Share News

TS Assembly Polls : ఎన్నికల బరిలో ఉన్న ముఖ్య నేతల ఆస్తుల లెక్కలివిగో..!?

ABN , First Publish Date - 2023-11-11T03:59:54+05:30 IST

ఎన్నికల బరిలో ఉన్న ముఖ్య నేతలకు ఏమేర ఆస్తులున్నాయి? వారివి ధనిక కుటుంబాలేనా? సీఎం కేసీఆర్‌.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌..

TS Assembly Polls : ఎన్నికల బరిలో ఉన్న ముఖ్య నేతల ఆస్తుల లెక్కలివిగో..!?

  • సొమ్ములన్నీ చేతిలోనే..!

  • అందరికంటే గడ్డం వివేక్‌ సంపన్నుడు

  • ఆ తర్వాత పొంగులేటి, రాజగోపాల్‌

  • టాప్‌-20లో 10 మంది కాంగ్రెసోళ్లే

  • ప్రముఖుల్లో బండి సంజయ్‌ నిరుపేద!

  • అప్పులే లేని భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల బరిలో ఉన్న ముఖ్య నేతలకు ఏమేర ఆస్తులున్నాయి? వారివి ధనిక కుటుంబాలేనా? సీఎం కేసీఆర్‌.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌.. బీజేపీ కీలక నేత బండి సంజయ్‌.. వీరికి ఏ స్థాయిలో ఆస్తులున్నాయి? ఎన్నికల వేళ జరుగుతున్న చర్చలివి..! ఎన్నికల అఫిడవిట్లలో అభ్యర్థులు తమ ఆస్తిపాస్తులను ప్రకటించారు. వారిలో 12 మంది ప్రభావవంతమైన నేతల ఆస్తులను పరిశీలిస్తే.. చెన్నూరు నుంచి కాంగ్రెస్‌ తరఫున బరిలో ఉన్న గడ్డం వివేక్‌ రూ.606 కోట్లతో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. కడు పేద అభ్యర్థిగా బీజేపీ కరీంనగర్‌ అభ్యర్థి బండి సంజయ్‌ ఉన్నారు. తనకు కారే లేదంటూ ‘కారు పార్టీ’ చీఫ్‌, సీఎం కేసీఆర్‌ వెల్లడించడం గమనార్హం! అఫిడవిట్ల ప్రకారం అత్యంత ప్రభావవంతులైన 12 మంది ఆస్తిపాస్తులను పరిశీలిస్తే..

TS Assembly Polls : ఆఖరి నిమిషంలో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టిన కేసీఆర్!!

గడ్డం వివేక్‌ - రూ.606.67 కోట్లు

చెన్నూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం వివేక్‌ ఆస్తులు రూ.606.67 కోట్లుగా పేర్కొన్నారు. చరాస్తులు రూ.380.76 కోట్లు కాగా, స్థిరాస్తులు రూ.225.91 కోట్లు అని ఆయన తెలిపారు. తనకు, తన భార్యకు రూ.45.44 కోట్ల ఆప్పులు ఉన్నట్లు వివరించారు.

vivek.jpg

పొంగులేటి - రూ.461.05 కోట్లు

కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కో-చైర్మన్‌, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ ఆస్తులు రూ.461.05 కోట్లు. ఆయన వార్షికాదాయం రూ.32.07 లక్షలు కాగా.. పొంగులేటి సతీమణి మాధురి ఆదాయం రూ.3.04 కోట్లు. అవిభాజ్య కుటుంబ ఆదాయం రూ.6.50 లక్షలే..! పొంగులేటి పేరిట రూ.32.44 కోట్ల చరాస్తులు, రూ.23.97 కోట్ల స్థిరాస్తులున్నాయి. రూ.4.22 కోట్ల మేర అప్పు ఉంది. మాధురి పేరిట రూ.391.63 కోట్ల చరాస్తులు, రూ.12.11 కోట్ల స్థిరాస్తులుండగా, రూ.39.30 కోట్ల మేర రుణాలున్నాయి. అవిభాజ్య కుటుంబం కింద రూ.4.70 లక్షల చరాస్తులు, రూ.85 లక్షల స్థిరాస్తులున్నట్లు పొంగులేటి ప్రకటించారు.

komatireddy rajagopal.jpg

రాజగోపాల్‌రెడ్డి - రూ.458.39కోట్లు

మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆస్తులు రూ.458.39 కోట్లుగా ఉన్నాయి. ఆయన వార్షికాదాయం రూ.71.17 కోట్లు. భార్య లక్ష్మి వార్షికాదాయం రూ.1.27 లక్షలు. రాజగోపాల్‌రెడ్డికి రూ.92.56 లక్షల విలువ చేసే 1,780 గ్రాముల బంగారం, భార్యకు రూ.2.07 కోట్ల విలువ చేసే 3,996 గ్రాముల బంగారం, రూ.14.40 లక్షల విలువైన వెండి, రూ.94.41 లక్షల విలువైన 30 క్యారెట్స్‌ వజ్రాలున్నాయి.రాజగోపాల్‌ పేరిట రూ.297.36 కోట్ల చరాస్తులు, రూ.108.23 కోట్ల స్థిరాస్తులున్నాయి. ఆయన భార్య పేరిట రూ.4.18 కోట్ల చరాస్తులు, రూ.48.60 కోట్ల స్థిరాస్తులు.. ఇరువరి అప్పులు రూ.4.14 కోట్లు. వీరికి ఎలాంటి వాహనాలు లేవు.

