Amshala Swamy : ఫ్లోరోసిస్ విముక్తి ఉద్యమకారుడు అంశల స్వామి మృతి
ABN , First Publish Date - 2023-01-29T02:33:12+05:30 IST
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ విముక్తి కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఉద్యమకారుడు అంశల స్వామి(32) శనివారం తెల్లవారుజామున కన్నుమూశాడు.
త్రిచక్ర వాహనం పైనుంచి పడి తీవ్ర గాయాలు
శనివారం తెల్లవారుజామున కన్నుమూత
మంత్రి కేటీఆర్ సహా పలువురి సంతాపం
2003లో ఫ్లోరోసిస్ సమస్యను నాటి
ప్రధాని వాజ్‌పేయి దృష్టికి తీసుకెళ్లిన స్వామి
నల్లగొండ, జనవరి 28: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ విముక్తి కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఉద్యమకారుడు అంశల స్వామి(32) శనివారం తెల్లవారుజామున కన్నుమూశాడు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన అంశల స్వామి ఫ్లోరోసిస్ తీవ్రతను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు. శుక్రవారం రాత్రి తన గ్రామంలో ఎలక్ట్రిక్ త్రీవీలర్‌పై నుంచి కింద పడడంతో స్వామి తలకు తీవ్ర గాయాలయ్యాయి. రిపబ్లిక్ డే రోజున కొత్త ఎలక్ట్రిక్ త్రీవీలర్ బైక్‌ను స్వామి కొనుగోలు చేశాడు. వాహనాన్ని స్వామి తండ్రి నడుపుతూ ఇంటి ర్యాంపుపైకి ఎక్కిస్తుండగా అదే బండిపై ఉన్న ఆయన ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయాలు కాగా స్థానిక ఆర్‌ఎంపీకి చూపించిన అనంతరం ఇంటికి తీసుకెళ్లారు. స్వామికి అర్ధరాత్రి వాంతులు కావడం, అనంతరం అస్వస్థతకు గురై తెల్లవారుజామున మృతి చెందాడు. స్వామి మృతితో శివన్నగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నిరుపేద కుటుంబానికి చెందిన సత్యనారాయణ, వెంకటమ్మ దంపతుల కుమారుడు స్వామి ఫ్లోరైడ్ బారిన పడ్డాడు. చేతులు, కాళ్లు వంకర్లు తిరిగి నడవలేని పరిస్థితి అతడిది. తనలా మరొకరికి ఈ పరిస్థితి రావద్దని చిన్నతనం నుంచే ఫ్లోరైడ్ మహమ్మారిపై రాజీలేని పోరాటం చేశాడు. ఫ్లోరోసిస్ విముక్తి కోసం నిరంతరం పరితపించాడు. జలసాధన సమితితో పాటు ఫ్లోరోసిస్ విముక్తి నాయకులతో కలిసి పార్లమెంట్ వరకు వెళ్లి ఫ్లోరైడ్ సమస్యను జాతీయ, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. 2003లో అప్పటి ప్రధాని వాజ్‌పేయిని కలిసిన వారిలో స్వామి కూడా ఉన్నాడు. వాజపేయి ఎదురుగా ఉన్న టేబుల్‌పై స్వామిని ఉంచి ఫ్లోరైడ్ తీవ్రతను ఆయనకు వివరించారు. ఫ్లోరైడ్ సమస్యలపై పోరాడుతుండడంతో అప్పట్లో అంశల స్వామి దేశంతో పాటు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాడు. ఇక తమ కుటుంబం పేదరికంలో మగ్గుతుండడంతో ఆదుకోవాలంటూ మంత్రి కేటీఆర్‌కు స్వామి లేఖ రాశాడు. కేటీఆర్ స్పందించడంతో స్వామికి సెలూన్ షాపుతో పాటు ఇల్లు కూడా మంజూరైంది. గృహ ప్రవేశానికి మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డిలు హాజరై స్వామితో కలిసి భోజనం చేశారు. ఇదిలా ఉండగా స్వామి అంత్యక్రియలు శనివారం స్వగ్రామంలో ముగిశాయి. అంతియయాత్రలో మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పాల్గొని పాడె మోశారు.
కేటీఆర్ సంతాపం
అంశల స్వామి మృతి విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో సంతాపం తెలిపారు. స్వామి తన గుండెల్లో ఎప్పటికీ ఉంటారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు. స్వామి ఫ్లోరోసిస్ బాధితుల తరఫున పోరాడిన గొప్ప యోధుడని కొనియాడారు. స్వామి మరణం ఎంతో బాధాకరమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు.