ఆచార్య భాస్కర్‌ శివాల్కర్‌ ఇక లేరు

ABN , First Publish Date - 2023-09-06T04:53:07+05:30 IST

ప్రముఖ రంగస్థల దర్శకుడు, నటుడు, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్‌ భాస్కర్‌ శివాల్కర్‌(81) ఇకలేరు.

ఆచార్య భాస్కర్‌ శివాల్కర్‌ ఇక లేరు

వందకుపైగా నాటకాలకు దర్శకత్వం

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు5 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ రంగస్థల దర్శకుడు, నటుడు, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్‌ భాస్కర్‌ శివాల్కర్‌(81) ఇకలేరు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1940, మే 11న నాంపల్లిలో జన్మించిన భాస్కర్‌ శివాల్కర్‌.. మిత్రులతో కలిసి 1971లో ‘రంగధార’ నాటక సంస్థను నెలకొల్పారు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిషు, మరాఠి భాషల్లో 120కు పైగా నాటకాలను రూపొంది దర్శకత్వం వహించారు. ఆయన రూపొందించిన పలు నాటకాలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. లండన్‌ థియేటర్‌ ఫెస్టివల్‌తో పాటు మహారాష్ట్ర, బెంగళూరు, కేరళ నాటకోత్సవాల్లోనూ శివాల్కర్‌ నాటకాలను ప్రదర్శించారు. సినీనటులు రాళ్లపల్లి, తెలంగాణ శకుంతల, తనికెళ్ల భరణి, శంకర్‌ మేల్కొటె తదితరులు తొలినాళ్లలో భాస్కర్‌ శివాల్కర్‌ దర్శకత్వంలో నాటకాల్లో నటించారు. శివాల్కర్‌ శిష్యుడు సూత్రధార వినయ్‌వర్మ ద్వారా ప్రముఖ నటుడు విజయ్‌ దేవరకొండ రంగస్థలానికి పరిచయం అయ్యారు. భాస్కర్‌ శివాల్కర్‌ ఉద్యోగ విరమణ అనంతరం వివిధ సంస్థల్లో నటనపై పాఠాలు బోధించారు. ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. శివాల్కర్‌ అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం ముగిశాయి.

Updated Date - 2023-09-06T04:53:07+05:30 IST