cm kcr.jpg

కేసీఆర్‌ - రూ.58.93 కోట్లు

కారు గుర్తు గల బీఆర్‌ఎస్‌ అధిపతి, సీఎం కేసీఆర్‌కు కారే లేదు. ఆయన కుటుంబానికి రూ.58.93 కోట్ల మేర ఆస్తులున్నాయి. వీటిలో స్థిరాస్తులు రూ.23.50 కోట్లు, చరాస్తులు రూ.35.43 కోట్లు. కేసీఆర్‌ పేరిట రూ.11.16 కోట్లు, భార్య శోభ పేరిట రూ.6.29 కోట్ల విలువైన ఎఫ్‌డీలు ఉండగా.. అవిభాజ్య కుటుంబం కింద రూ.12.75 లక్షల ఎఫ్‌డీలు ఉన్నాయి. రూ.8.88 కోట్ల అప్పులున్నాయని, మాజీ ఎంపీ జి.వివేక్‌ నుంచి రూ.1.06 కోట్లు అప్పు తీసుకున్నట్లు కేసీఆర్‌ పేర్కొన్నారు.

ktr.jpg

కేటీఆర్‌ - రూ.53.31 కోట్లు

సిరిసిల్ల నుంచి పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌.. తన కుటుంబానికి మొత్తం రూ.53.31 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో ప్రకటించారు. ఇందులో చరాస్తులు రూ.35.01 కోట్లు, స్థిరాస్తులు రూ.18.30 కోట్లు కాగా, రూ.11.99 కోట్ల మేర రుణాలున్నాయని వెల్లడించారు. 4.8 కిలోల బంగారం, 38.17 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని తెలిపారు.

etela-rajender.jpg

ఈటల - రూ.50.93 కోట్లు

గజ్వేల్‌, హుజూరాబాద్‌ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు రూ.50.93 కోట్ల మేర ఆస్తులున్నాయి. ఇందులో చరాస్తులు రూ.23.65 కోట్లు, స్థిరాస్తులు రూ.27.28 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తనకు కారు లేదని.. 13.25 ఎకరాల భూమి ఉన్నట్లు చెప్పారు. ఆయన భార్య జమున పేరిట 59 ఎకరాలున్నాయి. రూ.19 కోట్ల మేర అప్పు ఉన్నట్లు ఈటల అఫిడవిట్‌ స్పష్టం చేస్తోంది.

REVANTH.jpg

రేవంత్‌రెడ్డి - రూ.30.04 కోట్లు

కొడంగల్‌, కామారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆస్తులు రూ.30.04 కోట్లు. ఇందులో స్థిరాస్తులు రూ.24.87 కోట్లు, చరాస్తులు రూ.5.17 కోట్లు. చరాస్తుల్లో ఆయన పేరిట రూ.2.18 కోట్లు, భార్య గీత పేరిట రూ.2.92 కోట్లు, కుటుంబ సభ్యుల పేరిట రూ.5.50 లక్షలు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. రుణాలు, ఆస్తి పన్ను బకాయిలు, ఇంటి రుణాలు అన్నీ కలిపి దాదాపు రూ.1.46 కోట్ల దాకా ఉన్నట్లు వివరించారు.

harish rao.jpg

హరీశ్‌రావు - రూ.24.29 కోట్లు

సిద్దిపేట బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి హరీశ్‌రావు కుటుంబ ఆస్తి రూ.24.29 కోట్లు. స్థిరాస్తుల వాటా రూ.10.20 కోట్లు కాగా, చరాస్తులు రూ.14.09 కోట్లు. కుటుంబానికి మొత్తం రూ.11.50 కోట్ల అప్పులుండగా.. వ్యవసాయ భూముల్లేవు. తమ వద్ద ఉన్న ఆభరణాల విలువను రూ.2.5 కోట్లుగా పేర్కొన్నారు.

