Bandi Sanjay : జీవితంలో కొన్ని అధ్యాయాలు ముగింపు దశకు రాకముందే ముగిసిపోతాయి

ABN , First Publish Date - 2023-07-05T04:30:26+05:30 IST

తనను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి జాతీయ నాయకత్వం తప్పించడంపై బండి సంజయ్‌ భావోద్వేగ ప్రకటన చేశారు. ‘మన జీవితంలో కొన్ని అధ్యాయాలు ముగింపు దశకు

Bandi Sanjay : జీవితంలో కొన్ని అధ్యాయాలు ముగింపు దశకు రాకముందే ముగిసిపోతాయి

బండి సంజయ్‌ భావోద్వేగ ట్వీట్‌

హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): తనను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి జాతీయ నాయకత్వం తప్పించడంపై బండి సంజయ్‌ భావోద్వేగ ప్రకటన చేశారు. ‘మన జీవితంలో కొన్ని అధ్యాయాలు ముగింపు దశకు రాకముందే ముగిసిపోతాయి’ అని వ్యాఖ్యానించారు. ‘నేను ఎప్పటికీ కార్యకర్తల్లో ఒకడినే.. ఇకపైనా కార్యకర్తగానే ఉంటా.. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ అభ్యున్నతి కోసం నూతనోత్సాహంతో పనిచేస్తా’ అని తెలిపారు. తన పదవికి అధికారికంగా వీడ్కోలు పలుకుతున్నట్లు ట్వీట్‌ చేశారు. తన పదవీకాలంలో పొరపాటున ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు. కేసీఆర్‌ పాలనకు వ్యతిరేకంగా తాను చేసిన పోరాటంలో కార్యకర్తల పాత్ర మరువలేనిదని, అరెస్టులకు, దాడులకు భయపడకుండా నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. ఎండా, వానా అన్నది పట్టించుకోకుండా తనకు తోడుగా ఉన్నారని, వారందరికీ హాట్సాఫ్‌ చెబుతున్నానన్నారు. తనలాంటి సాధారణ కార్యకర్తకు పార్టీ జాతీయ నాయకత్వం పెద్ద అవకాశం ఇచ్చిందని, అందుకు కృతజ్ణతలు అని పేర్కొన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో పాల్గొన్న తనను మనస్ఫూర్తిగా స్వాగతించిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నారు. ముఖ్యంగా, తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన కరీంనగర్‌ ఓటర్లకు, కార్యకర్తలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. తనను పలుసందర్భాల్లో అరెస్టు చేసినప్పుడు.. దాడులకు గురైనప్పుడు.. కార్యకర్తలు, నాయకులు తన వెన్నంటి నిలిచారన్నారు. తన పదవీకాలంలో మరచిపోలేని అనుభూతులు మిగిల్చారని సంజయ్‌ పేర్కొన్నారు.


Updated Date - 2023-07-05T04:30:26+05:30 IST