అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి రోల్‌మోడల్‌

ABN , First Publish Date - 2023-06-03T00:52:41+05:30 IST

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఓ రోల్‌మోడల్‌గా నిలిచిందని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని గడియారం సెంటర్‌లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం ఉదయాదిత్య భవన్‌లో జరిగిన దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో మాట్లాడారు. బంగారు తెలంగాణ నిర్మాణ దిశగా ప్రారంభమైన ఈ ప్రయాణం దేశానికే కాదు మానవ సమాజానికి ఎన్నో పాఠాలు నేర్పించిందన్నారు.

అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి రోల్‌మోడల్‌

సీఎం కేసీఆర్‌ పాలనలో ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు

రాష్ట్ర ఆవిర్భావం, స్వయం పాలన ఒకేరోజు ప్రారంభం చరిత్రాత్మకం

వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట

శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

ఘనంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు

నల్లగొండ, జూన్‌ 2: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఓ రోల్‌మోడల్‌గా నిలిచిందని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని గడియారం సెంటర్‌లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం ఉదయాదిత్య భవన్‌లో జరిగిన దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో మాట్లాడారు. బంగారు తెలంగాణ నిర్మాణ దిశగా ప్రారంభమైన ఈ ప్రయాణం దేశానికే కాదు మానవ సమాజానికి ఎన్నో పాఠాలు నేర్పించిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతోపాటు స్వయం పాలన కూడా అదేరోజు ప్రారంభంకావడం చారిత్రక సందర్భమన్నారు. సీఎం కేసీఆర్‌ దార్షనిక పాలన, ప్రగతి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజా జీవితాల్లో గుణాత్మకమైన మార్పు వచ్చిందన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రాజనీతిని కనబరుస్తూ పనిచేస్తే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో తెలిపేందుకు తెలంగాణ ప్రగతి ఒక కొలమానమన్నారు. ప్రస్తుతం తెలంగాణలో సబ్బండ వర్గాల జీవితాల్లో వెళ్లి విరుస్తున్న సుఖసంతోషాలే అందుకు నిదర్శనమన్నారు.

తెలంగాణలో అమలవుతున్న విధంగా రైతుసంక్షేమ విధానాలు తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని రైతులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువస్తున్నారన్నారు. రైతుబంధు పథకం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిందన్నారు. పెట్టుబడిసాయం కింద ప్రతీ ఎకరాకు రూ.5వేల చొప్పున రెండు విడతలుగా మొత్తం రూ.10వేలు చెల్లిస్తున్నట్లు వివరించారు. ఈ పథకం కింద జిల్లాలో 4,83,179 మంది రైతులకు రైతుబంధు సాయం అందుతుందన్నారు. అదేవిధంగా దురదృష్టవశాత్తు ఎవరైన రైతు చనిపోతే ఆరైతు కుటుంబానికి రైతుబీమా కింద 10 రోజుల్లోనే రూ.5లక్షల బీమా అందజేస్తున్నారన్నారు.

గత యాసంగిలో సాగైన వరి ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగా సమస్యలు సృష్టించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక భారం లెక్కచేయకుండా పండిన పంటనంతా కొనుగోలు చేసిందన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 63 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వివరించారు. ఆయిల్‌పామ్‌ సాగును ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సహిస్తుందని తెలిపారు. జిల్లాలో 1022 మంది లబ్ధిదారులకు 4,946 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్‌ మొక్కలను పంపిణీ చేసినట్లు వివరించారు.

సమాఖ్య రాష్ట్రంలో తెలంగాణకు సాగునీటిరంగంలో తీరని అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో సాగునీటి రంగానికి స్వర్ణయుగం తలపిస్తోందన్నారు. ఏఎమ్మార్పీ, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు అంచనా విలువ రూ.3,152కోట్లతో పనులు ప్రారంభించి సొరంగం-1,2 తవ్వకం పనుల నిమిత్తం రూ.2,433కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. మిగతా పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఉదయ సముద్రం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం జిల్లాలో లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు రూ.674కోట్ల అంచనాతో పనులు ప్రారంభించి ఇప్పటివరకు రూ.524కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ఇటీవల ట్రయల్‌ రన్‌ కూడా పూర్తయిందన్నారు. డిండి లిఫ్ట్‌ ఇరిగేసన్‌ కింద జిల్లాలో 3.61లక్షల ఎకరాలకు నీరందించేందుకు రూ.6,190కోట్ల అంచనాతో ప్రారంభించి ఇప్పటికి రూ.2,822కోట్లను ఖర్చు చేసినట్లు వివరించారు. అదేవిధంగా జిల్లాలోని లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాలకు రూ.1915కోట్ల84లక్షలతో 86,660 ఎకరాలకు నీరందించేందుకు పలు లిఫ్ట్‌లను చేపట్టామన్నారు.

మనఊరు-మనబడి పథకం కింద మొదటి విడతగా జిల్లాలో 517 పాఠశాలను ఎంపికచేసి మౌలిక సదుపాయాల కల్పనకు రూ.175కోట్ల37లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లాకు ఒక మెడికల్‌ కళాశాల మంజూరైందని, నల్లగొండలో 42 ఎకరాల్లో రూ.275కోట్లతో కళాశాల భవన నిర్మాణం పనులు జరుగుతున్నాయన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్న విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డితోపాటు ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, భాస్కర్‌రావు, రవీంద్రకుమార్‌, నోముల భగత్‌, చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ కె.అపూర్వరావు, అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, ఖుష్భూగుప్తా, మునిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సీఎం కప్‌ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు.

అన్ని ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్‌

నల్లగొండ రూరల్‌: దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించే రైతు దినోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని దండంపల్లి గ్రామంలో రైతు వేదికను, స్థానిక సంస్థల కలెక్టర్‌ ఖుష్భూ గుప్తాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు జరిగే రైతు దినోత్సవంలో రైతులను భాగస్వామ్యం చేయాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్‌ నాగార్జునరెడ్డి, ఏవో సుమన్‌, సర్పంచ్‌ చింత పుష్ప, సైదులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:52:41+05:30 IST