ఇక మైనారిటీ బంధు

ABN , First Publish Date - 2023-07-21T02:40:25+05:30 IST

రాష్ట్రంలోని పేద మైనార్టీ కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో జీఓ వస్తుందని ఆయన తెలిపారు.

ఇక మైనారిటీ బంధు

రూ.లక్ష చొప్పున సాయం.. బడ్జెట్‌లో 2200 కోట్లు

ఒకటి రెండు రోజుల్లో జీవో: హరీశ్‌రావు

కాంగ్రెస్‌ వల్లే ముస్లింలలో పేదరికమని విమర్శ

మైనార్టీలకూ రూ.లక్ష ఆర్థికసాయం

హైదరాబాద్‌, జూలై20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పేద మైనార్టీ కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో జీఓ వస్తుందని ఆయన తెలిపారు. గురువారం జల విహార్‌లో మైనార్టీ నేతల సమావేశం నిర్వహించారు. ఇందులో పలు మైనార్టీ కార్పొరేషన్ల చైర్మన్లను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహ్మద్‌ మహమూద్‌ అలీ, ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు షకీల్‌, దానం నాగేందర్‌, ఎమ్మెల్సీ ఫరూక్‌ హుస్సేన్‌, పలు మైనార్టీ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బ్యాంకులతో సంబంధం లేకుండా ఆర్థిక సాయం అందజేస్తామని, మైనార్టీలకు ఆర్థిక సాయంపై ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్‌ పాలన వల్లే దేశంలో ఇప్పటికీ ముస్లింలు పేదవారిగానే ఉన్నారన్నారు. మైనార్టీల కోసం ఈసారి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.2,200 కోట్లు ప్రవేశపెట్టామని, తమ ప్రభుత్వం ఒక్క ఏడాదిలో పెట్టిన బడ్జెట్‌ను కాంగ్రెస్‌ పార్టీ పదేళ్లలో కూడా పెట్టలేదని ఆరోపించారు. మైనార్టీలను సీఎం కేసీఆర్‌ ఎంతో గౌరవిస్తారని, అందులో భాగంగానే మహమూద్‌ అలీని రెండుసార్లు మంత్రిని చేశారన్నారని చెప్పారు. హిందువులకు కల్యాణలక్ష్మి మాదిరిగానే మైనార్టీల కోసం షాదీ ముబారక్‌ అమలు చేస్తున్నట్లు తెలిపారు. మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ఇంగ్లి్‌షతోపాటు ఉర్దూ మీడియం కూడా అందుబాటులో ఉందన్నారు. రెసిడెన్షియల్‌ స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటుచేసి, మంచి విద్య అందిస్తున్నామని, మైనార్టీ విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లుగా ఎదుగుతున్నారని హరీశ్‌రావు వెల్లడించారు. మైనార్టీల మంచి కోసం ఆలోచించే ఏకైక నాయకుడు కేసీఆర్‌అని.. దేశంలో బీఆర్‌ఎస్‌ ఒక్కటే సెక్యులర్‌ పార్టీ అని మంత్రి మహమూద్‌ అలీ అన్నారు.

Updated Date - 2023-07-21T02:40:25+05:30 IST