బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే!

ABN , First Publish Date - 2023-05-27T03:04:55+05:30 IST

బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒకే తాను ముక్కలు. మేం ముందు నుంచీ చెబుతున్నట్లు బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే!

బీజేపీ జాతీయ నాయకుడు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం

నేతలూ భ్రమలు వీడి కాంగ్రెస్‌లోకి రండి.. ఔటర్‌ స్కాం లిక్కర్‌ కుంభకోణం కంటే పెద్దది: రేవంత్‌

రేవంత్‌కు హెచ్‌ఎండీఏ లీగల్‌ నోటీసులు.. 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్‌

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): ‘‘బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒకే తాను ముక్కలు. మేం ముందు నుంచీ చెబుతున్నట్లు బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే. కేసీఆర్‌, మోదీ అవిభక్త కవలలు. ఇటీవల మీడియాతో చిట్‌చాట్‌ సందర్భంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తమిళనాడు, కర్ణాటక ఇన్‌చార్జిగా ఉండి ఇప్పుడు మధ్యప్రదేశ్‌కు ఇన్‌చార్జిగా ఉన్న నాయకుడు చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం’’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. గెలవకుండా కాంగ్రెస్‌ను అడ్డుకోవడమే వారి లక్ష్యమని, ఈ ప్రక్రియలో బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని భావిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో బీజేపీది మూడో స్థానమేనని వాళ్ల జాతీయ నాయకులే చెబుతున్నారని, గట్టి నాయకులు 40 మంది లేకుండా ఎలా గెలుస్తామని ప్రశ్నిస్తున్నారని గుర్తు చేశారు. గాంధీ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటకలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి నాటకమాడాయని, జేడీఎస్‌ భారీగా ఓట్లు చీల్చేలా ప్లాన్‌ చేశాయని, తద్వారా, కాంగ్రెస్‌ ప్రభుత్వం రాకుండా అడ్డుకోవాలని చూశాయని, కానీ, అక్కడి ప్రజలు తిరస్కరించారని వివరించారు. ‘‘అక్కడ బీజేపీ పోషించిన పాత్రను ఇక్కడ బీఆర్‌ఎస్‌.. జేడీఎస్‌ పాత్రను బీజేపీ పోషిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రజలు ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి.

బీఆర్‌ఎస్‌ను ఓడించేది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గెలిపించాల్సిన అవసరం ఉంది. ఆవేశంతో బీజేపీలో చేరిన కొందరు నాయకులు ఆ తర్వాత ఆ పార్టీ అసలు రంగును తెలుసుకున్నారు. బీజేపీలో కొనసాగుతూ ఉక్కిరిబిక్కిరవుతున్న నేతలు ఇప్పటికైనా భ్రమలు వీడి కాంగ్రెస్‌తో కలిసి రావాలి’’ అని రేవంత్‌ మరోమారు పిలుపునిచ్చారు. ఆలోచన చేసి మంచి ముహూర్తంలో మంచి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ను ఓడించడం కాంగ్రెస్‌తోనే సాధ్యమని, కేసీఆర్‌ వ్యతిరేక పునరేకీకరణ జరగాలని పునరుద్ఘాటించారు. కాగా.. మజ్లిస్‌ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ప్రచారంతో మైనారిటీలు బీఆర్‌ఎస్‌కు ఓట్లేసి గెలిపిస్తున్నారని, గెలిచిన తర్వాత.. ఆ పార్టీ మైనారిటీల ఓట్లను తీసుకెళ్లి మోదీకి తాకట్టు పెడుతోందని, దీనిని ఒవైసీ ఎలా సమర్థించుకుంటారని నిలదీశారు. ఏ హామీలు అమలు చేశారని చెప్పి బీఆర్‌ఎస్‌ పాలనను మంత్రి హరీశ్‌ రావు సమర్థించుకుంటున్నారని ప్రశ్నించారు. తాను స్వాతిముత్యం, మామ ఆణిముత్యమని హరీశ్‌ అనుకుంటే సరిపోదని, అన్ని మంచిగా చేసి ఉంటే.. సెక్యూరిటీ లేకుండా హరీశ్‌, కేటీఆర్‌లు ఓయూకు వెళ్లి నిరుద్యోగులతో చర్చించాలని, క్షేమంగా తిరిగి వస్తే వాళ్లు చెప్పింది నిజమని ఒప్పుకుంటామని అన్నారు.

