Sisodia: సిసోడియాకు మరో 5 రోజుల కస్టడీ!
ABN , First Publish Date - 2023-03-18T03:21:24+05:30 IST
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా కస్టడీ గడువును సీబీఐ ప్రత్యేక కోర్టు మరో ఐదు రోజులు పొడిగించింది.

ఏడు రోజులు కావాలన్న ఈడీ.. ఐదు రోజులకు అనుమతిచ్చిన కోర్టు.. ఈ నెల 22 వరకు కస్టడీలోనే..!
రోజుకు అరగంటే విచారణ: సిసోడియా
ఎక్కువసేపు విచారిస్తే వేధింపులన్నారు
పెద్దఎత్తున ఆధారాలు ధ్వంసం చేశారు
రిమాండ్ రిపోర్టులో వెల్లడించిన ఈడీ
న్యూఢిల్లీ, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా కస్టడీ గడువును సీబీఐ ప్రత్యేక కోర్టు మరో ఐదు రోజులు పొడిగించింది. తొలుత ఇచ్చిన 7 రోజుల గడువు ముగియడంతో సిసోడియాను శుక్రవారం రౌజ్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎంకే నాగ్‌పాల్ ఎదుట ప్రవేశపెట్టారు. సిసోడియా ఈ మెయిళ్లు, మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపామని, విచారణలో కీలక సమాచారం లభించిందని, మరో ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరగా ఐదు రోజులకు న్యాయస్థానం అనుమతించింది. దీంతో ఈ నెల 22 వరకు సిసోడియా ఈడీ కస్టడీలో ఉండనున్నారు.
ఈడీ తరఫు న్యాయవాది జోహెబ్ హుస్సేన్ వాదిస్తూ.. కుంభకోణంపై కేసు నమోదు చేయాలని సీబీఐకి లెఫ్టినెంట్ గవర్నర్ సూచించిన రోజే సిసోడియా దాదాపు 8 నెలల నుంచి వాడుతున్న ఫోన్‌ను మార్చినట్లు గుర్తించామని తెలిపారు. ఫోన్ పాడవ్వడం వల్లే మార్చినట్లు చెబుతున్నా.. ‘మార్చిన సమయం’ కీలకమన్నారు. సీబీఐ నుంచి ఈ-మెయిళ్ల డంప్ కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. సిసోడియా తరఫున మోహిత్ మాథుర్ వాదిస్తూ.. ఇది ఈడీ రిమాండ్ రిపోర్టులా లేదని, సీబీఐ అప్లికేషన్‌లో పేర్కొన్న అంశాలే ఉన్నాయన్నారు. మనీ లాండరింగ్ కేసుల్లో అక్రమార్జనే ప్రధాన అంశమని, ఇక్కడ ఆ ప్రస్తావనే లేదన్నారు. 7 రోజుల కస్టడీలో 11 గంటలే విచారించారని తెలిపారు.
సగం రోజు విచారించడం లేదు: సిసోడియా
తనను పూర్తి సమయం విచారించలేదని సిసోడియా స్వయంగా కోర్టుకు తెలియజేశారు. ‘ఈడీ రోజులో మొదటి సగం విచారించడం లేదు. రెండో సగంలో అరగంట నుంచి గంట సేపే విచారించారు. విచారణను త్వరగా ముగించాలని విజ్ఞప్తి చేశా. ఇప్పటివరకు ఈడీ ఏం సాధించింది? ఇంకా జైలులో ఉంచాల్సిన అవసరం లేదు’’ అని సిసోడియా జడ్జికి తెలిపారు. దీనిపై ఈడీ న్యాయవాది స్పందిస్తూ.. సీబీఐ సుదీర్ఘంగా విచారిస్తే మానసికంగా వేధించినట్లు ఆరోపించారని గుర్తుచేశారు.
పెద్దఎత్తున ఆధారాలు ధ్వంసం చేశారు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో సౌత్ గ్రూపుతో కుమ్మక్కైన సిసోడియా లాభాల మార్జిన్లను 12 శాతానికి పెంచారని ఈడీ ఆరోపించింది. ఆయన పెద్ద ఎత్తున ఆధారాలను ధ్వంసం చేశారని రిమాండ్ రిపోర్టులో తెలిపింది. సిసోడియా వ్యక్తిగత కంప్యూటర్ నుంచి స్వాధీనం చేసుకున్న మంత్రుల బృందం(జీవోఎం) ముసాయిదా నివేదికలో 5 శాతం మార్జిన్లు అనే ఉందని, 2021 మార్చి19న దాన్ని మార్చారని పేర్కొంది. అదే ఏడాది మార్చి 14-17 వరకు ఒబెరాయ్ హోటల్‌లో సౌత్ గ్రూపు సభ్యులు లేదా ప్రతినిధులు బస చేశారని, 36 పేజీల జీవోఎం ముసాయిదా నివేదికను ప్రింట్ తీసుకోడానికి హోటల్‌లోని ప్రింటర్‌ను వినియోగించారని తెలిపింది. సౌత్ గ్రూపు సభ్యులతో సిసోడియా కుమ్మక్కై హోల్‌సేల్ మార్జిన్లను 12 శాతానికి పెంచారనడానికి ఇదే రుజువని తేల్చిచెప్పింది. సిసోడియాను ఈ నెల 17న దినేశ్ అరోరాతో, 20న అమిత్ అరోరా, ఢిల్లీ ఎక్సైజ్ మాజీ కమిషనర్ రాహుల్ సింగ్‌తో, 21న ఆయన కార్యదర్శి అరవింద్‌తో ముఖాముఖి ప్రశ్నించడానికి సమన్లు జారీ చేశామని ఈడీ పేర్కొంది.
హైదరాబాద్‌కు కవిత బృందం
ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ నేపథ్యంలో గురువారం ఢిల్లీకి వచ్చిన మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ శుక్రవారం తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. వారు బస చేస్తున్న సీఎం కేసీఆర్ అధికారిక నివాసానికి కార్యకర్తలు వెల్లువెత్తారు. శుక్రవారం ఉదయం నుంచి అందరితోనూ మాట్లాడిన కవిత.. సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు పయనమయ్యారు.