KTR: తెలంగాణ అభివృద్ధిపై నిబద్ధత చాటుకోండి
ABN , First Publish Date - 2023-01-15T03:10:34+05:30 IST
తెలంగాణకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకునే సమయం ఆసన్నమైందని రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు అన్నారు.
రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులు,
ప్రాజెక్టులను ఈ బడ్జెట్‌లోనైనా కేటాయించండి
కేంద్ర ఆర్థిక మంత్రికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ లేఖ
హైదరాబాద్, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకునే సమయం ఆసన్నమైందని రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు అన్నారు. తెలంగాణ అభివృద్ధి పట్ల తన నిబద్ధతను చాటుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి రాబోయే బడ్జెట్ ఉత్తమ సందర్భమని పేర్కొన్నారు. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులను ఈ బడ్జెట్‌లోనైనా కేటాయించాలని కోరారు. పరిశ్రమల శాఖ చేపట్టిన పలు కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ నిధుల సహకారం అందించాలంటూ శనివారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కు కేటీఆర్ లేఖ రాశారు. ఈ లేఖలో.. జహీరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న నిమ్జ్ మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులివ్వాలని కోరారు.
ఈ ప్రాజెక్టు వ్యయం అంచనాలు రూ.9,500 కోట్లుగా ఉన్నాయని, ఇందులో కనీసం రూ.500 కోట్లను మౌలిక వసతుల కల్పనకు ఈ బడ్జెట్లో కేటాయించాలన్నారు. హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌లకు నిధుల కేటాయింపులో తగిన ప్రాధాన్యం కల్పించాలని కోరారు. హైదరాబాద్ ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్‌ను కలిపే రెండు నోడ్స్‌కు దాదాపు రూ.5 వేల కోట్లు ఖర్చవుతుందని, ఇందులో కనీసం 50శాతాన్ని ఈ బడ్జెట్లో కేటాయించాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్-విజయవాడ పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా హుజూరాబాద్, జడ్చర్ల, గద్వాల, కొత్తకోట నోడ్‌లను తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందని, ఇందుకోసం సుమారు రూ.5 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనాలు సిద్ధం చేశామని తెలిపారు. ఇందులో కనీసం రూ.1500 కోట్లు ఈ ఏడాది కేటాయించాలని కోరారు.
ఫార్మాసిటీ, కేఎంటీపీకి సహకరించండి
టైస్ పథకం కింద జడ్చర్ల ఇండస్ర్టియల్ పార్క్‌లో కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సి ఉందని కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం అవసరమైన గ్యాస్ కేటాయింపులను వెంటనే ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు. బ్రౌన్‌ఫీల్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ల మంజూరు, అప్‌గ్రేడేషన్ చేయాలన్నారు. ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) యూనిట్‌ను మళ్లీ ప్రారంభించాలన్నారు. హైదరాబాద్‌లో నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ ఫార్మాసిటీకి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న డిఫెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్‌లో హైదరాబాద్‌ను చేర్చాలన్నారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ (కేఎంటీపీ) అభివృద్ధికి కనీసం రూ.500 కోట్లు మూలధన ప్రోత్సాహకాన్ని కేంద్రం అందించేందుకు వీలుందని, ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో రూ.300 కోట్లు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. సమగ్ర పవర్‌లూమ్ క్లస్టర్ డెవల్‌పమెంట్ స్కీమ్‌లో భాగంగా టెక్స్‌టైల్ పార్క్, వీవింగ్ పార్క్, అపెరల్ పార్క్‌లతో కూడిన మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను సిరిసిల్లకు మంజూరు చేయాలని, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేయాలని కోరారు. చేనేత రంగానికి జీఎస్టీని మినహాయించాలని, హైదరాబాద్‌లో నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ క్యాంప్‌సను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ఐటీ అభివృద్ధి కోసం ఐటీఐఆర్ మంజూరు చేసే విషయాన్ని పునఃపరిశీలించాలని, లేదంటే దానికి సమానమైన ప్రాజెక్టును ఇవ్వాలని కోరారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం ఖమ్మంలో సెయిల్ ద్వారా ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.