Bhattivikramarka.jpg

భట్టి - రూ.8.13 కోట్లు

సీఎల్పీ నేత, మధిర కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్కకు నయాపైసా అప్పు లేదు. కుటుంబ సభ్యులందరికీ కలిపి రూ.8.13 కోట్ల మేర ఆస్తులున్నాయి. ఇందులో చరాస్తులు రూ.1.91 కోట్లు కాగా.. స్థిరాస్తులు రూ.6.21 కోట్లు. భట్టి ఒంటిపై రూ.3.40 లక్షల విలువైన 64 గ్రాముల బంగారం.. ఆయన భార్యకు 930 గ్రాముల బంగారం, భట్టి పేరిట ఒక ఇన్నోవా క్రిస్టా ఉన్నాయి.

uttam.jpg

ఉత్తమ్‌ - రూ.5.82 కోట్లు

హుజూర్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి రూ.5.82 కోట్ల మేర ఆస్తులున్నాయి. వీటిల్లో చరాస్తులు రూ.50.33 లక్షలు కాగా.. ఆయన భార్య పద్మావతి పేరిట రూ.82.18 లక్షల ఆస్తులున్నాయి. ఇద్దరి పేర్ల మీద కలిపి రూ.1.32 కోట్ల మేర చరాస్తులున్నాయి. ఉత్తమ్‌ కుటుంబానికి రూ.4.49 కోట్ల స్థిరాస్తులున్నాయి. రూ.85.68 లక్షల మేర అప్పులున్నట్లు ఉత్తమ్‌ తెలిపారు.

bandi-sanjay-komuram.jpg

స్థిరాస్తుల్లేని బండి సంజయ్‌

తనకు ఎలాంటి స్థిరాస్తులు లేవని కరీంనగర్‌ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ ప్రకటించారు. తనకు ఒకటి, భార్య పేరిట మరో కారు ఉన్నాయని తెలిపారు. చేతిలో రూ.లక్షన్నర, సతీమణి దగ్గర రూ.లక్ష నగదు ఉన్నాయని తెలిపారు. చరాస్తుల విలువ రూ.79.51 లక్షలని, కుటుంబానికి ఎలాంటి స్థిరాస్తులు లేవని ప్రకటించారు. రూ.17.84 లక్షల మేర అప్పులున్నట్లు పేర్కొన్నారు.

Arvind.jpg

కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ కుటుంబానికి స్థిర, చరాస్తులు రూ.57.61 కోట్లు, అప్పులు రూ.29.12 కోట్ల మేర ఉన్నాయి. ఆయన తనకు వ్యవసాయ భూముల్లేవని అఫిడవిట్‌లో వెల్లడించారు.

సతీమణులు..!

ఎన్నికల బరిలో ఉన్న పలువురు అభ్యర్థులు తమ కంటే.. తమ జీవిత భాగస్వాములకే ఎక్కువ ఆస్తులున్నట్లు ప్రకటించారు. కేటీఆర్‌.. తన భార్య శైలిమకు రూ.11.11 కోట్ల మేర వార్షికాదాయం ఉన్నట్లు తెలిపారు. ఆయన వార్షికాదాయం మాత్రం రూ.1.05 కోట్లు కావడం గమనార్హం..! అయితే.. ఐదేళ్లలో కేటీఆర్‌ చరాస్తులు రూ.3.29 కోట్ల మేర పెరిగాయి. పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చరాస్తుల విలువ రూ.32 కోట్లు కాగా.. ఆయన భార్య మాధురి పేరిట రూ.391 కోట్ల మేర ఆస్తులున్నాయి. ఈటల రాజేందర్‌ పేరిట 13.25 ఎకరాల భూమి ఉండగా, ఆయన భార్య జమున పేరిట 59 ఎకరాలున్నట్లు చూపారు. రేవంత్‌రెడ్డి పేరిట రూ.2.18 కోట్లు విలువగల చరాస్తులుండగా, ఆయన భార్య గీత పేరిట రూ.2.92కోట్ల ఆస్తులున్నాయి. హుజూర్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేరిట రూ.1.27 కోట్ల స్థిరాస్తులుండగా.. ఆయన భార్య పద్మావతి పేరిట రూ.2.17 కోట్ల ఆస్తులున్నాయి.

2Puvvada-Ajay-.jpg

నేను డాలర్‌లాంటోడిని.. నువ్వు రద్దయిన 2 వేల నోటువి

నేను డాలర్‌ లాంటి వాడిని.. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా చెల్లుతా.. నా విలువ తగ్గదు.. ఉమ్మడి జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచైనా గెలిచే సత్తా నాకుంది.. రేపు ఖమ్మంలోనూ నేనే గెలిచేది. పువ్వాడ అజయ్‌.. నువ్వే రద్దయిన, చెల్లని రూ.2 వేల నోటులాంటోడివి. ఖమ్మం దాటితే ఎక్కడా పోటీ చేయలేవు. పక్క నియోజకవర్గాలకు వెళితే పువ్వాడ ఎవరో ఎవరూ గుర్తుపట్టలేరు. నేను ఎక్కడ పోటీ చేసి గెలిచినా ఖమ్మం నగరం అభివృద్ధిని మరవలేదు. కానీ పువ్వాడ అజయ్‌ మట్టి మాఫియా నుంచి గంజాయి మాఫియా వరకూ.. అరాచకులను తయారు చేసి ప్రజల మీదకు వదిలి, అశాంతిని నెలకొల్పి, సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నారు.

- మంత్రి పువ్వాడపై తుమ్మల నాగేశ్వరరావు

TG-Map-and-Parties.jpg

Updated Date - 2023-11-11T09:02:48+05:30 IST