KCR: అంబేడ్కర్‌ జయంతి రోజు.. దళిత బంధు సక్సెస్‌ మీట్‌?

ABN , First Publish Date - 2023-03-31T03:06:56+05:30 IST

‘దళితబంధు పథకం ఎలా అమలవుతోంది..? ఏ యూనిట్ల నుంచి మంచి లాభాలు వస్తున్నాయి..? ఎక్కువ మంది ఏ యూనిట్లు తీసుకున్నారు..?’’ అనే అంశాలను లబ్ధిదారులను అడిగి తెలసుకోవాలని సీఎం కేసీఆర్‌ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.

KCR: అంబేడ్కర్‌ జయంతి రోజు..                        దళిత బంధు సక్సెస్‌ మీట్‌?

14న లబ్ధిదారులతో సీఎం భేటీ

యూనిట్లు, నిర్వహణపై ఆరా

విజయవంతమైన వాటిపై బుక్‌

‘రెండో విడత’పై చర్చించే చాన్స్‌

విగ్రహావిష్కరణ అనంతరం సభ

ప్రకాశ్‌ అంబేడ్కర్‌తో పాటు

మరికొందరికి ఆహ్వానం

ఏప్రిల్‌ 14న లబ్ధిదారులతో కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్‌, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ‘‘దళితబంధు పథకం ఎలా అమలవుతోంది..? ఏ యూనిట్ల నుంచి మంచి లాభాలు వస్తున్నాయి..? ఎక్కువ మంది ఏ యూనిట్లు తీసుకున్నారు..?’’ అనే అంశాలను లబ్ధిదారులను అడిగి తెలసుకోవాలని సీఎం కేసీఆర్‌ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. దళిత బంధును టార్చ్‌బేరర్‌గా అభివర్ణించిన సీఎం.. ఈ పథకం ఏ విధమైన లబ్ధి చేకూర్చిందనే వివరాలను తెలుసుకునేందుకు అంబేడ్కర్‌ జయంతి రోజైన ఏప్రిల్‌ 14న లబ్ధిదారులతో దళితబంధు సక్సెస్‌ మీట్‌ నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా విజయవంతంగా యూనిట్లు నడుపుతున్న లబ్ధిదారులను గుర్తించి అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ జరిగే రోజు ఒక్కో జిల్లా నుంచి 30 మందికి తగ్గకుండా బస్సుల్లో హైదరాబాద్‌కు తీసుకురావాలని ఇప్పటికే పలు జిల్లాల్లోని ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. సక్సెస్‌ మీట్‌ సందర్భంగా పథకంలో విజయవంతమైన యూనిట్లు, అందుకు తీసుకున్న చర్యలతో పాటు సంబంధిత లబ్ధిదారుడి వివరాలు, యూనిట్‌ పనితీరును పేర్కొంటూ అధికారులు ‘కాపీ టేబుల్‌ బుక్‌’ను రూపొందించారు. ఏప్రిల్‌ 14న లబ్ధిదారులతో ముఖ్యమంత్రి సమావేశం సందర్భంగా ఈ బుక్‌ను ఆవిష్కరించనున్నారు. ఇక, లబ్ధిదారులతో కేసీఆర్‌ భేటీ అవుతున్న నేపథ్యంలో రెండో విడతకు సంబంఽధించిన మార్గదర్శకాలు, కొత్త యూనిట్లు ఎలాఉండాలి..? పథకంలో ఇంకా ఏమైనా మార్పులు చేయాలా..? అని అడిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పథకంలో అక్రమాలు, సమస్యలు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్న క్రమంలో వాటిపైనా చర్చించనున్నారు. కాగా, దళితబంధు అమలు, లబ్ధిదారుల గుర్తింపు విధానంలో వస్తున్న ఆరోపణలు.. ఎమ్మెల్యేలకు, అధికారులకు కమీషన్ల అంశంపై సీఎం నివేదిక తెప్పించుకున్నట్టు తెలుస్తోంది.

వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్‌.. అంబేడ్కర్‌ జయంతి రోజున లబ్ధిదారులకు రెండో విడతపై ఒక స్పష్టమైన ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. దీనికి అనుగుణంగానే ఎస్సీ సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సైతం పథకం అమలవుతున్న జిల్లాల ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పథకం అమలులో అక్రమాలు జరుగుతున్నాయని తన దృష్టికి వచ్చిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవంతమైన యూనిట్లను నడుపుతున్న లబ్ధిదారులతో ఎప్పటికప్పుడు మాట్లాడాలని, ఇతర యూనిట్లు తీసుకున్న వారికి అవగాహన కల్పించాలని సూచించారు. దీంతో అంబేడ్కర్‌ జయంతి రోజున సీఎం లబ్ధిదారులతో భేటీ అవుతారనే చర్చకు బలం చేకూరింది.

విగ్రహావిష్కరణ తర్వాత సభ..

అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ అనంతరం బహిరంగ సభ నిర్వహించాలని, దీనికి ఎక్కువగా దళిత వర్గాలనే ఆహ్వానించాలని సీఎం నిర్ణయించారు. దీంతో దళితబంధు లబ్ధిదారులతో పాటు కొంత మంది దళితులను హైదరాబాద్‌కు తరలించనున్నారు. ఈ సందర్భంగా దళితబంధు లబ్ధిదారులతో కేసీఆర్‌ భేటీ కానున్నారు. కాగా, ఏప్రిల్‌ 14 తర్వాత అన్ని జిల్లాల్లోని దళితబంధు లబ్ధిదారులతో కలెక్టర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు ప్రత్యేకంగా భేటీ కావాలని ఆదేశాలు ఇచ్చారు. బహిరంగ సభను హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం లేదా జింఖానా గ్రౌండ్స్‌లో నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారు. సభకు అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌తో పాటు మరికొంత మందిని ఆహ్వానించాలని నిర్ణయించారు. ఏప్రిల్‌ 14న నిర్వహించబోయే కార్యక్రమ వివరాలను రేపు ప్రకటించనున్నట్టు సమాచారం.

Updated Date - 2023-03-31T03:06:56+05:30 IST