Share News

బియ్యం ధరలకు రెక్కలు

ABN , Publish Date - Dec 31 , 2023 | 03:29 AM

బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. సామాన్య కుటుంబాలకు అందనంతగా సన్న బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం 25 నుంచి 26 శాతం వరకు ధరలు పెరిగాయి.

బియ్యం ధరలకు రెక్కలు

పాత బియ్యం 25 కిలోల బస్తా రూ.1,500

సూపర్‌ ఫైన్‌ సన్న బియ్యం కిలో రూ.70

నిరుటి కంటే 26 శాతం ఎక్కువ ధర

సామాన్య, మధ్య తరగతి జీవులపై భారం

మిర్యాలగూడ, డిసెంబరు 30: బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. సామాన్య కుటుంబాలకు అందనంతగా సన్న బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం 25 నుంచి 26 శాతం వరకు ధరలు పెరిగాయి. మునుపెన్నడూ లేని విధంగా ధరలు పెరగడంతో సాధారణ, మధ్య తరగతి కుటుంబాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కొత్త బియ్యం తినలేక, పాత బియ్యం కొనలేక వినియోగదారులు సతమతవుతున్నారు. డిమాండ్‌, సరఫరా మధ్య వ్యత్యాసమే బియ్యం ధరల పెరుగుదలకు కారణమని భావిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల కృష్ణా బేసిన్‌లో నీరు లేక వరి సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. దీంతో సన్నధాన్యం లభ్యత కొరవడి బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. ప్రతి నెలా సగటున క్వింటాకు రూ.200 నుంచి రూ.300 పెరుగుతూ ప్రస్తుతం సన్న బియ్యం ధర రూ.6,500కు చేరింది. ఇదే అదనుగా భావించి పలువురు బ్రోకర్లు రైస్‌ మిల్లుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ధరకు అదనంగా కిలోకు రూ.5 నుంచి రూ.8 వరకు పెంచి విక్రయిస్తుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. మిల్లర్లు ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతులు చేయడం కూడా అధిక ధరలకు ఓ కారణమని భావిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో 25 కిలోల పాత బియ్యం బస్తా రూ.1,500కు విక్రయిస్తున్నారు. ఇది గత ఏడాదితో పోలిస్తే రూ.250- రూ.300 అధికం. కొన్ని బ్రాండ్ల పేరుతో ఉన్న సూపర్‌ ఫైన్‌ రైస్‌ కిలో రూ.70 వరకు ధర పలుకుతోంది. సన్న బియ్యం ధరలు పెరగడానికి ప్రధాన కారణం ధాన్యం దిగుబడి తగ్గడమేనని తెలుస్తోంది. కాగా, ఎన్నికల హామీల్లో భాగంగా మద్దతు ధరకు రూ.500 బోనస్‌ ప్రకటిస్తామని కాంగ్రెస్‌ చెప్పడం, కేంద్రం మద్దతు ధరను పెంచే యోచనలో ఉందన్న ఊహాగానాలతోనే మిల్లర్లు ధాన్యాన్ని అధిక ధర చెల్లించి కొనుగోలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిల్లర్ల వద్ద బియ్యం కొన్న వ్యాపారులు.. పంటలు లేవనే సాకుతో బియ్యాన్ని అధిక ధరలకు వినియోగదారులకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది.

గత ఏడాది కంటే భారీగా ధరలు..

గత ఏడాదితో పోలిస్తే బియ్యం ధరలు 25 నుంచి 26% పెరిగాయి. 2022 సెప్టెంబరులో జేఎ్‌సఆర్‌, బీపీటీ, హెచ్‌ఎంటీ రకాలు కొత్తవి క్వింటా ధర వరుసగా రూ.5,100-5,200, రూ.4,100-4,200, రూ.4,600-4,700 ఉండగా.. పాతవి రూ.6,000-6,200, రూ.5,000-5,200, రూ.5,700-5,800 ఉండేవి. 2023 డిసెంబరులో కొత్తవి క్వింటాకు రూ.5,800-6,000, రూ.5,200-5,300, రూ.5,700, పాతవి రూ.6,600-6,800, రూ.5,800-5,900, రూ.6,300-64,00గా ఉన్నాయి.

Updated Date - Dec 31 , 2023 | 03:29 AM