బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం

ABN , First Publish Date - 2023-02-21T01:00:50+05:30 IST

ఆర్తత్రాణపరాయణుడు.. కోరిన కోరికలు తీర్చే భక్తజన బాంధవుడు.. ఏకశిఖరవాసుడు.. స్వయంభువు యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడి దివ్యక్షేత్రం తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. లోకకల్యాణం, విశ్వశాంతి కోసం ముక్కోటిదేవతలు ఆహూతులుగా యాదగిరికొండ వేదికగా ఈ ఆధ్యాత్మిక వేడుకలు కొనసాగనున్నాయి.

బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం

విశ్వక్సేనారాధనతో నేడు ప్రారంభం

11 రోజుల పాటు కొనసాగనున్న వేడుకలు

27న ఎదుర్కోలు మహోత్సవం, 28న స్వామివారి కల్యాణోత్సవం

యాదగిరిగుట్ట: ఆర్తత్రాణపరాయణుడు.. కోరిన కోరికలు తీర్చే భక్తజన బాంధవుడు.. ఏకశిఖరవాసుడు.. స్వయంభువు యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడి దివ్యక్షేత్రం తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. లోకకల్యాణం, విశ్వశాంతి కోసం ముక్కోటిదేవతలు ఆహూతులుగా యాదగిరికొండ వేదికగా ఈ ఆధ్యాత్మిక వేడుకలు కొనసాగనున్నాయి. ఏటా ఫాల్గుణ శుద్ధ పాఢ్యమి నుంచి ఫాల్గుణ శుద్ధ ఏకాదశి వరకు 11 రోజుల పాటు వార్షిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆలయ సంప్రదాయం. ఈ ఏడాది ఈ నెల 21వ తేదీ నుంచి మార్చి 3 వరకు శ్రీవైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.

యాదగిరి గుట్ట ప్రధానాలయ ఉద్ఘాటన అనంతరం స్వయంభువు సన్నిధిలో ఆరేళ్ల తర్వాత కొనసాగనున్న తొలి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచేగాక దేశవిదేశాల నుంచి భక్తులు, గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకానుండటంతో అదే స్థాయిలో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. 21న బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానుండగా, 27న ఎదుర్కోలు, 28న తిరుకల్యాణోత్సవం, మార్చి 1న దివ్యవిమాన రథోత్సవ పర్వాలు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

నిత్య, మొక్కు కల్యాణాలు నిలివేత

బ్రహ్మోత్సవాలు సాగే 11 రోజుల పాటు స్వామివారి నిత్య, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హవన పూజలను నిలిపివేయనున్నారు. ప్రతీ రోజు రాత్రి నిత్యార్చనల అనంతరం రాత్రి 8.15గంటల నుంచి 9గంటల వరకు బలిహరణం, నివేదన నిర్వహిస్తారు. రాత్రి 7గంటలకు స్వామివారి అలంకార తిరువీధి సేవ నిర్వహించి సర్వ దర్శనాలు ఆరంభించి 10గంటలకు శయనోత్సవ దర్శనం, ఆలయ ద్వారబంధనం చేస్తారు. ఈ నెల 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు నిత్యార్చనలు, భోగములు, మార్చి 2, 3వ తేదీల్లో భక్తులు చేయించే అభిషేకం, నిత్యార్చనలు రద్దు చేసినట్టు ఆలయ అధికారులు ప్రకటించారు. కాగా, స్వామి సన్నిధిలో మొక్కు సేవలు 11 రోజుల పాటు సాయంత్రం 4గంటల నుంచి 5గంటల వరకు నిర్వహిస్తారు. మార్చి 3న బ్రహ్మోత్సవ వైదిక పర్వాల పూర్తి అనంతరం 4వ తేదీ శనివారం నుంచి ఆర్జిత, మొక్కు సేవోత్సవాలు తిరిగి ఆరంభమవుతాయి.

బ్రహ్మోత్సవాలకు తాత్కాలిక ఏర్పాట్లేనా?

లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన అనంతరం ఆరేళ్ల తరువాత తొలి వార్షిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండగా, అందుకు అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వామివారి నిత్యతిరుకల్యాణం, హోమ పూజల నిర్వహణకు ప్రత్యేక మండపాలు నిర్మించకపోవడంతో ప్రస్తుతం అష్టభుజి ప్రాకార మండపంలోనే నిర్వహిస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణంలో శాశ్వత యాగశాల, కల్యాణమండపాల నిర్మాణం లేకపోవడంతో మహోత్సవాల సందర్భంలో యాగశాలను అష్టభుజి ప్రాకార ఉత్తర దిశలోని మండపంలో తాత్కాలికంగా ఏర్పాటుచేస్తున్నారు. అదేవిధంగా విశిష్ట అతిథులు, స్థానికులతో పాటు భక్తులు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. స్వామివారి ఎదుర్కోలు, కల్యాణం, దివ్యవిమాన రథోత్సవం, చక్రతీర్థ స్నాన వేడుకల్లో పాల్గొని ఇష్టదైవాన్ని దర్శించుకొని మొక్కు చెల్లించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ విశేష వేడుకల నిర్వహణకు ప్రత్యేకంగా మండపాలు లేవు. దీంతో 2016 తర్వాత సుమారు ఆరేళ్ల అనంతరం మూలమూర్తులు కొలువుదీరిన ప్రదానాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నా తాత్కాలిక యాగశాల, కల్యాణమండపాల్లోనే ఈ వేడుకలు కొనసాగనున్నాయి.

భక్తుల పుణ్యస్నానాలు కొండకిందనే

యాదగిరిక్షేత్రాన్ని దర్శించుకునే భక్తులు కొండపైన విష్ణుపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ప్రధానాలయ పునర్నిర్మాణంతో పాటు విష్ణుపుష్కరిణిని ఆధునికీకరించారు. అయితే కొండపైన విష్ణుపుష్కరిణిలో నీటిని నింపకుండా వదిలేశారు. అయితే స్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి వేడుక చక్రతీర్థ స్నానఘట్టం. ఈ వేడుకలను గతంలో కొండపైన విష్ణుపుష్కరిణిలో నిర్వహించేవారు. కాగా, ఆలయ ఉద్ఘాటన అనంతరం భక్తుల పుణ్యస్నానాల కోసం కొండకింద గండి చెరువు సమీపంలో లక్ష్మీపుష్కరిణిని నూతనంగా నిర్మించి ప్రారంభోత్సవం చేశారు. నాటి నుంచి కొండకింద లక్ష్మీపుష్కరిణిలోనే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. స్వామివారి చక్రతీర్థ స్నాన ఘట్టాలను పరిమిత సంఖ్యలో అర్చకులు, అధికారుల నడుమ కొండపైన విష్ణుపుష్కరిణిలో నిర్వహించి పుణ్యజలాలను కలశంలో నింపి వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ దేవస్థాన ప్రచార రథంలో కొండకిందికి తరలించి లక్ష్మీపుష్కరిణిలో కలుపుతారు. అనంతరం సామాన్య భక్తులను ఈ పుష్కరిణిలో పుణ్యస్నానాలకు అనుమతిస్తారు. అయితే సువిశాలమైన, సహజసిద్ధ జలధారలతో కొండపైన ఉన్న విష్ణుపుష్కరిణిలో కాకుండా మానవ నిర్మితమైన పుష్కరిణిలో చక్రతీర్థ పుణ్యజలాలను కలిపి పుణ్యస్నానాలకు అనుమతించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. సుమారు 55లక్షల లీటర్ల సామర్ధ్యంతో సువిశాలమైన కొండపైన విష్ణుపుష్కరిణి(గుండం) ఉండగా, విస్తరణ తర్వాత కేవలం 3లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్ధ్యంతో చిన్నదిగా నిర్మించారు.

బ్రహ్మోత్సవ పర్వాలు ఇలా..

లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో 11 రోజుల పాటు నిర్వహించనున్న వార్షిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఇలా...

మంగళవారం ఉదయం 10గంటలకు విశ్వక్సేనారాధన, స్వస్తివాచనం, రక్షాసూత్రధారణలతో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు శ్రీకారంచుడుతారు. సాయంత్రం 6.30గంటలకు మృత్స్యంగ్రహణం, అంకురారోపణం.

ఈనెల 22న ఉదయం 8గంటలకు అగ్నిప్రతిష్ఠ, 11గంటలకు ధ్వజారోహణం,సాయంత్రం 6.30గంటలకు భేరీపూజ,దేవతాహ్వానం, హవనం.

