స్పష్టమైన కారణాలతోనే బిల్లులు వెనక్కి

ABN , First Publish Date - 2023-08-02T03:22:29+05:30 IST

తన వద్దకు వచ్చిన బిల్లులు ఎందుకు తిప్పి పంపించాల్సి వచ్చిందో ప్రభుత్వానికి వివరంగా చెప్పానని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు.

స్పష్టమైన కారణాలతోనే బిల్లులు వెనక్కి

ఆ విషయాన్ని ప్రభుత్వానికి వివరంగా చెప్పా

ఉద్దేశపూర్వకంగానే నాపై దుష్ప్రచారం

వరద ప్రభావిత ప్రజల కష్టాలు కలచివేశాయి

కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ

సహాయక చర్యలు అందడంలేదు

నష్టంపై నివేదిక రాగానే కేంద్రానికి పంపుతా

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వెల్లడి

నేడు వరంగల్‌ వరద ప్రాంతాల్లో సందర్శన

హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): తన వద్దకు వచ్చిన బిల్లులు ఎందుకు తిప్పి పంపించాల్సి వచ్చిందో ప్రభుత్వానికి వివరంగా చెప్పానని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. మూడు బిల్లులను తిప్పి పంపడం వెనుక కారణాలను స్పష్టం చెప్పానన్నారు. తిప్పి పంపడం తన ఉద్దేశం కాదని, ఈ విషయంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ మీడియాతో మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రజల కష్టాలు తనను ఎంతగానో కలిచివేశాయని, బాధితులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకోవాలని అన్నారు. వరదలు తగ్గుముఖం పట్టినా ఇప్పటికీ కొన్ని మారుమూల ప్రాంతాల్లో సహాయక చర్యలు అందడంలేదని తెలిపారు. హైదరాబాద్‌లోని జల్‌పల్లితోపాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలు వర్షం, వరదల వల్ల ఎంతగానో నష్టపోయాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రాజ్‌భవన్‌కు ఫోన్లు, మెసేజ్‌ల రూపంలో సమాచారం పంపిస్తున్నారని వెల్లడించారు. తమకు ఆహారం, నీరు కూడా అందడం లేదని చెబుతున్నారని, ప్రభుత్వం వారికి ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొన్ని రాజకీయ పార్టీలు వరద ప్రభావం, ప్రభుత్వ సహాయంపై తనకు వినతిపత్రాలు అందజేశాయన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన సహకారాన్ని రెడ్‌క్రాస్‌ సొసైటీ నుంచి రాజ్‌భవన్‌ అందజేస్తుందని తెలిపారు. వరద నష్టంపై ప్రభుత్వాన్ని నివేదిక కోరామని, అందిన వెంటనే పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని అన్నారు.


వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్‌ పర్యటన

రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నిర్ణయించారు. ఇందులో భాగంగా బుధవారం వరంగల్‌లో పర్యటించనున్నారు. గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలతోపాటు భద్రకాళి బండ్‌ను గవర్నర్‌ సందర్శిస్తారు. ఇల్లు కూలిపోయిన వారితో మాట్లాడి.. వారికి అందిన సహాయంపై చర్చిస్తారు. వరంగల్‌, హన్మకొండలో వరద ప్రభావం, సహాయక చర్యలపై అధికారుల నుంచి వివరాలు సేకరిస్తారు. గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించినట్లుగానే ఈసారి కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి జరిగిన నష్టం, బాధితులకు అందిన పరిహారం గురించి తెలుసుకుంటానని గవర్నర్‌ తెలిపారు.

Updated Date - 2023-08-02T03:22:29+05:30 IST