Share News

7 thousand teacher JOBS : మరో 7 వేల టీచర్‌ కొలువులు

ABN , Publish Date - Dec 31 , 2023 | 03:06 AM

ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త! ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసిన 5,089 పోస్టులకు అదనంగా దాదాపు ఏడు వేల పోస్టులతో మెగా డీఎస్సీ రానుంది! దాదాపు 12 వేల పోస్టులను భర్తీ చేయనుంది.

7 thousand teacher JOBS : మరో 7 వేల టీచర్‌ కొలువులు

అనుబంధ నోటిఫికేషన్‌తో మెగా డీఎస్సీ..

సీఎం రేవంత్‌ ఆదేశంతో అధికారుల కసరత్తు

ఇప్పటికే దరఖాస్తు చేసినవారితోపాటు కొత్త వారికీ చాన్స్‌

సిలబస్‌ మారుస్తారా లేదా అన్న దానిపై సస్పెన్స్‌

హైదరాబాద్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త! ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసిన 5,089 పోస్టులకు అదనంగా దాదాపు ఏడు వేల పోస్టులతో మెగా డీఎస్సీ రానుంది! దాదాపు 12 వేల పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు అనుబంధ నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శనివారం సచివాలయంలో విద్యా శాఖ అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో అధికారులు ప్రణాళికను రూపొందిస్తున్నారు. నిజానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా 2017లో 13,500 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. దాదాపు ఏడేళ్ల తర్వాత 6,612 టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని మూడు నెలల కిందట బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో పాఠశాల విద్యలో 5,089, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ ఫర్‌ డిజేబుల్డ్‌లో మరో 1,523 పోస్టులున్నట్టు ప్రకటించింది. వీటిని డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. స్పెషల్‌ టీచర్‌ పోస్టులైన 1,523 ఖాళీలను పట్టించుకోకుండా 5,089 పోస్టుల భర్తీకి ఆయా జిల్లాల కలెక్టర్లు ఎక్కడిక్కడ నోటిఫికేషన్‌ను జారీ చేశారు కూడా. వీటికి మొత్తం 1,77,502 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ పోస్టులకు నవంబరు 20 నుంచి 30 వరకు పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో వాటిని వాయిదా వేశారు. కొత్త ప్రభుత్వం ఇప్పుడు పోస్టుల భర్తీపై దృష్టిసారించింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న 5,089 పోస్టులకు అదనంగా మరో 4,281 ఖాళీలను ఇప్పటికే గుర్తించారు. గతంలో ప్రకటించిన 1,523 స్పెషల్‌ పోస్టులను కూడా భర్తీ చేయాల్సి ఉంది. వీటితోపాటు మోడల్‌ స్కూల్స్‌లో మరో 1,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు. అలాగే, మరో 400 పోస్టులు ఇటీవల పదోన్నతుల ద్వారా ఖాళీ అయ్యాయి. మొత్తంగా 12 వేల పోస్టులకుపైగా భర్తీ చేయడానికి తాజాగా అనుబంధ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. తద్వారా గతంలో దరఖాస్తు చేసిన వారు కూడా అర్హులవుతారు. కొత్త అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది.

సిలబస్‌ పాతదేనా.. మారుస్తారా?

టీచర్‌ పోస్టులకు సంబంధించిన సిలబ్‌సను మారుస్తారా? లేక పాత దానినే కొనసాగిస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. డీఎస్సీ పరీక్షలో 80 మార్కులు, టెట్‌ వెయిటేజీ 20 మార్కులతో కలిపి మొత్తం 100 మార్కులుగా పరిగణనలోకి తీసుకోవాలని ఇంతకు ముందు నిర్ణయించారు. రెండు నెలల కిందట జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఇప్పటికే సిలబస్‌ ప్రకటించారు. ఎస్జీటీ, స్కూల్‌ అసిసెంట్‌ పోస్టులకు విడివిడిగా సిలబ్‌సను రూపొందించారు. ఎస్జీటీ పోస్టులకు జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అఫైర్స్‌ నుంచి 10 మార్కుల కోసం 20 ప్రశ్నలను ఇవ్వనున్నారు. విద్యా దృక్పథాలు నుంచి 20 ప్రశ్నలు, మొదటి ల్యాంగ్వేజిలో 18 ప్రశ్నలు, ఇంగ్లీషులో 18 ప్రశ్నలు, మ్యాథ్స్‌, సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌ సబ్జెక్టుల్లో ఒక్కోదాని నుంచి 18 ప్రశ్నలు, టీచింగ్‌ మెథడాలజీలో 30 ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 160 ప్రశ్నలకు 80 మార్కులను ఖరారు చేశారు. అలాగే.. భాషా పండిట్‌ పోస్టులకు జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అఫైర్స్‌ నుంచి 20 ప్రశ్నలు, విద్యా దృక్పథాలు నుంచి 20; కంటెంట్‌ పరిధిలో 88; టీచింగ్‌ మెథడాలజీలో 32 ప్రశ్నలు కేటాయించారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అఫైర్స్‌ నుంచి 20 ప్రశ్నలు; విద్యా దృక్పథాలు నుంచి 20 ప్రశ్నలు, కంటెంట్‌ పరిధిలో తెలంగాణ రాష్ట్ర సిలబస్‌ పరిధి నుంచి 88 ప్రశ్నలు; టీచింగ్‌ మెథడాలజీలో 32 ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఈ సిలబస్‌ ఇలాగే కొనసాగుతుందా? లేక ఏమైనా మార్పులు చేస్తారా? అనే విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

రేషనలైజేషన్‌ లేకుండానే ముందుకు

టీచర్ల క్రమబద్ధీకరణకు స్వస్తి పలకడమే కాకుండా మూసేసిన పాఠశాలలను కూడా తెరిపించాలనే సర్కారు తాజా నిర్ణయంపై విద్యా శాఖ వర్గాలు, మేధావుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా లేదు. సుమారు 6 వేల పాఠశాలల్లో ఏకోపాధ్యాయుడే కొనసాగుతున్నారు. వీటిలో 30 మంది కంటే తక్కువ విద్యార్థులున్నారు. మరో 1,290 పాఠశాలల్లో జీరో అడ్మిషన్లు ఉన్నాయి. దీంతో, ఆయా స్కూళ్లను మూసేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. రేషనలైజేషన్‌ ద్వారా ఇలాంటి పాఠశాలల్లోని పోస్టులను రద్దు చేయాలనే ప్రతిపాదన గతంలో ఉండేది. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక స్కూలు ఉండాలనే విధానంలో భాగంగా ప్రభుత్వం దీనిని తాజాగా ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులను యథాతథంగా ఉంచాలని నిర్ణయించడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Updated Date - Dec 31 , 2023 | 03:06 AM