Doctor Preethi Case : మెడికో ప్రీతి కేసులో యాంటీ ర్యాగింగ్ కమిటీ తేల్చిన అసలు నిజం ఇదీ..

ABN , First Publish Date - 2023-03-01T17:50:35+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ మెడికో ప్రీతి (Warangal Preethi case) ఘటనలో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది..

Doctor Preethi Case : మెడికో ప్రీతి కేసులో యాంటీ ర్యాగింగ్ కమిటీ తేల్చిన అసలు నిజం ఇదీ..


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ మెడికో ప్రీతి (Warangal Preethi case) ఘటనలో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. కొద్దిసేపటి క్రితమే ప్రీతి కేసులో నిందితుడైన సైఫ్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగుచూశాయి. తాజాగా.. కాకతీయ మెడికల్ కాలేజీ యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమై సుధీర్ఘంగా చర్చించి నిజానిజాలేంటో తేల్చింది. కమిటీ ముందు ఎంజీఎం సూపరిడెంట్, ప్రిన్సిపాల్ మోహన్‌దాస్, అనస్తీషియా హెచ్‌వోడీ నాగార్జున రెడ్డి, ఆర్డీవో, వరంగల్ ఏసీపీతో పాటు ఇతర సభ్యులు హాజరయ్యారు. ముఖ్యంగా ప్రీతి విషయంలో అసలేం జరిగిందని ఇవాళ మధ్యాహ్నం నుంచి నాగార్జున రెడ్డిని అడిగి పూర్తి వివరాలను ర్యాగింగ్ కమిటీ సేకరించింది. సుధీర్ఘ సమావేశం తర్వాత మెడికో ప్రీతిపై సైఫ్ ర్యాగింగ్ చేసినట్టు కమిటీ నిర్థారించింది. ఫిజికల్‌గా కాకుండా మానసికంగా వేధింపులకు గురిచేయడం కూడా ర్యాగింగ్ కిందికే వస్తుందని కమిటీ తేల్చింది. చివరగా సైఫ్ ర్యాగింగ్ చేసినట్టు కమిటీ ఏకగ్రీవంగా నిర్థారించిందని కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ మీడియాకు వెల్లడించారు. ఈ కమిటీ తేల్చిన విషయాలన్నింటినీ నివేదిక రూపంలో యూజీసీకి పంపుతామన్నారు. యూజీసీ నిర్ణయాల ప్రకారం సైఫ్‌పై చర్యలు ఉంటాయని ప్రిన్సిపాల్ తెలిపారు.

Preethi.jpg

సైఫ్ రిమాండ్ రిపోర్టులో ఏముంది..?

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy) చేతికి చిక్కిన సైఫ్ రిమాండ్ రిపోర్టులో అసలు నిజాలు బయటపడ్డాయి. సైఫ్ ఫోన్‌ నుంచి 17 వాట్సాప్ చాట్స్‌ను పోలీసులు పరిశీలించారు. అనుషా, భార్గవి, LDD+ Knockouts అనే వాట్సప్ గ్రూప్ చాట్స్‌ను విశ్లేషించి ముఖ్యమైన విషయాలను గుర్తించారు. అనస్థీషియా డిపార్ట్‌మెంట్‌లో సీనియర్‌గా ఉన్న సైఫ్... ప్రీతిని సూపర్వైజ్ చేశాడని, రెండు ఘటనల ఆధారంగా కోపం పెంచుకున్నాడని పేర్కొన్నారు. డిసెంబర్‌లో ఒక యాక్సిడెంట్ కేసు విషయంలో ప్రీతిని సైఫ్ గైడ్ చేశాడు. ఆ ఘటనలో ప్రీతి ప్రిలిమినరీ అనస్థీషియా రిపోర్ట్ రాయగా.. దానిని వాట్సప్ గ్రూపులో పెట్టి సైఫ్ అవహేళన చేశాడు.

Dr-Preethi.jpg

ఇదే అసలు కారణం..!

ప్రీతికి రిజర్వేషన్‌లో ఫ్రీ సీట్ వచ్చిందంటూ ఆమెను అవమానపరిచాడు. దీంతో తనతో ఏమైనా ప్రాబ్లమా? అంటూ సైఫ్‌ను ప్రీతి ప్రశ్నించింది. ఏమైనా సమస్య ఉంటే హెచ్‌వోడీకి చెప్పాలంటూ హెచ్చరించింది. దీంతో పగ పెంచుకున్న సైఫ్ తన స్నేహితుడు భార్గవ్‌కు ప్రీతిని వేధించాలని చెప్పినట్టు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఇక ఆర్‌ఐసీయూలో రెస్ట్ లేకుండా ప్రీతికి డ్యూటీ వేయాలని సైఫ్ పురిగొల్పాడని పోలీసులు గుర్తించారు. కాగా ఈ విషయాలన్నింటినీ గమనిస్తూ వచ్చిన ప్రీతి గత నెల 21న హెచ్‌వోడీ నాగార్జునకి ఫిర్యాదు చేసింది. డాక్టర్లు మురళి, శ్రీకళ, ప్రియదర్శిని సమక్షంలో ప్రీతి, సైఫ్‌కు వైద్యులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ పరిణామం జరిగిన మరుసటి రోజే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిందని సైఫ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - 2023-03-01T18:11:36+05:30 IST