శంషాబాద్‌లో అమిత్‌ షాకు ఇల్లు అబద్ధం

ABN , First Publish Date - 2023-06-01T00:54:22+05:30 IST

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు శంషాబాద్‌లో ఓ వ్యాపారి ఇల్లు కట్టించారని, ఆయన ఇకపై ఇక్కడే ఉంటారని ఎంఐఎం చేసిన ఆరోపణలను బీజేపీ

శంషాబాద్‌లో అమిత్‌ షాకు ఇల్లు అబద్ధం

ఎంఐఎం ఆరోపణలు అవాస్తవం

తెలంగాణ అంతటా పోటీ చేయాలి : బండి

కరీంనగర్‌, మే 31(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు శంషాబాద్‌లో ఓ వ్యాపారి ఇల్లు కట్టించారని, ఆయన ఇకపై ఇక్కడే ఉంటారని ఎంఐఎం చేసిన ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్రంగా ఖండించారు. ‘‘దారుస్సలాంలో కూర్చుని బీరాలు పలకడం కాదు. బీఆర్‌ఎ్‌సను సంకనేసుకుని వస్తారో, కాంగ్రెస్‌ సహా గుంటనక్కల పార్టీలతో కలిసి పోటీ చేస్తారో..? దమ్ముంటే తెలంగాణ అంతటా పోటీ చేయండి. బీజేపీ సింహం.. సింగిల్‌గానే పోటీ చేస్తుంది. మీకు డిపాజిట్లు కూడా రాకుండా చేస్తాం’’ అని సవాల్‌ చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకుండా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐ ఎం కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. బుధవారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సొంతంగా బలపడకుండా ఇంకో పార్టీ బలపడాలని కోరుకునే ఎంఐఎం నాయకులు అధికారంలో ఉన్న పార్టీతో అంటకాగుతూ ఆస్తులను కాపాడుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించా రు. ముస్లింలను మోసం చేస్తున్న ఆ పార్టీని ముస్లిం సమాజమే నమ్మడం లేదన్నారు. ఇన్నేళ్లుగా హైదరాబాద్‌ పాతబస్తీని ఎందుకు అభివృద్ధి చేయలేక పోయారని, ముస్లిం యువకులకు పాస్‌పోర్టులు రాని దుస్థితి ఎందుకొచ్చిందని నిలదీశారు. ‘‘పావుగంట సమయమిస్తే హిందువులను నరికి చంపుతానన్న అక్బరుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యలకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ జవాబు చెప్పాలి. అసదుద్దీన్‌ ఆస్పత్రిలో పనిచేసే వ్యక్తే ఉగ్రవాదుల నాయకుడు. వాళ్లకు ఆశ్రయమిస్తూ ఆర్థికసాయం చేసే పార్టీ, ఉగ్రవాదులకు బెయిలివ్వాలని వాదించిన పార్టీ ఎంఐఎం’’ అని ధ్వజమెత్తారు.

Updated Date - 2023-06-01T00:54:22+05:30 IST