మనను గద్దె దించాలని యత్నిస్తుండటంతో మునిసిపాలిటీపై జెండా రంగు మారే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు. నూతన చైర్మన, వైస్‌చైర్మనను ఎన్నుకోవడంలో రాష్ట్రంలోని అధికార పార్టీదే కీలక పాత్ర అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 35 మంది సభ్యులు ఉన్న కౌన్సిల్‌లో పాలకపక్షం బీఆర్‌ఎ్‌సకు 20 మంది కౌన్సిలర్ల బలం ఉండగా చైర్మన, వైస్‌చైర్మనకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణలో ఇప్పటి వరకు మెజార్టీ బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు సంతకాలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో 9 మంది కౌన్సిలర్లు ఉన్న కాంగ్రెస్‌, ఆరుగురు సభ్యులు ఉన్న బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఎలాగైనా ప్రస్తుత చైర్మన, వైస్‌చైర్మనను గద్దె దించాలని బీఆర్‌ఎస్‌ అసంతృప్తులు ప్రయత్నాలు ముమ్మరం చేయగా, బీఆర్‌ఎస్‌ అసమ్మతి రాజకీయాలను సొమ్ము చేసుకోవాలని విపక్షాలు వేచి చూస్తుండటంతో మునిసిపల్‌ రాజకీయాలు ఆసక్తిగా మారాయి.

Updated Date - Dec 26 , 2023 | 12:00 AM