ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

ABN , First Publish Date - 2023-03-31T02:42:52+05:30 IST

ఆంధ్రాభద్రాద్రి ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.

ఒంటిమిట్టలో   బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

ఒంటిమిట్ట రంగమండపంలో ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన సీతారామలక్ష్మణులు

రాజంపేట/ఒంటిమిట్ట, మార్చి 30: ఆంధ్రాభద్రాద్రి ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఉదయం సుప్రభాత సేవ అనంతరం పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన చేశారు. సాయంత్రం అర్చకుల వేదమంత్రాల నడుమ అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి కంకణ ధారణ చేశారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో గురువారం శ్రీసీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు పట్టు వస్ర్తాలను, ముత్యాలను సమర్పించారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో సీతారామ లక్ష్మణ సమేత హనుమంత ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో శ్రీరామనవమి ఆస్థానాన్ని అర్చకులు వేడుకగా నిర్వహించారు.

భద్రాద్రికి వెళ్లనందుకు

కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి:వీహెచ్‌పీ

హైదరాబాద్‌: భద్రాద్రిలో శ్రీసీతారాముల కల్యాణానికి వెళ్లనందుకు సీఎం కేసీఆర్‌ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని వీహెచ్‌పీ డిమాండ్‌ చేసింది. సీఎం హోదాలో పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించకుండా కేసీఆర్‌.. హిందూ సమాజాన్ని అవమానపరిచారని వీహెచ్‌పీ రాష్ట్ర ప్రచార ప్రముఖ్‌ పగడాకుల బాలస్వామి, అధ్యక్ష, కార్యదర్శులు సురేందర్‌రెడ్డి, పండరీనాథ్‌లు విమర్శించారు.

Updated Date - 2023-03-31T02:42:52+05:30 IST