నిరుద్యోగులకు బాసటగా..

ABN , First Publish Date - 2023-05-27T01:19:35+05:30 IST

‘చిరిగిన చొక్కానై నా వేసుకో కానీ మంచి పుస్తకాన్ని కొనుక్కో’ అని పెద్దలు చెప్పినట్లు పుస్తకం ఓ మంచి నేస్తం... విజ్ఞానాన్ని అందిస్తుంది.. మేదస్సును వికసింపజేసి ఒంటరి తనాన్ని పారదోలుతుంది.. జీవితంలో అలముకున్న అంధకారాన్ని నిర్మూలించి విజ్ఞాన కాంతులను అందిస్తుంది.

నిరుద్యోగులకు బాసటగా..

జడ్పీ ఆధ్వర్యంలో ‘స్టడీ సెంటర్‌’

జిల్లా కేంద్రంలోని డీపీఆర్సీ భవనంలో ఏర్పాటు

విద్యార్థులు, నిరుద్యోగులు, యువతకు అధ్యయన కేంద్రం

జడ్పీ నిధుల ద్వారా అందుబాటులోకి సెంటర్‌

నేడు ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి

నల్లగొండ, మే 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ‘చిరిగిన చొక్కానై నా వేసుకో కానీ మంచి పుస్తకాన్ని కొనుక్కో’ అని పెద్దలు చెప్పినట్లు పుస్తకం ఓ మంచి నేస్తం... విజ్ఞానాన్ని అందిస్తుంది.. మేదస్సును వికసింపజేసి ఒంటరి తనాన్ని పారదోలుతుంది.. జీవితంలో అలముకున్న అంధకారాన్ని నిర్మూలించి విజ్ఞాన కాంతులను అందిస్తుంది. అపజయాలను అదిగమించడానికి దీనికి మించిన ఆయుధం లేదు. అన్ని రకాల పోటీ పరీక్షలకు సంసిద్ధం చేయడానికి అటువంటి మంచి మిత్రుల వంటి పుస్తకాలను అందించడానికి ప్రస్తుతం ప్రభుత్వం ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న గ్రంథాలయాలకు తోడుగా జిల్లా పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా స్టడీ సెంటర్‌(అధ్యయన కేంద్రం)ను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం ఉద్యోగాలకు పెద్దఎత్తున నోటిఫికేషన్లు ఇస్తుండడంతో నిరుద్యోగులు గ్రంథాలయాల బాటపట్టారు. జిల్లాలో ఏ గ్రంథాలయం చూసినా నిరుద్యోగులతో కిటకిటలాడుతోంది. అయితే గ్రామీణ, మండల, పట్టణ స్థాయిలోని గ్రంథాలయాల్లో నిరుద్యోగులకు, యువకులకు అన్ని పుస్తకాలు అందుబాటులో లేవు. అయితే జిల్లా గ్రంథాలయంలో ఇప్పటికే పెద్దఎత్తున పుస్తకాలను అందుబాటులో ఉంచడంతో పాటు గ్రంథాలయానికి వచ్చే యువతీ, యువకులకు మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటుచేశారు. ఇక జిల్లా పరిషత్‌ ఆధ్వర్యంలో సైతం పెద్దఎత్తున స్టడీ సెంటర్‌(అధ్యయన కేంద్రాన్ని)ను జిల్లా కేంద్రంలోని మిర్యాలగూడ రోడ్డులోని మహిళా ప్రాంగణం పక్కన ఉన్న డీపీఆర్సీ(జిల్లా పంచాయతీ రీసోర్స్‌ సెంటర్‌) భవనంలో ఏర్పాటుచేశారు. ఇందులో మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా రీడింగ్‌ హాలులను ఏర్పాటుచేశారు. ఫర్నీచర్‌తో పాటు పెద్దఎత్తున పుస్తకాలను సమకూర్చారు. ఇందుకు సంబంధించి జిల్లా పరిషత్‌ నుంచే నిధులు సమకూర్చారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ గ్రంథాలయానికి పెద్దఎత్తున పాఠకులు వస్తుండడంతో ఈ స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు బాసటగా నిలుస్తున్నారు.

స్టడీసెంటర్‌లో సకల సౌకర్యాలు

జిల్లా పరిషత్‌ ఆధ్వర్యంలో డీపీఆర్సీ భవనంలో ఏర్పాటుచేసిన స్టడీ సెంటర్‌ను మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి చేతుల మీదుగా శనివారం ప్రారంభించేందుకు జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిరుద్యోగులకు బాసటగా నిలవడానికి ఏర్పాటుచేసిన ఈ భవనంలో అధునాతన సౌకర్యాలను కల్పిస్తున్నారు. అధ్యయన కేంద్రంలో పుస్తకాలతో పాటు నిరుద్యోగులకు, విద్యార్థులకు కావాల్సిన ఇంటర్‌నెట్‌ సౌకర్యం, ప్రొజెక్టర్‌, కంప్యూటర్స్‌, ప్రింటర్‌, ఏసీ గదులు, విద్యార్థులకు ప్రత్యేకంగా రీడింగ్‌ హాల్స్‌ను ఏర్పాటుచేశారు. అదేవిధంగా కొంతమంది ప్రొఫెసర్స్‌, సివిల్స్‌ సాధించిన వారితో పోటీపరీక్షలకు కావాల్సిన మెలకువలు, సలహాలు, సూచనలు ఇవ్వడానికి ప్రత్యేకంగా తరగతులను నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వివిధ డిపార్టుమెంట్‌ టెస్టులకు ప్రిపరేషన్‌ కావడానికి అందుకు సంబంధించిన పుస్తకాలు, పంచాయతీరాజ్‌ చట్టానికి సంబంధించి పుస్తకాలను అందుబాటులో ఉంచారు.

