ఏడేళ్లు తిరిగాడు.. 7 రోజులు ఓపిక పట్టుంటే?

ABN , First Publish Date - 2023-06-01T03:37:13+05:30 IST

ఉన్న కొద్దిపాటి సాగు భూమిని భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (బీటీపీఎ్‌స)లో కోల్పోయాడు. నిర్వాసితుల జాబితాలో ఉద్యోగం వస్తుందని ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నాడు.

ఏడేళ్లు తిరిగాడు..   7 రోజులు ఓపిక పట్టుంటే?

ఉద్యోగం రాలేదని బీటీపీఎస్‌ నిర్వాసితుడి బలవన్మరణం

జాబితాలో పేరున్నప్పటికీ అందని నియామక ఉత్తర్వులు

ఏళ్లుగా కలెక్టరేట్‌ చుట్టూ ప్రదక్షిణలు.. రూ.లక్షల్లో అప్పులు

పినపాక, మే 31: ఉన్న కొద్దిపాటి సాగు భూమిని భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (బీటీపీఎ్‌స)లో కోల్పోయాడు. నిర్వాసితుల జాబితాలో ఉద్యోగం వస్తుందని ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నాడు. తోటి నిర్వాసితులు విధుల్లో చేరినా.. జాబితాలో పేరొచ్చినా తనకు అవకాశం దక్కలేదు. తండ్రితో కలిసి బీటీపీఎస్‌ అధికారులు, కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాలకు చెప్పులరిగేలా తిరిగాడు. ఉపాధి లేకపోవడంతో జీవనం కోసం అప్పులు చేశాడు. చివరకు వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక ఆరు నెలల కింద తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య సైతం పుట్టింటికి వెళ్లిపోయింది. తీవ్ర మనో వేదనతో చివరకు ఆ నిరుద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే, అతడు మరో వారం ఓపిక పట్టుంటే.. ఉద్యోగ ఉత్తర్వులు అందేవని తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక, మణుగూరు మండలాల సరిహద్దుల్లో చిక్కుడుగుంట గ్రామంలో నిర్మితమవుతున్న భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ భూ సేకరణలో ఏడూళ్ల బయ్యారానికి చెందిన కోటపాటి చెన్నారెడ్డి వ్యవసాయ భూమి పోయింది.

పరిహారం సొమ్ము అందినా.. ప్యాకేజీ ప్రకారం చెన్నారెడ్డి కుమారుడైన సతీ్‌షరెడ్డి (30)కి ఉద్యోగం రాలేదు. జాబితాలో తనతో పాటే పేరున్న మరికొందరికి ఉద్యోగాలు వచ్చాయి. చెన్నారెడ్డి, సతీష్‌ అధికారులు చుట్టూ తిరిగారు. అప్పు చేసి మరీ లక్షలు ఖర్చు పెట్టారు. దీంతో సతీష్‌ భార్య ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. చెన్నారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. మిత్రుల వద్ద బాధ చెప్పుకొన్న సతీ్‌షరెడ్డి.. పట్టువదలకుండా బీటీపీఎస్‌ అధికారులను కలుస్తూ, కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఉత్తర్వులు అందలేదని బీటీపీఎస్‌ అధికారులు చెబుతుండడంతో విసుగెత్తి బుధవారం తెల్లవారుజామున పురుగుమందు తాగాడు. కాగా, సతీ్‌షకు చెందిన ఉద్యోగ నియామక ఉత్తర్వులు బీటీపీఎ్‌సకు అందాయని, మరో వారంలో ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఆ లోపే ప్రాణం తీసుకున్నాడన్న వాదన వినిపిస్తోంది.

Updated Date - 2023-06-01T03:37:13+05:30 IST