యూట్యూబ్‌ వీడియోలు చేస్తోందన్న ఆగ్రహంతో.. చెల్లెలిపై రోకలిబండతో అన్న దాడి

ABN , First Publish Date - 2023-07-26T03:31:49+05:30 IST

ఆ అన్న క్షణికావేశం ఎంత పనిచేసింది? యూట్యూబ్‌ వీడియోలు చేయడం మానుకోవాలని చెప్పినా వినడం లేదనే ఆగ్రహంతో విచక్షణ కోల్పోయి రోకలిబండ తీసుకొని సోదరి తలపై కొట్టాడు.

యూట్యూబ్‌ వీడియోలు చేస్తోందన్న ఆగ్రహంతో.. చెల్లెలిపై రోకలిబండతో అన్న దాడి

ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి

కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో ఘటన

ఇల్లెందు రూరల్‌, జూలై 25: ఆ అన్న క్షణికావేశం ఎంత పనిచేసింది? యూట్యూబ్‌ వీడియోలు చేయడం మానుకోవాలని చెప్పినా వినడం లేదనే ఆగ్రహంతో విచక్షణ కోల్పోయి రోకలిబండ తీసుకొని సోదరి తలపై కొట్టాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో ఆమె ప్రాణాలు పోయాయి. కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో ఈ ఘటన జరిగింది. రాజీవ్‌నగర్‌ తండాకు చెందిన అజ్మీరా సింధు (20) మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో నర్సుగా పనిచేస్తున్నారు. ఆమెకు అన్న అజ్మీరా హరిలాల్‌ ఉన్నాడు. తండ్రి అజ్మీరా శంకర్‌ రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తల్లి అజ్మీరా దేవి కూలీ పనులకు వెళుతోంది. నర్సుగా పనిచేస్తూనే సింధు సరదాగా యూట్యూబ్‌లో వీడియోలు కూడా చేస్తున్నారు. ఇది అన్న హరిలాల్‌కు నచ్చలేదు. యూట్యూబ్‌లో వీడియోలు పోస్టు చేయడంతో ఇంటి పరువు పోతోందని సింధుతో హరిలాల్‌ కొన్నాళ్లుగా గొడవపడుతున్నాడు. ఈ విషయమ్మీద సోమవారం కూడా ఇంట్లో సింధుతో అతడు తీవ్ర స్థాయిలో గొడవపడ్డాడు. యూట్యూబ్‌లో పోస్టు చేసిన వీడియోలన్నీ డిలీట్‌ చేయాలని, ఇకపై వీడియోలు చేయవద్దని ఆమెను హెచ్చరించాడు. ఇందుకు సింధు అంగీకరించలేదు. కోపోద్రిక్తుడైన హరిలాల్‌ ఇంట్లో ఉన్న రోకలిబండతో సింధు తలపై కొట్టాడు. తీవ్ర గాయాలైన ఆమెను కుటుంబసభ్యులు తొలుత ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు, అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి, తరలించారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్‌ ఎంజీఎం వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె మృతి చెందారు.

Updated Date - 2023-07-26T03:31:49+05:30 IST