బ్రాహ్మణ సదన్‌ ప్రారంభోత్సవానికీ పొరుగు రాష్ట్రంలో ప్రకటనలు!

ABN , First Publish Date - 2023-06-01T03:34:57+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమాలకు పొరుగు రాషా్ట్రల్లోనూ విస్తృతంగా ప్రచారం కల్పిస్తోన్న విషయం తెలిసిందే.

బ్రాహ్మణ సదన్‌ ప్రారంభోత్సవానికీ   పొరుగు రాష్ట్రంలో ప్రకటనలు!

బీఆర్‌ఎస్‌ విస్తరణ, ఓట్ల కోసమే..

కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేస్తున్నారని ప్రతిపక్షాల విమర్శ

హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమాలకు పొరుగు రాషా్ట్రల్లోనూ విస్తృతంగా ప్రచారం కల్పిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా గోపన్‌పల్లిలో నిర్మించిన బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవానికి సంబంధించీ తెలంగాణలోని కొన్ని పత్రికలతోపాటు ఇతర రాషా్ట్రల పత్రికల్లోనూ ప్రకటనలు ఇచ్చారు. మహారాష్ట్రలోని ప్రముఖ పత్రికకు మొదటి పేజీ ప్రకటన ఇచ్చారు. బ్రాహ్మణ సదనం విషయం ఆయా రాషా్ట్రల్లో ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గం వారికి తెలియజేసి, బీఆర్‌ఎస్‌ వైపు ఆకర్షించడంలో భాగంగానే అక్కడి పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎ్‌సగా మారిన తర్వాత జాతీయ స్థాయిలో ప్రచారంపై దృష్టి సారించింది.

అందులో భాగంగా రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేసినా.. దానికి సంబంధించి ఇతర రాషా్ట్రల్లోని ప్రముఖ పత్రికలు, టీవీల్లో ప్రకటనల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ఏర్పాటైన తర్వాత మహారాష్ట్రలో సీఎం కేసీఆర్‌ సభ నిర్వహించిన సమయంలో పెద్దఎత్తున ఇతర రాషా్ట్రల్లోని ప్రముఖ పత్రికలకు ప్రకటనలు ఇచ్చారు. గతంలో ఐ అండ్‌ పీఆర్‌కు అంతంత మాత్రంగా నిధులు కేటాయించిన ప్రభుత్వం ఎన్నికల ఏడాది కావడంతో 2023-24 ఆర్థిక సంవత్సరంలో సుమారు వెయ్యి కోట్లు కేటాయించింది. ఎన్నికలకు మరికొద్ది నెలల గడువు మాత్రమే మిగిలి ఉండటంతో పెద్ద మొత్తంలో ప్రచారానికి ఖర్చు చేస్తోంది. పత్రికలు, టీవీలకే పరిమితం కాకుండా కొత్త మార్గాల్లో ప్రకటనలకు ప్రణాళిక రచిస్తున్నారు. ఇప్పటి వరకు ఐ అండ్‌ పీఆర్‌కు ఇన్‌ఛార్జి కమిషనర్‌ ఉండగా ఇటీవల ఐఏఎ్‌సల బదిలీల్లో పూర్తిస్థాయి కమిషనర్‌ను ప్రభుత్వం నియమించింది. బీఆర్‌ఎస్‌ విస్తరణ, ఓట్ల కోసమే ప్రభుత్వం తెలంగాణ ప్రజల ధనాన్ని ఇతర రాషా్ట్రల్లో ప్రకటనలకు ఖర్చు చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

Updated Date - 2023-06-01T03:34:57+05:30 IST