KTR : బీజేపీనే మాతో పొత్తుకు సిద్ధమైంది

ABN , First Publish Date - 2023-10-05T03:12:25+05:30 IST

బీజేపీ, బీఆర్‌ఎ్‌సల మధ్య మాటల యుద్ధం మరింత వేడి పుట్టిస్తోంది.

KTR : బీజేపీనే మాతో పొత్తుకు సిద్ధమైంది

2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నాటి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వయంగా చెప్పారు

అప్పటి వీడియోను విడుదల చేసిన మంత్రి కేటీఆర్‌

మరు నిమిషంలోనే ఆ ఆఫర్‌ను తిరస్కరించాం

డిపాజిట్లు రాని బీజేపీతో పొత్తు ఏంటి?

మేం ఛీటర్స్‌ కాదు.. ఫైటర్స్‌

‘ఎక్స్‌’ వేదికగా బీజేపీపై కేటీఆర్‌ ఘాటు విమర్శలు

కాంగ్రెస్‌, బీజేపీ డబ్బులిస్తే తీసుకోండి

ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని విజ్ఞప్తి

హైదరాబాద్‌/నిర్మల్‌/కామారెడ్డి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): బీజేపీ, బీఆర్‌ఎ్‌సల మధ్య మాటల యుద్ధం మరింత వేడి పుట్టిస్తోంది. రెండు పార్టీల నేతల పరస్పర ఆరోపణలతో రాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శనాస్త్రాలు సంఽధిస్తూ పొలిటికల్‌ హీట్‌ను పెంచుతూ ఆసక్తిని రేపుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వచ్చి తనను కలిశారని, కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని, తాము ఎన్డీఏలో చేరతామని ప్రతిపాదించారని, అయితే వాటిని తాను నిర్ద్వంద్వంగా తిరస్కరించానని ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే.. మంత్రి కేటీఆర్‌ ఆ వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా స్పందించారు. అసలు తాము ఎన్డీఏలో చేరడం కాదు.. రాష్ట్రంలో బీజేపీనే తమతో కలిసి వస్తానంటే.. అందుకు తాము ఒప్పుకోలేదని స్పష్టం చేశారు.

‘‘గత అసెంబ్లీ ఎన్నికల (2018) పోలింగ్‌ ముగిసిన వెంటనే (ఫలితాలు రాకముందే) మాతో పొత్తుకు బిగ్గెస్ట్‌ ఝూటా పార్టీ (బీజేపీ) సిద్ధమైంది. నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కె. లక్ష్మణ్‌ స్వయంగా ఈ సంకేతాలను పంపించారు. ఆయన తన ఢిల్లీ బాసులు ఆమోదం తెలపకుండానే ఈ ఆఫర్‌ను చేశారా’’ అంటూ మంత్రి కేటీఆర్‌ సూటిగా ప్రశ్నించారు. ఇదిగో ఆయన నాడు పంపిన సంకేతాలకు సంబంధించిన వీడియో అంటూ ఓ న్యూస్‌ చానెల్‌ ప్రతినిధితో డాక్టర్‌ లక్ష్మణ్‌ మాట్లాడిన క్లిప్‌ను మంత్రి కేటీఆర్‌ బుధవారం ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశారు. బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. నాటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన ఆ ఆఫర్‌ను బీఆర్‌ఎస్‌ మరుక్షణమే తిరస్కరించిందని కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తెలుసుకోవాలని సూచించారు. కొన్ని అంశాలను మాత్రమే గుర్తుంచుకొని, కొన్నింటిని కావాలనే మర్చిపోయి, కట్టుకథలు అల్లుతున్న పొలిటికల్‌ టూరిస్టు ఈ విషయాన్ని తెలుసుకోవాలని పరోక్షంగా మోదీకి చురకలంటించారు. అయినా ఇంగితజ్ఞానం ఉన్నవారు ఎవరైనా బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా రాని కమలం పార్టీతో బీఆర్‌ఎస్‌ పొత్తు ఎందుకు పెట్టుకుంటుందని ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు పూర్తి మెజార్టీ వచ్చిన తర్వాత ఇక పువ్వు పార్టీతో తమకేం అవసరం అని అన్నారు. తాము ఛీటర్స్‌ కాదని, ఫైటర్స్‌ అని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమతో పొత్తుల కోసం అనేక విజ్ఞప్తులు వచ్చినా.. తాము సుముఖత చూపలేదన్నారు. నిజానికి అత్యంత బలవంతుడైన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఓడించేందుకు విపక్షాలన్నీ తమ సైద్ధాంతిక విభేదాలను సైతం పక్కనపెట్టి ఏకతాటిపైకి వచ్చాయని ఆయన అన్నారు.

బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో కాంగ్రెస్‌ తాతకు మించి ఉంటది

‘‘బీఆర్‌ఎస్‌.. కాంగ్రెస్‌ పార్టీకి బీ-టీం అని బీజేపీ, బీజేపీకి బీఆర్‌ఎస్‌ బీ-టీం అని కాంగ్రెస్‌ వాళ్లు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. మా పార్టీ ఎవరికీ బీ-టీం కాదు. తెలంగాణ ప్రజలకు ఏ-టీం’’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు మతిపోయి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాయని, ఆ పార్టీల మాటలను నమ్మవద్దని ప్రజలను కోరారు. బుధవారం నిర్మల్‌ జిల్లాలో రూ.1157 కోట్ల మేర పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లాలోని దిలావర్‌పూర్‌ మండలం గుండంపల్లిలో రూ.714 కోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్యాకేజీ 27 ఎత్తిపోతల పథకాన్ని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఆ తర్వాత సోన్‌ మండలంలోని పాత పోచంపాడ్‌ వద్ద 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్లతో నిర్మించే ఆయిల్‌ పాం ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో మునిసిపల్‌, ఆర్డీవో నూతన భవనాలను, పార్కులను స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మల్‌ జిల్లా కేంద్రంలో, బాన్సువాడలో నిర్వహించిన సభల్లో కేటీఆర్‌ మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో.. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో కంటే తాతకు మించి ఉంటుందని అన్నారు. పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా తమ వ్యానిఫెస్టో ప్రక్రియ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో కొనసాగుతుందన్నారు. రేవంత్‌రెడ్డి పక్కా బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ మనిషేనని, గతంలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాడని, ఇప్పుడు టీపీసీసీ చీఫ్‌ హోదాలో కాంగ్రెస్‌ సీట్లను కోట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ సచ్చిన పీనుగు లాంటిదని, దింపుడు గల్లం ఆశతో ఎన్నికల్లో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు వస్తోందన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అడుగుతున్న కాంగ్రె్‌సకు ఇప్పటివరకు 11 సార్లు అవకాశం ఇస్తే ఏం చేసిందని ప్రశ్నించారు. తాము చేసిందే చెబుతున్నామని ఒకవేళ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తాము చేయకుండా చేసినట్లు చెబితే ప్రజలు ఓట్లు వేయవద్దన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున కాంగ్రె్‌సకు కర్ణాటక నుంచి సంచుల్లో వేల కోట్ల ఎన్నికల ఫండ్‌ వస్తోందని ఆయన ఆరోపించారు.

మోదీవి గాలి మాటలు

ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్‌ సభలో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు కొత్త డ్రామాకు తెర లేపారని ఆరోపించారు. తనను సీఎం చేస్తానని కేసీఆర్‌ చెప్పినట్లు మోదీ పేర్కొనడం ఆయన హోదాకు తగదన్నారు. కేటీఆర్‌ను సీఎం చేయాలంటే మోదీ ఎన్‌వోసీ అవసరమా అని ప్రశ్నించారు. తమది ఢిల్లీకి, గుజరాత్‌కు గులాములు చేసే పార్టీ కాదని, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో రెండుసార్లు అధికారంలోకి వచ్చామని పేర్కొన్నారు. మోదీ తెలంగాణ ప్రజానీకానికి చేసిందేమీ లేదని, రాష్ట్రానికి గాలి మోటారుపై వచ్చి గాలి మాటలు చెప్పి ప్రజలను మోసగిస్తున్నారని విరుచుకుపడ్డారు. తొమిదేళ్లుగా జాతీయ గిరిజన విద్యాలయం, పసుపు బోర్డు గురించి మాట్లాడని ప్రధాని మోదీ.. అసెంబ్లీ ఎన్నికలున్నందునే ఆ రెండింటిని ప్రకటించారని మండిపడ్డారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలు ఓటుకు వేలాది రూపాయల డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయని, ఆ పార్టీలు ఇచ్చే డబ్బులు తీసుకుని ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని మంత్రి కేటీఆర్‌ ఓట్లర్లను కోరారు.

Updated Date - 2023-10-05T03:12:25+05:30 IST