Share News

ఎస్సై నెట్టేయడంతో ఆటోవాలా మృతి

ABN , First Publish Date - 2023-12-11T03:58:14+05:30 IST

భూవివాదంపై ఠాణాలో సెటిల్మెంట్‌కు పిలిచిన ఓ ఎస్సై తోసేయడంతో.. ఆటోడ్రైవర్‌కు తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఉదంతమిది.

ఎస్సై నెట్టేయడంతో ఆటోవాలా మృతి

భూవివాదంపై ఠాణాలో పంచాయితీ

నల్లగొండ జిల్లా చింతపల్లిలో ఘటన

చింతపల్లి, డిసెంబరు 10: భూవివాదంపై ఠాణాలో సెటిల్మెంట్‌కు పిలిచిన ఓ ఎస్సై తోసేయడంతో.. ఆటోడ్రైవర్‌కు తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఉదంతమిది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని పాలెంతండాకు చెందిన నేనావత్‌ సూర్యనాయక్‌(55), భీమానాయక్‌లు అన్నదమ్ములు. సూర్య 20ఏళ్లుగా హైదరాబాద్‌లో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పాలెంతండా లో అన్నదమ్ముళ్లకు భూతగాదాలున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యపై భీమానాయక్‌ చింతపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెటిల్మెంట్‌కు రావాలంటూ ఎస్సై సతీశ్‌రెడ్డి సూచించడంతో.. సూర్యనాయక్‌ ఆదివారం సాయంత్రం ఠాణాకు వెళ్లారు. పంచాయితీ నడుస్తుండగా.. ఎస్సై సతీశ్‌రెడ్డి మెడపై చేయివేసి నెట్టివేయడంతో.. కిందపడిపోయిన సూర్య అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. దేవరకొండ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. ఎస్సై అకారణంగా కొట్టడం వల్లే సూర్య చనిపోయాడని, ఎస్సైపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్‌ చేశారు. ఈ విషయమై దేవరకొండ డీఎస్పీ గిరిబాబును వివరణ కోరగా.. సూర్యనాయక్‌ను ఎస్సై నెట్టివేయడం నిజమేనని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక ఎస్సైపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎస్పీ సదరు ఎస్సైని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేశారు.

Updated Date - 2023-12-11T03:59:11+05:30 IST