నల్లగొండ సీటుపై అందరి కన్ను

ABN , First Publish Date - 2023-01-25T01:06:32+05:30 IST

నల్లగొండ సీటుపై బీఆర్‌ఎస్‌ పార్టీలో పలువురు నేతలు కన్నేశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉన్నా, సిట్టింగ్లకే మళ్లీ అవకాశమని సీఎం కేసీఆర్‌ చెబుతున్నా ఆశావహులు మాత్రం జోరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజు ఆరు నెలలుగా విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతూ చర్చలో నిలిచారు. మరోవైపు చాడ కిషన్‌రెడ్డి సైతం నియోజకవర్గంలో పర్యటిస్తూ అధిష్ఠానం సూచనతో పని చేసుకుంటున్నానని చెబుతున్నారు.

నల్లగొండ సీటుపై అందరి కన్ను

ఎమ్మెల్యేకు పోటాపోటీగా బీఆర్‌ఎస్‌ నేతల కార్యక్రమాలు

నల్లగొండ, జనవరి 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నల్లగొండ సీటుపై బీఆర్‌ఎస్‌ పార్టీలో పలువురు నేతలు కన్నేశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉన్నా, సిట్టింగ్లకే మళ్లీ అవకాశమని సీఎం కేసీఆర్‌ చెబుతున్నా ఆశావహులు మాత్రం జోరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజు ఆరు నెలలుగా విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతూ చర్చలో నిలిచారు. మరోవైపు చాడ కిషన్‌రెడ్డి సైతం నియోజకవర్గంలో పర్యటిస్తూ అధిష్ఠానం సూచనతో పని చేసుకుంటున్నానని చెబుతున్నారు.

నియోజకవర్గంలో బలమైన రాజకీయ పునాదులు ఉన్న చకిలం అనీల్‌ తాజాగా ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో సమావేశానికి తెరలేపారు. మూడు దశాబ్దాలుగా జిల్లాలో కీలక పదవు లు నిర్వహిస్తున్న మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు అమిత్‌రెడ్డి సైతం నల్లగొండ కేంద్రంగా సేవా కార్యక్రమాల పేరుతో రాజకీయాలకు శ్రీకారం చుట్టడంతో సర్వత్రా చర్చ కొనసాగుతోంది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం మూడోసారి ఎన్నికలను ఎదుర్కోనున్న అధికార పార్టీపై ఇప్పటికే వ్యతిరేక పవనాలు ప్రారంభమయ్యాయి. దీనికి తోడు నియోజకవర్గంలో బలమైన నేతలు ఎవరికి వారుగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం అధికార పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఈ పరిణామం మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇతరులకు ప్రయోజనం చేకూర్చేదే అనే విశ్లేషణలు నియోజకవర్గంలో మొదలైంది.

చాడ పోస్టర్ల రగడ

పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగిన చాడ కిషన్‌రెడ్డి సైతం నల్లగొండ టికెట్‌పై కన్నేశారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాలని అధిష్ఠానం ఆదేశించిందంటూ ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా పాత క్యాడర్‌కు ఆర్థిక సాయం చేసుకుంటూ వస్తున్నారు. ఎన్నికలు సమీపించడంతో కార్యక్రమాల వేగాన్ని పెంచారు. తన పుట్టిన రోజు, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపే పోస్టర్లను చాడ అనుచరులు నియోజకవర్గ వ్యాప్తంగా అతికించారు. ఇటీవల పోటీ పరీక్షలకు సంబంధించిన ఓ సంస్థ పోస్టర్లు వరుసగా చాడ కిషన్‌రెడ్డి పోస్టర్లపైనే అంటించడం వెలుగుచూసింది. కావాలనే సొంత పార్టీ నేతలే చాడ ఫొటో కనిపించకుండా ఈ ప్రయత్నానికి ఒడిగట్టారని, మొత్తం 20వేల పోస్టర్లు వేశామని, వాటన్నింటిని కనిపించకుండా చేసే వరకు వేచిచూస్తామని, ఆ తర్వాత మరోసారి ఆ ఇనిస్టిట్యూట్‌ పోస్టర్లపైనే తామూ పోస్టర్లు వేస్తామని చాడ వర్గీయులు చెబుతున్నారు. వినాయక చవితి శోభాయాత్ర సమయంలో సైతం తమ నాయకుడి ప్లెక్సీలు, బ్యానర్లను మునిసిపాలిటీ సిబ్బంది తొలగిస్తుండగా మునిసిపల్‌ చైర్మన్‌తో పాటు కమిషనర్‌ వద్ద నిరసన తెలపడంతో ఆ కార్యక్రమం ఆగిందని కార్యకర్తలు చెబుతున్నారు. సొంత పార్టీ నేతలే తమ నేత పోస్టర్లు, ప్లెక్సీలు కనిపించకుండా చేస్తున్నారని చాడ వర్గీయులు ఆరోపిస్తున్నారు.

