గద్వాల ఎమ్మెల్యేగా ప్రకటించండి..
ABN , First Publish Date - 2023-09-02T02:56:12+05:30 IST
తనను గద్వాల ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని, ప్రభుత్వాన్ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కోరారు.
హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయండి
అసెంబ్లీ స్పీకర్, సీఈఓకు డీకే అరుణ విజ్ఞప్తి
హైదరాబాద్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): తనను గద్వాల ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని, ప్రభుత్వాన్ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కోరారు. పార్టీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావులతో కలిసి ఆమె హైకోర్టు ఉత్తర్వుల కాపీతో శుక్రవారం అసెంబ్లీకి వచ్చారు. అయితే, స్పీకర్ అందుబాటులో లేరని, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు ఉత్తర్వు కాపీ అందించాలని భావించగా, తాను స్పీకర్‌తో సమావేశంలో ఉన్నట్లు ఆయన చెప్పారని అరుణ మీడియాకు తెలిపారు. దీంతో అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ ఉపేందర్‌రెడ్డికి కోర్టు ఉత్తర్వు కాపీని అందజేసినట్లు చెప్పారు. అనంతరం హైకోర్టు కాపీని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికా్‌సరాజ్‌కు ఆమె అందజేశారు. తన విజ్ఞప్తిని పరిశీలించి త్వరలోనే సమాచారం ఇస్తానని వికా్‌సరాజ్ తెలిపారని అరుణ వివరించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ తొత్తులుగా వ్యవహరిస్తూ దౌర్జన్యం చేస్తున్న పోలీసు అధికారుల పేర్లు రాసిపెట్టుకోవాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు డీకే అరుణ పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని.. సదరు అధికారుల రుణాన్ని వడ్డీతో సహా చెల్లిస్తామని వ్యాఖ్యానించారు.