23న ఉదయం 8గంటలకు అలంకార వాహన సేవ, వేదపారాయణాలు ప్రారంభం. రాత్రి 7గంటలకు శేషవాహన సేవ.

24న ఉదయం 9గంటలకు వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి 7గంటలకు హంసవాహన సేవ.

25న ఉదయం 9గంటలకు శ్రీకృష్ణాలంకార సేవ, రాత్రి 7గంటలకు పొన్నవాహన సేవ.

26న ఉదయం 9గంటలకు గోవర్ధనగిరిధారి అలంకారసేవ, రాత్రి 7గంటలకు సింహ వాహన సేవ.

27న ఉదయం 9గంటలకు జగన్మోహినీ అలంకారసేవ, రాత్రి 7గంటలకు అశ్వవాహన సేవ, స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం.

28న ఉదయం 9గంటలకు హనుమంతవాహనంపై శ్రీరామ అలంకార సేవ, రాత్రి 7గంటలకు గజవాహన సేవ, రాత్రి 8గంటల నుంచి 10గంటల వరకు బ్రహ్మోత్సవ తిరుకల్యాణం

మార్చి 1 ఉదయం 9గంటలకు గరుడ వాహనంపై శ్రీమహావిష్ణు అలంకారసేవ, రాత్రి 7గంటలకు దివ్యవిమాన రథోత్సవం.

2న ఉదయం 10గంటలకు మహాపూర్ణాహుతి, చక్రతీర్థం. సాయంత్రం 6గంటలకు శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవం.

3న ఉదయం 10గంటలకు అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9గంటలకు శృంగార డోలోత్సవం. బ్రహ్మోత్సవాల పరిసమాప్తి.

బ్రహ్మోత్సవాలకు పోచంపల్లి ‘ఇక్కత్‌’ పట్టుచీర

భూదాన్‌పోచంపల్లి: గుట్ట లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్ష్మీ అమ్మవారికి సమర్పించే పోచంపల్లి ఇక్కత్‌ పట్టుచీర సిద్ధమైంది. అమ్మవారిని పద్మశాలీలు తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. దీంతో ఏళ్లుగా లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఉత్సవమూర్తులకు పద్మశాలి మహాజన సంఘం అమ్మవారికి పట్టుచీర, స్వామివారికి పట్టు పంచె, శాలువ సమర్పించడం ఆనవాయితీ. ఈ మేరకు చేనేత కళాకారుడు మేకల రామకృష్ణ వాటిని అందంగా తయారుచేశారు. ఈ వస్త్రాలపై స్వామివారి ఆభరణాలు, శంఖు, చక్రాలు డిజైన్లు రూపొందించారు. వీటిని మంగళవారం ఉదయం స్థానిక మార్కండేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో గుట్ట లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సమర్పించనున్నారు.

భక్తులకు అన్ని సౌకర్యాలు: కలెక్టర్‌ పమేలాసత్పథి

భువనగిరి అర్బన్‌: లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ పమేలాసత్పథి అధికారులను ఆదేశించారు. సోమవారం అధికారుల తో కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ఆలయ పునర్నిర్మాణం అనంతరం తొలి బ్రహ్మోత్సవాలు కావడంతో ప్రముఖులు, భక్తుల కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బ్రహ్మోత్సవా ల్లో విశేష ఘట్టాలు ఎదుర్కోలు, తిరుకల్యాణం, దివ్యవిమాన రథోత్సవం సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో పలు చోట్ల ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటుచేయడంతోపాటు 104, 108 వాహనాలను అందుబాటులో ఉంచాలన్నారు. వేసవి దృష్ట్యా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, అన్ని రకాల మందులు సిద్ధంగా ఉంచాలన్నారు. కొండపైన, కింద పారిశుధ్య పనులు పక్కాగా నిర్వహించాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకోవాలన్నారు. విద్యుత్‌ అంతరా యం లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపాలన్నారు. సమీక్షలో డీసీపీ రాజే్‌షచంద్ర, అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివా్‌సరెడ్డి, ఆర్డీవో ఎంవీ.భూపాల్‌రెడ్డి, డీఎంహెచ్‌వో మల్లిఖార్జునరావు, ఆర్‌అండ్‌బీ ఈఈ శంకరయ్య, ఫుడ్‌సేఫ్టీ అధికారి స్వాతి, ఆర్టీసీ డిపో మేనేజర్‌ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T01:00:52+05:30 IST