సేవా కార్యక్రమాలతో అమిత్‌రెడ్డి

గుత్తా అమిత్‌రెడ్డిని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నానని ఇటీవల మీడియా సమావేశంలో ఆయన తండ్రి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. కరోనా సమయంలో అమిత్‌రెడ్డి దంపతులు నల్లగొండలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటన అనంతరం వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల అమిత్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు ఏర్పాటుచేసి పార్టీ నేతలను ఆహ్వానించారు. గుత్తా కుటుంబానికి అనుకూలంగా ఉండే బీఆర్‌ఎస్‌ నేతలంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమిత్‌ నల్లగొండ ఎమ్మెల్యే సీటుపై కన్నేశారా? నల్లగొండ ఎంపీగా బరిలో దిగుతారా? అనే చర్చ సర్వత్రా సాగుతోంది. నల్లగొండ పార్లమెంట్‌ పరిధిలో గుత్తా సుఖేందర్‌రెడ్డికి బలమైన సంబంధాలు ఉండడం, గతంలో ఎన్నడూ లేని విధంగా అమిత్‌ పుట్టిన రోజు వేడుకలు అట్టహాసంగా నిర్వహించడం, ఇటీవల అమిత్‌రెడ్డి వరుస కార్యక్రమాలు చేపట్టడంతో ఈ చర్చ నియోజక వర్గంలో మొదలైంది.

ఆరు నెలలుగా రామరాజు కార్యక్రమాలు

నియోజకవర్గ నేతలు తనను తీవ్రంగా అవమానించారని, ఆ ఆవేదనతో తాను ప్రజల్లోకి వెళ్లి ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతూ బీఆర్‌ఎస్‌ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు, నిరుపేద విద్యార్థుల చదువులకు, క్రీడా పోటీలకు నగదు సాయం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు తన అనుచరులతో హాజరవుతున్నారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్‌ జాతీయ సభకు నియోజకవర్గం నుంచి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించారు. ఎక్కడికి వెళ్లినా బీఆర్‌ఎ్‌సను గెలిపించాలని, సీఎం కేసీఆర్‌ మూలంగానే సంక్షేమ పథకాలు ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్నారు. పార్టీ, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉంటే ఎమ్మెల్యేగా బరిలో దిగుతానని ప్రచారం చేస్తున్నారు. తనతో పాటు తన ఇద్దరు సోదరుల పేర్లపై ఆర్‌కేఎస్‌ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

నేడు ఉద్యమకారుల సమ్మేళనం

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బలమైన నేత అయిన చకిలం శ్రీనివా్‌సరెడ్డి కుమారుడు, రాజకీయ వారసుడైన అనీల్‌కుమార్‌ తెలంగాణ ఉద్యమ సమయంలో గులాబీ కండువా కప్పుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి ఆయన పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం ఇవ్వలేకపోయిన అధిష్ఠానం ఆయన్ను గుర్తించి పలుమార్లు ప్రగతిభవన్‌కు పిలిచింది. సముచిత పదవితో గౌరవిస్తామని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ పలుమార్లు హామీ ఇచ్చారు. మరో 10నెలల్లో సాధారణ ఎన్నికలు ఉండగా నేటికీ అనీల్‌కు కార్పొరేషన్‌ చైర్మన్‌ వంటి పదవి దక్కలేదు. దీనిపై ఆయనతో పాటు అనుచర వర్గం నిరాశతో ఉంది. ఎన్నికలు సమీపించడంతో తన శక్తిని నిరూపించేందుకు చకిలం అనీల్‌ నియోజకవర్గంలో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఈనెల 25న ఆయన స్వగృహంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నల్లగొండ నియోజకవర్గానికి చెందిన సుమారు 600 మంది హాజరవుతారని అనీల్‌ అనుచరులు ఏర్పాట్లలో ఉన్నారు. ఈ సమావేశానికి పాతతరం బీఆర్‌ఎస్‌ నేతలంతా నైతిక మద్దతు ప్రకటించి వారి అనుచరులను పంపేందుకు సమాచారం అందించినట్లు తెలిసింది.

Updated Date - 2023-01-25T01:06:40+05:30 IST