Gruhalaxmi : గృహలక్ష్మిలో అనర్హుల పాగా

ABN , First Publish Date - 2023-09-29T03:39:43+05:30 IST

గృహలక్ష్మి పథకం కింద అర్హులైన నిరుపేదలను కాకుండా అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి.

Gruhalaxmi : గృహలక్ష్మిలో  అనర్హుల పాగా

పథకం లబ్ధిదారుల ఎంపిక తీరుపై విమర్శలు

మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పిన వారికే లబ్ధి!

రాష్ట్ర వ్యాప్తంగా 15.04లక్షల దరఖాస్తులు

వీటిలో తిరస్కరణకు గురైనవి 4.5 లక్షలు

ఇప్పటిదాకా 1.2 లక్షల మందికే మంజూరు

సెగ్మెంట్‌కు 3వేల చొప్పున 3.5లక్షల ఇళ్లు లక్ష్యం

ఎన్నికల కోడ్‌ వస్తే మంజూరు లేనట్టే?

బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే పథకాలు ఇస్తారా?

యాదాద్రి జిల్లాలో సునీతను నిలదీసిన జనం

హైదరాబాద్‌, ఆత్మకూరు(ఎం), సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): గృహలక్ష్మి పథకం కింద అర్హులైన నిరుపేదలను కాకుండా అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. సొంతిల్లు లేకుండా, సొంతంగా స్థలం కలిగి ఉన్న పేదలు ఇంటిని నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం చేసేందుకు గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. ఇంటి నిర్మాణానికి మూడు విడతలు.. బేస్‌మెంట్‌, గోడలు, స్లాబ్‌ దశల్లో సాయాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీ నేతల జోక్యం మితిమీరిపోయిందని.. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సూచించిన వారికే పథకాన్ని అందిస్తున్నారని, ఫలితంగా తమకు అన్యాయం జరుగుతోందని నిరుపేదలు వాపోతున్నారు. వాస్తవానికి సంక్షే మ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో..

మండల అధికారులు నిర్వహించాలి. కానీ అధికార బీఆర్‌ఎస్‌.. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతీ పథకంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు అధికారాలు అప్పగిస్తోందని, దీంతో లబ్ధిదారుల ఎంపికలో వారే అన్నీతామై వ్యవహరిస్తున్నారనే అసంతృప్తులు ఉన్నాయి. సంగారెడ్డి, మెదక్‌, మేడ్చల్‌, వరంగల్‌ తదితర జిల్లాల్లో అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకం కింద నియోజకవర్గానికి 3వేల చొప్పున మొత్తంగా 3.57 లక్షల మందికి లబ్ధి కలిగించాలని సర్కారు నిర్ణయించింది. పైగా ఈ ఏడాదిలోనే ప్రక్రియను ముగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇది సాధ్యమేనా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎందుకంటే ఇప్పటివరకు పథకం కోసం వచ్చిన దరఖాస్తుల నుంచి ఎంపిక చేసిన వాటిన్నంటికీ మంజూరు పత్రాలే ఇవ్వలేదు. ఇటు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అక్టోబరులోనే షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశముందనే సంకేతాలు వెలువడుతున్నాయి. అక్టోబరు 3 నుంచి 6వ తేదీ వరకు రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల కమిటీ పర్యటించనుంది. ఎలక్షన్‌ కమిటీ పర్యటన అనంతరం ఎన్నికలకు షెడ్యూల్‌ వి డుదల చేస్తే ఇక కొత్త ఇళ్ల మంజూరుకు అవకాశం లేనట్టేనని తెలుస్తోంది. అంటే ఇప్పటివరకు మంజూరైన ఇండ్లకు మా త్రమే ఆర్థిక సాయం అందనుంది. దీంతో ఆశావహుల్లో ఆందోళన నెలకొంది.

15.04 లక్షల దరఖాస్తులు.. మంజూరు..1.20 లక్షలే..

గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఆగస్టు 8 నుంచి అవకాశం కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 15.04 లక్షల ధరఖాస్తులు వచ్చాయి. భారీగా దరఖాస్తులు రావడంతో అసలు అర్హులను తేల్చడం ఎలా.? అన్న దానిపై మల్లగుల్లాలు పడింది. చివరికి దరఖాస్తుల్లో నుంచి ఇప్పటివరకు 10.5 లక్షల మందిని అర్హులుగా, 4.50 లక్షల మందిని అనర్హులుగా తేల్చినట్టు సమాచారం. కొన్ని జిల్లాల్లో ఇంకా వి చారణ ప్రక్రియే నడుస్తోంది. అర్హులు, అనర్హులు తేలిన తర్వాత కూడా తొలివిడత లక్ష్యం మేర నియోజకవర్గానికి 3 వేల చొప్పున ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఇళ్లు మంజూరు కాలేదు. మొత్తంగా ఇప్పటివరకు కేవలం 1.2 లక్షల మందికి మాత్రమే ఇళ్లు నిర్మించుకునేందుకు మంజూరు పత్రాలను అందించినట్టు తెలుస్తోంది.

గొంగిడి సునీతకు నిరసన సెగ

ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు నిరసన సెగ తగిలింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే ఇస్తున్నార ని ఆమె ఎదుట స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్‌(ఎం) మండలంలోని కాప్రాయిపల్లికి గురువారం సునీత వెళ్లారు. గ్రామంలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు, యువకులు.. దళితబంధు, బీసీబంధు, గృహలక్ష్మి పథకాలను అర్హులకు ఇవ్వకుండా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే ఇస్తున్నారని నినాదాలు చేశారు. కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2023-09-29T03:39:43+05:30 IST