అన్ని పార్టీలకూ అదే గళం
ABN , First Publish Date - 2023-11-06T04:03:59+05:30 IST
తెలంగాణ అభివృద్ధి ప్రదాత చంద్రశేఖర్‌రావుకే మళ్లీ పట్టం కట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసినా.. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ నాయకత్వాన్నే బలపరుద్దామని నచ్చజెప్పినా..
ప్రచారంలో ఎక్కడ చూసినా ‘సలీం’ గొంతే!
‘భాగ్యలక్ష్మి బంపర్ డ్రా’ ప్రచారంతో తెలుగుప్రజలందరికీ చిరపరిచితమైన గళం ఆయనది
(ఆంధ్రజ్యోతి-సిరిసిల్ల): ఏ పార్టీ లీడరు ఆ పార్టీకి ప్రచారం చేయడం కామన్!
అన్ని పార్టీలకూ ఒక్కడే ప్రచారం చేస్తే.. ఆ ఒక్కడు ఎండీ సలీం!!
తెలంగాణ అభివృద్ధి ప్రదాత చంద్రశేఖర్‌రావుకే మళ్లీ పట్టం కట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసినా.. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ నాయకత్వాన్నే బలపరుద్దామని నచ్చజెప్పినా.. ఇలా ఎక్కడ ఏ పార్టీ ప్రచారమైనా.. వినిపించే గళం మాత్రం సలీందే. ఒక్క తెలంగాణలోనే కాదు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ సలీం గళానికి యమా డిమాండ్ ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలైనా.. స్థానిక ఎన్నికలైనా.. సలీం గొంతు వినిపించాల్సిందే. నాలుగు దశాబ్దాలుగా ఇలా అన్ని పార్టీల ప్రచారానికీ ఆయన తన గొంతు అరువు ఇస్తూనే ఉన్నాడు. ఇలా అన్ని పార్టీల ప్రచారానికీ గొంతుకగా మారిన సలీం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తి. సిరిసిల్లలోని లక్ష్మీ థియేటర్‌లో ప్రదర్శించే చిత్రాల కోసం.. రిక్షాలో కూర్చుని ప్రచారం చేయడంతో 1974లో సలీం ప్రస్థానం ప్రారంభమైంది. ఖంగున మోగుతూ.. దూరాన ఉన్నవారిని సైతం ఆకర్షించే విధంగా స్పష్టంగా ఉండే ఆ గొంతు అనతికాలంలోనే అందరికీ చిరపరిచితమైంది.
సినిమా ప్రచారం నుంచి బీడీల అమ్మకాలు, లాటరీ టిక్కెట్ల ప్రచారానికి సలీం పరిధి విస్తరించింది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన భాగ్యలక్ష్మి లాటరీ టిక్కెట్ల అమ్మకాల ప్రచారంతో సలీం కంఠం తెలంగాణవాసులతోపాటు.. సీమాంధ్రులకూ పరిచయమైంది. దరిమిలా.. రాజమండ్రి పాలకోవా నుంచి రకరకాల ఉత్పత్తుల దాకా అన్నింటికీ సలీం గొంతే కావాల్సి వచ్చింది. ఇంత పాపులర్ గళాన్ని రాజకీయ పార్టీలు మాత్రం వదిలిపెడతాయా? అన్ని పార్టీలూ.. తమ ఎన్నికల ప్రచారాలకు, ఇతర కార్యక్రమాలకు ఆయన గొంతును వాడుకోవడం మొదలుపెట్టాయి. మాతృభాష ఉర్దూ అయినా.. సలీం గొంతు నుంచి జాలువారే తెలుగు భాష అద్భుతంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. వృత్తి పరంగా ఆయనకు రికార్డింగ్ సెంటర్ ఉంది. మైక్‌లు, టెంట్స్ సరఫరా చేస్తుంటారు. అమర గాయకుడు ఘంటసాల అంటే సలీంకు ఎంతో ఇష్టం అందుకే.. ఆయన గానం చేసిన పాటలన్నింటినీ ఒక దగ్గర నిక్షిప్తం చేయాలన్న తపనతో ఘంటసాల కల్చరల్ అకాడమీ ఏర్పాటు చేశారు. గత 40ఏళ్లుగా ప్రచార రంగంలో తనకంటూ ఓ స్థానం కల్పించుకున్న సలీం.. కళాజ్యోతి, కళాసాగర్, రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలను సైతం అందుకున్నారు.