పాత ప్రాజెక్టులకు ఊపిరి!
ABN , Publish Date - Dec 24 , 2023 | 04:05 AM
నీటి పారుదల ప్రాజెక్టుల్లో ప్రభుత్వ ప్రాథమ్యాలు మారనున్నాయి. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత ప్రాజెక్టులను మళ్లీ తెరమీదకు తేనుంది.
ప్రాధాన్య జాబితాలోకి ప్రాణహిత,
ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు-రంగారెడ్డి
గ్రావిటీ ప్రాజెక్టులకే అత్యధిక ప్రాధాన్యం
సీతారామ ఎత్తిపోతల పథకంపైనా సమీక్ష
కాంగ్రెస్ పాలనలో మారనున్న ప్రాథమ్యాలు
హైదరాబాద్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): నీటి పారుదల ప్రాజెక్టుల్లో ప్రభుత్వ ప్రాథమ్యాలు మారనున్నాయి. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత ప్రాజెక్టులను మళ్లీ తెరమీదకు తేనుంది. ప్రధానంగా బీఆర్‌ఎస్ హయాంలో ప్రాధాన్యం తగ్గించిన ప్రాజెక్టులకు కొత్త ప్రభుత్వం ఊపిరులూదనుంది. కరెంట్ బిల్లుల ఖర్చు గణనీయంగా తగ్గించేలా అంబేడ్కర్ ప్రాణహితతోపాటు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు టన్నెల్(ఎ్‌సఎల్‌బీసీ), పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఐరావతంలా మారనుందని తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే ఆ ప్రాజెక్టుపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల కాంపోనెంట్లను ప్రస్తుత ప్రభుత్వం పక్కనపెట్టే అవకాశాలున్నాయి. ఇతర కాంపోనెంట్లను వినియోగించుకుంటూ తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టడం ద్వారా గ్రావిటీతో నీటిని తరలించేందుకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును కొత్త ప్రభుత్వం తెరపైకి తెచ్చే అవకాశాలున్నాయి. దీనికి బలం చేకూర్చేలా ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం ఓ ప్రకటన చేశారు. ఇక, తుమ్మిడిహెట్టికి ప్రత్యాయ్నాయంగా గత ప్రభుత్వం వార్ధా ప్రాజెక్టును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. కొత్త ప్రభుత్వం.. ఆ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టే అవకాశాలే అధికంగా ఉన్నాయి. ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టి, పూర్వ ఆదిలాబాద్ జిల్లాకు సాగు, తాగునీరు అందించనున్నారు. ఆ తర్వాత ఎల్లంపల్లి నుంచి చేవెళ్ల దాకా పాత కాంపోనెంట్ల పనులు చేపట్టే అవకాశం ఉంది.
మరోవైపు.. బీఆర్‌ఎస్ హయాంలో ప్రాధాన్యం లేని జాబితాలో ఉన్న శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ ప్రాజెక్టును ప్రథమ ప్రాధాన్య జాబితాలోకి తీసుకురావాలని కాంగ్రెస్ సర్కారు భావిస్తోంది. 2005లో ఈ ప్రాజెక్టును ప్రారంభించగా, శ్రీశైలం వైపు నుంచి ఒక సొరంగం(ఇన్‌లెట్ టన్నెల్), మన్నెవారిపల్లి(అచ్చంపేట) నుంచి మరో సొరంగం(ఔట్‌లెట్ టన్నెల్) తవ్వుతున్నారు. మొత్తం 44 కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్వాల్సి ఉండగా, ఇప్పటిదాకా 33.919 కిలోమీటర్ల మేర తవ్వారు. మరో 10 కిలోమీటర్ల మేర టన్నెల్ పూర్తి చేస్తే.. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వరప్రదాయినిగా మారనుంది. నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం టన్నెల్ నిర్మాణ పనులను వేగిరం చేస్తామని, నిర్మాణ సంస్థకు అవసర మైన నిధులు ఇస్తామని ఇటీవలే ప్రకటించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను కూడా ప్రభుత్వం ప్రాధాన్య జాబితాలో చేర్చనుంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ఏర్పడిన తర్వాత చేపట్టగా... ఆశించిన స్థాయిలో పనులు జరగలేదు. సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తె లంగాణ ప్రభుత్వం ఒక్క మోటార్‌ను ప్రారంభించి, మొత్తం పథకమంతా పూర్తయినట్టుగా హడావుడి చేసింది. అయితే, కొత్త ప్రభుత్వం అలైన్ మెంట్లను మార్చి... ఇందులో భాగంగానే చేపడుతున్న డిండి ఎత్తిపోతలను వేరుగా చూపే అవ కాశాలున్నాయి. ఇక, సీతారామ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా సమీక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని ప్యాకేజీల పనులను పునఃసమీక్షించే వీలుంది. గత ప్రభుత్వం పక్కన పెట్టిన ప్రాణహిత-చేవెళ్ల, ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల పథకాలనే ప్రాధాన్య జాబితాలో చేర్చి, పూర్తి చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.