తెలుగు రాష్ర్టాల్లో ‘ఆటా’ సేవా కార్యక్రమాలు
ABN , First Publish Date - 2023-12-11T04:04:59+05:30 IST
అమెరికా, కెనడా దేశాల్లో తెలుగు వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికా తెలుగు సంఘం (ఆటా)ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి 30 వరకు తెలుగు రాష్ర్టాల్లో సేవా....
నేటి నుంచి 20 రోజులపాటు నిర్వహణ
పంజాగుట్ట, డిసెంబరు10 (ఆంధ్రజ్యోతి): అమెరికా, కెనడా దేశాల్లో తెలుగు వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికా తెలుగు సంఘం (ఆటా)ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి 30 వరకు తెలుగు రాష్ర్టాల్లో సేవా, సాంస్కృతిక, వ్యాపార, విద్య, ఆరోగ్యం, ఆధ్యాత్మిక తదితర కార్యక్రమాలు, వేడుకలు నిర్వహిస్తున్నట్టు ఆటా వేడుకల చైర్మన్, సంఘం అధ్యక్షుడు జయంత్ చల్లా తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆటా వేడుకల కో-చైర్ వేణు సంకినేని, కార్యదర్శి రామకృష్ణ రెడ్డి, కోశాధికారి సతీష్‌రెడ్డితో కలిసి ఆయన కార్యక్రమాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. వచ్చే జూన్ 7,8,9 తేదీల్లో అమెరికాలోని అట్లాంటా జార్జియా వరల్డ్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో 18వ ఆటా సదస్సు, యూత్ కన్వెన్షన్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. సదస్సుకు ముందు ప్రతి ఏడాది తెలుగు రాష్ట్రాల్లో ఆటా వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈనెల 11న శ్రీశైలం దేవస్థానం నుంచి వీటిని ప్రారంభిస్తున్నామన్నారు. తిరుపతిలో శాస్ర్తీయ సంగీత పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 30న ముగింపు సందర్భంగా రవీంద్రభారతిలో వేడుకలుంటాయని చెప్పారు.