Share News

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో అయ్యప్ప భక్తుల అగచాట్లు

ABN , Publish Date - Dec 18 , 2023 | 02:46 AM

ఎయిరిండియా నిర్వహకంతో రాష్ట్రానికి చెందిన అయ్యప్ప భక్తులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అగచాట్లుపడ్డారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో అయ్యప్ప భక్తుల అగచాట్లు

సాంకేతిక కారణంతో విమానం నిలిపివేత

బండి సంజయ్‌ దృష్టికి తీసుకెళ్లిన భక్తులు

కేంద్రమంత్రితో మాట్లాడిన బండి

శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు

హైదరాబాద్‌, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఎయిరిండియా నిర్వహకంతో రాష్ట్రానికి చెందిన అయ్యప్ప భక్తులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అగచాట్లుపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి బెంగళూరు మీదుగా(కనెక్టింగ్‌) కోచి వెళ్లాల్సిన విమానాన్ని సాంకేతిక కారణాల పేరుతో నిలిపివేశారు. దాంతో.. శబరిమలకు వెళ్లాల్సిన భక్తులంతా కొన్ని గంటలపాటు విమానాశ్రయంలో పడిగాపులుకాచారు. షెడ్యూల్‌(శబరిమల ఆన్‌లైన్‌ స్లాట్‌ బుకింగ్‌) ప్రకారం వారంతా సోమవారం ఉదయం సన్నిదానంలో అయ్యప్పస్వామిని దర్శించుకోవాల్సి ఉంది. విమానం ఎప్పుడు బయలుదేరుతుంది? వేరే విమానాన్ని రప్పిస్తున్నారా? బయలుదేరే వరకు అయ్యప్ప భక్తుల పరిస్థితి ఏమిటి? అనేదానిపై ఎయిరిండియా నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో భక్తులు ఆందోళన చెందారు. అదే సమయంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ ఢిల్లీ వెళ్లేందుకు విమానాశ్రయానికి రావడంతో.. భక్తులంతా ఆయనతో తమ గోడును వెల్లబోసుకున్నారు. వెంటనే స్పందించిన బండి సంజయ్‌.. కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఫోన్‌ చేసి, విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అయ్యప్ప భక్తుల పరిస్థితిని వివరించి, వీలైనంత త్వరగా వారి సమస్యను తీర్చాలని కోరారు. సింధియా వెంటనే ఎయిరిండియా అధికారులతో మాట్లాడారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కాగా.. భక్తులతో ఆదివారం శబరిమల పోటెత్తింది. గత వారం రద్దీని నియంత్రించడంలో ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు(టీడీబీ) విఫలమైందనే విమర్శలు రావడంతో.. ఆదివారం దిద్దుబాటు చర్యలు తీసుకుంది. చిన్నారులు, వారి వెంట ఉన్న వారికోసం ప్రత్యేక క్యూలైన్‌ను ఏర్పాటు చేసింది. పిల్లలతోపాటు.. దివ్యాంగులు, మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శబరిమల సన్నిధానంలో భక్తుల సౌకర్యార్థం ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పింది.

Updated Date - Dec 18 , 2023 | 02:46 AM