కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ ఆరా...!

ABN , First Publish Date - 2023-09-18T04:54:54+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో దూకుడు పెంచింది. ప్రజలను ఆకర్షించడమే లక్ష్యంగా విరివిగా హామీలు ఇవ్వడమే కాకుండా ఇటీవల వరుసగా డిక్లరేషన్లు విడుదల చేస్తోంది.

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ ఆరా...!

తిప్పికొట్టడం ఎలా అని ‘కారు’ వర్గాల్లో తీవ్ర చర్చ

హైదరాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో దూకుడు పెంచింది. ప్రజలను ఆకర్షించడమే లక్ష్యంగా విరివిగా హామీలు ఇవ్వడమే కాకుండా ఇటీవల వరుసగా డిక్లరేషన్లు విడుదల చేస్తోంది. ఆదివారం జరిగిన విజయభేరి సభలోనూ కీలక వాగ్ధానాలు చేసింది. ఈ ఎన్నికల హామీలపై ఇటు ప్రజలతోపాటు అటు బీఆర్‌ఎస్‌ వర్గాల్లోనూ తీవ్ర చర్చ నడుస్తోంది. కాంగ్రె్‌సవి అలవికాని హామీలని బీఆర్‌ఎస్‌ వర్గాలు పైకి కొట్టిపారేస్తున్నప్పటికీ.. ఆయా హామీలు తమకు ఏమైనా నష్టం చేస్తాయా ? అని పార్టీ శ్రేణులు అంతర్గతంగా మల్లగుల్లాలు పడుతున్నాయి. నిజానికి, ఆదివారం నాటి సభలో కాంగ్రెస్‌ ఏం ప్రకటనలు చేస్తుందని బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఉదయం నుంచే ఆసక్తిగా ఎదురు చూశాయి. కాంగ్రెస్‌ హామీలపై కొందరు నేతలు తమ అనుయాయులతో చర్చలు జరిపి ఆరాలు తీశారని తెలిసింది. అయితే, కాంగ్రెస్‌ హామీలను తిప్పికొట్టేందుకు ఏం చెయ్యాలి అనే దానిపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూడా కసరత్తు చేస్తున్నారని సమాచారం. కాంగ్రె్‌సను మించి హామీలు ఇద్దామా ? లేనిపక్షంలో కాంగ్రెస్‌ హామీల అమలు అసాధ్యమని ప్రజలకు చెబుదామా ? అనే దిశలో బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు ఆలోచనలు చేస్తున్నట్టు తెలిసింది. ఏదేమైనా కాంగ్రెస్‌ దూకుడుకు కళ్లెం వేసి మూడో సారి అధికారాన్ని దక్కించుకోవాలని బీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు.

Updated Date - 2023-09-18T04:54:54+05:30 IST