Delhi Liquor Scam: కవిత చుట్టూ ఉచ్చు!

ABN , First Publish Date - 2023-06-02T02:09:40+05:30 IST

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఏం జరగబోతోంది? ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా? ఇటీవల ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్జ్‌షీట్‌లో అరవింద్‌ కేజ్రీవాల్‌ పాత్రను ప్రస్తావించిన విషయం తెలిసిందే.

Delhi Liquor Scam: కవిత చుట్టూ   ఉచ్చు!

శరత్‌ అప్రూవర్‌గా ఎవరికి చేటు?..

కేసీఆర్‌పై జగన్‌ను ఉసిగొల్పిన కేంద్రం!

ఏ క్షణాన్నైనా కవిత అరెస్టుకు చాన్స్‌!!..

ముందుగా కేజ్రీ అరెస్టయ్యే అవకాశం

ఏ క్షణాన్నైనా కవిత అరెస్టుకు చాన్స్‌!!

ముందుగా కేజ్రీవాల్‌ అరెస్టయ్యే అవకాశం

న్యూఢిల్లీ, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఏం జరగబోతోంది? ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా? ఇటీవల ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్జ్‌షీట్‌లో అరవింద్‌ కేజ్రీవాల్‌ పాత్రను ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఢిల్లీ మద్యం వ్యాపారంలో స్వయంగా ఆయనే ఆహ్వానించినట్లు ఈడీ స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ కేసులో కీలక నిందితుడైన అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారడం.. కేజ్రీవాల్‌తో పాటు.. కవితకు ఈ స్కామ్‌ ఉచ్చు బిగుసుకోనుందనే సంకేతాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కుంభకోణంలో బలమైన సాక్ష్యాధారాలైన సెల్‌ఫోన్‌లు, డిజిటల్‌ ఆధారాలను నిందితులు ధ్వంసం చేశారని సీబీఐ, ఈడీలు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. శరత్‌ అప్రూవర్‌గా మారడం.. ఆయన ఇచ్చే వాంగ్మూలం ఇప్పుడు అత్యంత కీలకంగా మారనుంది.

ఎన్నికల్లో డబ్బు.. శరత్‌ అంగీకరించారా?

దర్యాప్తు సంస్థలు శరత్‌ చంద్రారెడ్డికి శల్యపరీక్షలు నిర్వహించాకే.. ఆయనను అప్రూవర్‌గా మారేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పంజాబ్‌ ఎన్నికల్లో ఈ కుంభకోణం ద్వారా వచ్చిన లాభాలను వెచ్చించారని సీబీఐ, ఈడీ చార్జ్‌షీట్లలో పేర్కొన్నాయి. ఆ మేరకు తన భార్య కనికారెడ్డి సంస్థ జెట్‌సెట్‌గోకు చెందిన విమానాల ద్వారా ఢిల్లీ, పంజాబ్‌, గోవా తదితర ప్రాంతాలకు నగదును తరలించడానికి సంబంధించిన సమాచారాన్ని అందజేసేందుకు శరత్‌ అంగీకరించాడని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. ఇక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు అరుణ్‌ పిళ్లై బినామీ అనే విషయంలోనూ శరత్‌చంద్రారెడ్డి కీలక అంశాలను వివరించినట్లు తెలిసింది. అటు ఈడీ కూడా కవితను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసేందుకు తగిన ఆధారాలను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో కవిత మాజీ ఆడిటర్‌ బుచ్చిబాబు ద్వారా ఇప్పటికే కీలక సమాచారాన్ని ఈడీ సేకరించింది. శరత్‌ చంద్రారెడ్డి ఇచ్చే వివరాల ఆధారంగా కవిత అరెస్టుకు రంగం సిద్ధం చేసే అవకాశాలున్నాయని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. కవిత కోరిక మేరకే తాను ఢిల్లీ మద్యం కుంభకోణంలోకి దిగినట్లు, ఆమె తరఫునే ముడుపులు బదిలీ చేసినట్లు, అక్రమ రిటైల్‌ జోన్లను నిర్వహించాల్సి వచ్చిందని బుచ్చిబాబు చెప్పినట్లు తెలుస్తోంది. ‘‘కవిత విషయంలో వెంటనే చర్యలు ఉంటాయా? లేదా అనేది తెలియదు. కానీ, కేజ్రీవాల్‌ విషయంలో కేంద్రం ఏమాత్రం వెనకాడదు. ఆయన కథ ముగిసినట్లే’’ అని దర్యాప్తు సంస్థల్లోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

విజయసాయి మధ్యవర్తిత్వం?

నెల రోజుల క్రితం బెయిల్‌పై విడుదలైన శరత్‌ రెడ్డి అప్రూవర్‌ అయ్యేందుకు దర్యాప్తు సంస్థలు అనేక దశల్లో వివిధ వర్గాల ద్వారా మధ్యవర్తిత్వం నెరిపాయి. ఈ మంతనాల్లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. విజయసాయి అల్లుడి సోదరుడే శరత్‌ చంద్రారెడ్డి. శరత్‌ అప్రూవర్‌గా మారే విషయంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో చర్చలు జరిపారని తెలుస్తోంది. అమిత్‌షా-జగన్‌ల భేటీ తర్వాతే దర్యాప్తు సంస్థలకు ఈ విషయంలో కొన్ని కీలక ఆదేశాలు అందినట్లు సమాచారం. అమిత్‌షా-జగన్‌ల భేటీలో వైఎస్‌ వివేకా హత్యకేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డి పాత్రపై చర్చకు వచ్చినట్లు.. ఆ క్రమంలోనే షా చెప్పినదానికి జగన్‌ ఒప్పుకొన్నట్లు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.

కర్ణాటకలో బీజేపీ ఓటమి తర్వాత.. దక్షిణాదిన పట్టుకోసం తెలంగాణలో అధికారంలోకి రావడం కీలకమని, అందుకే తాను చెప్పినట్లు చేయాలని జగన్‌ను షా ఆదేశించినట్లు సమాచారం. షా ఆదేశాలతోనే కేసీఆర్‌కు జగన్‌ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో.. ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెరవేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ విషయంలో మద్దతు ఇచ్చే విషయంలోనూ జగన్‌రెడ్డి అంగీకరించినట్లు సమాచారం. ఒక విధంగా జగన్‌ను ఉపయోగించుకుని, కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టనున్నట్లు రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. జగన్‌ పార్టీ ఎంపీల మద్దతుతో రాజ్యసభలో ఢిల్లీ ఆర్డినెన్స్‌ గట్టెక్కుతుంది. దాంతో.. ఢిల్లీపై పెత్తనం కేంద్రం చేతుల్లోకి వెళ్తుంది. అదే సమయంలో.. ఈ కేసులో కేజ్రీవాల్‌ అరెస్టయితే.. తదుపరి ఎన్నికల్లో ఢిల్లీలో పాగా వేయడం బీజేపీకి సులభమవుతుంది. ఇదే జగన్‌రెడ్డి పార్టీ ద్వారా శరత్‌రెడ్డిని అప్రూవర్‌గా మారిస్తే.. తెలంగాణలోనూ పాగా వేయాలనేది బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది.

Updated Date - 2023-06-02T02:09:49+05:30 IST