కేటీఆర్‌ ధనదాహానికి ఔటర్‌ బలి

మంత్రి కేటీఆర్‌ ధన దాహానికి ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) బలైందంటూ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. లక్ష కోట్ల రూపాయల విలువైన ఓఆర్‌ఆర్‌ టోల్‌ను రూ.7 వేల కోట్లకే తెగనమ్మాడని, ఇది ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కంటే వెయ్యి రెట్లు పెద్ద స్కామ్‌ అని ఆరోపించారు. ఓఆర్‌ఆర్‌ టెండర్ల వ్యవహారంలో కల్వకుంట్ల కుటుంబం దారి దోపిడీకి పాల్పడిందని, ఇందులో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ లబ్ధిదారులైతే.. సోమేశ్‌ కుమార్‌, అరవింద్‌ కుమార్‌ పాత్రదారులని ఆరోపించారు. ఓఆర్‌ఆర్‌ టోల్‌ స్కామ్‌పై విచారణ ఎందుకు జరిపించట్లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఓఆర్‌ఆర్‌ టోల్‌ టెండర్‌ను దక్కించుకున్న సంస్థ నిబంధనల ప్రకారం టెండర్‌ మొత్తం విలువలో 10 శాతాన్ని 30 రోజుల్లోగా, మిగిలిన మొత్తాన్ని 120 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుందని, కానీ, ఇలాంటి నిబంధనలు ఏమీ లేవంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బుకాయించారని, కానీ డబ్బు చెల్లింపునకు సంబంధించి కన్సెషన్‌ అగ్రిమెంట్‌లోని 20, 21 పేజీల్లో తాము చెప్పిన నిబంధనలు స్పష్టంగా ఉన్నాయని వివరించారు. 30 రోజుల్లో 10 శాతం కట్టాలని తాను చెప్పానని, వాస్తవానికి 25 శాతం మేరకు టెండర్‌ పొందిన సంస్థ చెల్లించాల్సి ఉందని వెల్లడించారు. మిగిలిన 75 శాతాన్ని 120 రోజుల్లో చెల్లించాలన్నారు.

ఒకవేళ నిబంధనలు ఏమైనా మార్చి ఉంటే.. వాటిని బయట పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఓఆర్‌ఆర్‌ టెండర్‌కు లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ జరిగి శుక్రవారంతో 30 రోజుల గడువు ముగిసిందని, టెండర్‌ పొందిన ఐఆర్‌బీ సంస్థ టెండర్‌ మొత్తంలో 25 శాతం అంటే.. రూ.1800 కోట్లు చెల్లించాల్సి ఉందని, ఒకవేళ చెల్లించకుంటే నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ టెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఒకవేళ టెండర్‌ నిబంధనలు మారిస్తే ఇది మరో ఢిల్లీ లిక్కర్‌ స్కాం తరహా కుంభకోణం అవుతుందన్నారు. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ రూపొందించినప్పుడు మొదట్లో నిబంధనలు కఠినతరంగా ఉన్నాయని, కానీ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత వెళ్లి లాబీయింగ్‌ చేయడంతో నిబంధనలు వారికి అనుకూలంగా మారాయని వివరించారు. ఆ వ్యవహారంలో రూ.100 కోట్లు లంచంగా ఇచ్చారన్నదే ప్రధాన అభియోగమని, దాన్ని అడ్డు పెట్టుకునే బీజేపీ పెద్ద ఎత్తున అరెస్టులు చేసిందని పేర్కొన్నారు. లిక్కర్‌ స్కాం కంటే పెద్ద స్కామ్‌ అయినా కానీ ఓఆర్‌ఆర్‌ స్కామ్‌పై బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. తెలంగాణలో ఇంత పెద్ద స్కాం జరుగుతుంటే కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని, ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు నిర్వహించడం లేదని నిలదీశారు. ఓఆర్‌ఆర్‌ టెండర్‌పైన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ సీబీఐకి ఫిర్యాదు చేశారని, సొంత పార్టీ ఎమ్మెల్యే ఫిర్యాదునూ వారు నమ్మట్లేదా అని ప్రశ్నించారు. ఈ అంశంపై తాము న్యాయ పోరాటం చేస్తామన్నారు.

Updated Date - 2023-05-27T03:04:55+05:30 IST