విజ్ఞానం పెంపొందించడానికి

స్టడీ సెంటర్‌లో విద్యార్థులకు జ్ఞానం అందించడం కోసం అన్ని అంశాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంచనున్నారు. విద్యా నిపుణులకు, సాంకేతిక నిపుణులకు, శాస్త్రీయ ప్రముఖులకు సందేహాలు తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేయనున్నారు. పరిశోధకులకు వారి పరిశోధనకు కావాల్సిన విషయ సామాగ్రికి కూలంకశంగా తెలుసుకోవడానికి ఈ అధ్యయన కేంద్రం ఉపకరిస్తుందని భావిస్తున్నారు. సమాజంలో విద్యార్థులందరికీ ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉండే వారికి ఇంటి వద్ద చదువుకోవడానికి సరైన వసతులు లేక, పుస్తకాలు కొనే స్థోమత లేక ఇబ్బంది పడుతున్నారు. ఆధునిక సమాజంలో ఉద్యోగం పొందడం కోసం అనేక రకాల పోటీ పరీక్షలకు సిద్ధం కావడమే కాకుండా శిక్షణ తీసుకుంటున్నారు. కానీ కొంతమంది పేద, నిరుపేద విద్యార్థులు ఆర్థిక స్థోమత లేక సరైన వసతులు, పుస్తకాలు అందుబాటులో లేక వారిలో సామర్థ్యం ఉండి కూడా చదువుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో చదువుకున్న ప్రతి విద్యార్థికి వసతులు అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న విధంగా జడ్పీ స్టడీ సెంటర్‌లో ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేస్తున్నారు.

స్టడీ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలి : బండా నరేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌, నల్లగొండ

జిల్లా పరిషత్‌ ఆధ్వర్యంలో నల్లగొండలో డీపీఆర్సీ భవనంలో ఏర్పాటుచేస్తున్న స్టడీ సెంటర్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. నిరుద్యోగ యువతి, యువకులకు, విద్యార్థులకు, డిపార్టుమెంట్‌ పరీక్షలకు సిద్ధమయ్యే ఉద్యోగులకు ఇందులో అన్ని పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. పూర్తిస్థాయిలో ఆధునిక సౌకర్యాలతో స్టడీసెంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. యువతి, యువకులకు వేరువేరుగా రీడింగ్‌హాల్స్‌ను ఏర్పాటుచేశాం. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న డీపీఆర్సీ భవనంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు సకల సౌకర్యాలను కల్పించి అన్ని పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చాం. గ్రామీణ, పట్టణ విద్యార్థులు ఈ అధ్యయన కేంద్రాన్ని ఉపయోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి.

వ్యవసాయమే ప్రధాన ఎజెండా

నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం

నల్లగొండ, మే 26 : వ్యవసాయ రంగమే ప్రధాన అంశంగా శని వారం జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం జరిగే అవకాశాలు ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్న సమయంలో వానాకాలం వ్యవసాయ సీజన్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి అధ్యక్షతన జడ్పీ జనరల్‌ బాడీ సమావే శం జరగనుంది. వానాకాలం సీజన్‌లో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడంతో పాటు నకిలీ పత్తి విత్తనాలు అరికట్టేందేకు తీసుకోవాల్సిన చర్యల గురించి సమావేశంలో ప్రణాళికలను రూపొందించనున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి తెలంగాణ సరిహద్దులైన కోదాడ, దామరచర్ల, నాగార్జునసాగ ర్‌ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున దిగుమతయ్యే ప్రమాదం ఉండడం తో ఇప్పటికే పోలీస్‌, వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేక నిఘా పె ట్టారు. అయితే ఎంత నిఘా పెట్టినా సీజన్‌కు ముందే నకిలీ పత్తి వి త్తనాలు జిల్లాకు చేరుతుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా రు.ఈనేపథ్యంలో తదుపరి చర్యలపై సమావేశంలో చర్చించనున్నారు.

సాగు, తాగునీటి ప్రాజెక్టులపై చర్చ

వేసవికాలం మరో రెండు, మూడు వారాల్లో ముగుస్తుంది. వర్షాలు మొదలైతే రైతులు విత్తనాలు వేసేందుకు సిద్ధంగా ఉంటారు. బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు ఇప్పటికే ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆయా గ్రామాలకు సాగు, తాగు నీరు అందించే విషయంతో పాటు ప్రాజెక్టు ప్రారంభోత్సవంపై ఓ నిర్ణయానికి రానున్నారు. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించారు. ఇకపోతే శ్రీశైలం సొరంగం మార్గం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు లేకపోవడం, పనులు కూడా మందకొడిగా సాగుతున్న విషయంపై చర్చ సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి జూన్‌ 2వ తేదీ నాటికి 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన దశాబ్ది ఉత్సవాలు విజయవంతం చేసేందుకు సమావేశంలో చర్చించనున్నారు.

Updated Date - 2023-05-27T01:19:35+05:30 IST