ఉపాధ్యాయుల బదిలీల పదోన్నతుల సందడి
ABN , First Publish Date - 2023-01-18T00:26:00+05:30 IST
ఉపాధ్యాయులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న బదిలీలు, పదోన్నతులకు నేడో, రేపో షెడ్యూల్ విడుదలకానుంది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా సుమారు 1,000మందికి పదోన్నతులు లభించనుండగా, 6,000మంది బదిలీ కానున్నారు.
నేడో, రేపో విడుదల కానున్న షెడ్యూల్
ఉమ్మడి జిల్లాలో 1,000 మందికి పదోన్నతులు
6,000 మంది బదిలీకి అవకాశం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): ఉపాధ్యాయులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న బదిలీలు, పదోన్నతులకు నేడో, రేపో షెడ్యూల్ విడుదలకానుంది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా సుమారు 1,000మందికి పదోన్నతులు లభించనుండగా, 6,000మంది బదిలీ కానున్నారు.
రాష్ట్ర ఆవిర్భావం తరువాత 2015, 2018లో ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయి. ఏడున్నర ఏళ్ల తరువాత తొలిసారిగా పదోన్నతులు లభించనుండటంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం జీవో 317 ప్రకారం సీనియర్లకు ఆప్షన్ ఇచ్చి, జూనియర్లను ఆయా జిల్లాల్లో బలవంతంగా సర్దుబాటుచేశారు. కాగా, తాజాగా విడుదలకానున్న షెడ్యూల్‌తో స్కూల్ అసిస్టెంట్లుగా ఉన్నవారికి ప్రధానోపాధ్యాయులుగా, ఎస్జీటీలుగా ఉన్నవారికి స్కూల్ అసిస్టెంట్లుగా, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు లభించనుండగా, ఏళ్లుగా ఒకే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వారు కొత్త ప్రాంతానికి బదిలీ కానున్నారు.
రాష్ట్ర ఏర్పాటు అనంతరం తొలిసారిగా పదోన్నతులు
ఉమ్మడి జిల్లాలో సుమారు 12,600 మంది ఉపాధ్యాయు లు ఉన్నారు. నల్లగొండ జిల్లాలో 5,800 మంది, సూర్యాపేట జిల్లాలో 3,800 మంది, యాదాద్రి జిల్లాలో 3,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 200 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజాగా విడుదలకానున్న షెడ్యూల్‌తో స్కూల్ అసిస్టెంట్లకు హెచ్‌ఎంలుగా, ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించనుంది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో సుమారు 1,000 మందికి పదోన్నతి దక్కే అవకాశం ఉంది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం పలు కారణాలతో ఉపాధ్యాయుల పదోన్నతులు వాయిదా పడుతూ వచ్చాయి. ఏడేళ్లుగా ఉపాధ్యాయులు పదోన్నతుల కోసం వేచి చూస్తున్నారు. ప్రభుత్వం విడుదలచేయనున్న షెడ్యూల్ ప్రకారం ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు ఒక్క నల్లగొండ జిల్లాలోనే 3,000 మందికి, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో మరో 3,000 మందికి మొత్తంగా సుమారు 6,000 మందికి బదిలీలు జరగనున్నాయి. బదిలీల కోసం 2010, 2012 డీఎస్సీ బ్యాచ్‌లకు చెందిన వారు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నారు. 2015, 2018లో బదిలీల కౌన్సిలింగ్ నిర్వహించినా ఈ బ్యాచ్‌కు చెందిన ఉపాధ్యాయులు లాంగ్‌స్టాండింగ్ జాబితాలోకి రాకపోవడంతో వీరు ఆయా స్థానాల్లో సుదీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్నారు. నోటిఫికేషన్ వెలువడే నాటికి ఎనిమిదేళ్ల స్కూల్ సర్వీస్ పూర్తి చేసుకున్నవారికి బదిలీ తప్పనిసరి. కాగా, గతంలో విడుదలైన షెడ్యూల్ సమయానికి వీరి స్కూల్ సీనియారిటీ ఏడున్నరేళ్లే కావడంతో ఈ రెండు బ్యాచ్‌లకు చెందిన ఉపాధ్యాయులు వారు నియామకమైన ప్రాంతంలోనే సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. కేటగిరీ వారీగా సీనియారిటీ లిస్ట్, గ్రేడ్-2 హెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలకు సంబంధించిన జాబితాలను జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు.
1,800 ఖాళీలు
ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఖాళీలతోపాటు తాజాగా పదోన్నతుల కారణంగా మరిన్ని ఖాళీలు ఏర్పడనున్నాయి. ప్రస్తుతం విడుదలకానున్న షెడ్యూల్ ప్రకారం మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 1,800 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉండనున్నాయి. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తయిన అనంతరం సాధారణ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఖాళీలకు నోటిఫికేషన్ వెలువరుస్తుందని ఉపాధ్యాయులతోపాటు నిరుద్యోగులు ఆశగా ఉన్నారు.
పదోన్నతులు, బదిలీలను స్వాగతిస్తున్నాం : వెంకటేశం,యూటీఎఫ్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఉపాధ్యాయలోకం ఎనిమిదేళ్లుగా పదోన్నతుల కోసం, ఏడేళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తోంది. వీటిని సాధించేందుకు ఐక్య ఉపాధ్యాయ సంఘంగా ఏర్పడి దశల వారీ గా ఆందోళన లు నిర్వహించాం.ఎట్టకేలకు ప్రభు త్వం పదోన్నతులు,బదిలీ ల షెడ్యూల్ విడుదల చేయనుండటాన్ని స్వాగతిస్తున్నాం. బదిలీల ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు ప్రభుత్వం ఎంచుకున్న వెబ్‌కౌన్సిలింగ్ విధానాన్ని ఆహ్వానిస్తున్నాం.
సీనియారిటీ జాబితా పంపాం : భిక్షపతి, నల్లగొండ జిల్లా విద్యాశాఖాధికారి
ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా రాష్ట్రస్థా యి అధికారులకు పంపాం. వారు పరిశీలిం చి జిల్లాకు పంపుతారు. బదిలీలకు సంబంధించిన తేదీల సమాచారం ఇంకా అధికారికంగా జిల్లాకు రాలేదు. ప్రతీ గంటకు అధికారిక మెయిల్ చెక్ చేస్తున్నాం. సమాచారం వచ్చిన వెంటనే అధికారికంగా వెల్లడిస్తాం. బదిలీలు, పదోన్నతులకు సం బంధించిన సమాచారం సిద్ధంగా ఉంది.దీనికి సంబంధించి ఇప్పటికే విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన సమావేశం సైతం నిర్వహించారు.