HYD Metro : త్వరలో మెట్రోకు అదనపు కోచ్‌లు!

ABN , First Publish Date - 2023-07-13T05:25:48+05:30 IST

ప్రయాణికులు పెరుగుతుండడంతో మెట్రో సర్వీసులను మరింత సమర్థంగా నిర్వహించేందుకు హైదరాబాద్‌ మెట్రో, ఎల్‌అండ్‌టీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

HYD Metro : త్వరలో మెట్రోకు అదనపు కోచ్‌లు!

ఒక్కో రైలుకు మూడు బోగీల ఏర్పాటుకు కసరత్తు

ఎల్బీనగర్‌, నాగోలు కారిడార్లలో నడిపేందుకు చర్యలు

హైదరాబాద్‌ సిటీ, జూలై 12(ఆంధ్రజ్యోతి): ప్రయాణికులు పెరుగుతుండడంతో మెట్రో సర్వీసులను మరింత సమర్థంగా నిర్వహించేందుకు హైదరాబాద్‌ మెట్రో, ఎల్‌అండ్‌టీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అదనపు బోగీల ఏర్పాటుకు యోచిస్తున్నారు. మూడు కారిడార్లలో రోజువారీగా 5.10 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. మెట్రో ప్రారంభ సమయంలో ఈ సంఖ్య లక్షన్నరనే. ప్రధానంగా ఐటీ ఉద్యోగులే మెట్రో ఎక్కేందుకు ఆసక్తి చూపించారు. ఇప్పుడు ట్రాఫిక్‌ నుంచి తప్పించుకునేందుకు ఇతర సంస్థల ఉద్యోగులు విద్యార్థులు, సాధారణ ప్రజలు మెట్రోను వినియోగిస్తున్నారు. నగరం నలుమూలలకు మెట్రోలో 30-40 నిమిషాల్లోనే వెళ్లే అవకాశం ఉంది. బస్సు చార్జీ కంటే రూ.30- రూ.40 అదనంగా ఉన్నప్పటికీ ట్రాఫిక్‌ బెడద ఉండదు. ఈ నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నడిచే సర్వీసుల్లో రద్దీ ఉంటోంది. కొనిసార్లు పరిమితికి మించుతున్నారు. కాగా, మే, జూన్‌లో ప్రజలు పెద్దఎత్తున మెట్రోనే ఆశ్రయించారు. జూలై 4న ఎల్టీనగర్‌ - మియాపూర్‌ కారిడార్‌లో 2.60 లక్షలమంది, జేబీఎ్‌స-ఎంజీబీఎ్‌సలో 25 వేలు, నాగోలు-రాయదుర్గంలో 2.25 లక్షల మంది ప్రయాణించారు.

కారిడార్‌-1, 3లో..

కారిడార్‌-1 ఎల్బీనగర్‌-మియాపూర్‌, కారిడార్‌-3 నాగోలు-రాయదుర్గంలో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 5 నుంచి 8 నిమిషాలకు ఓసారి సర్వీసులు ఉన్నప్పటికీ రద్దీ తగ్గడం లేదు. ప్రస్తుతం 57 స్టేషన్ల గుండా 57 రైళ్లు నడుస్తున్నాయి. ప్రతి రైలుకు మూడు బోగీలున్నాయి. ఇందులో అరబోగీ వరకు మహిళలకు కేటాయించారు. కోచ్‌లను పెంచాలని ప్రయాణికుల నుంచి పెద్దఎత్తున డిమాండ్‌ వస్తోంది. కొందరు ప్రభుత్వానికి ట్విటర్‌ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో ఒక్కో రైలుకు అదనంగా మూడు కోచ్‌ల ఏర్పాటుకు ఎల్‌అండ్‌టీ సిద్ధమవుతోంది. కొత్త బోగీల కొనుగోలుకు సమయం పట్టే అవకాశం ఉండడంతో ప్రత్యామ్నాయంగా అద్దెకు తెచ్చే యోచనలో ఉన్నారు. చెన్నై, నాగపూర్‌ మెట్రో అధికారులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆగస్టులోగా ప్రతి రైలుకు అదనంగా మూడు కోచ్‌లు ఏర్పాటయ్యే అవకాశం ఉందని సమాచారం.

Updated Date - 2023-07-13T05:25:48+05:30 IST