చాక్లెట్ కోసం వెళ్తే షాక్‌తో చిన్నారి మృతి!
ABN , First Publish Date - 2023-10-03T04:14:34+05:30 IST
అభం, శుభం తెలియని చిన్నారిని చితికి పంపింది ఒక సూపర్ మార్కెట్ యాజమాన్యం నిర్లక్ష్యం.. చాక్లెట్ల కోసం వెళ్లిన బాలిక అక్కడి ఫ్రిజ్ డోర్‌ను తెరవబోగా విద్యుత్తు షాక్ తగిలి మృతి చెందింది.
నందిపేట ఎన్‌మార్ట్‌లో ఫ్రిజ్‌కు విద్యుత్తు సరఫరా..శవంతో బంధువుల ఆందోళన
నందిపేట, సెప్టెంబరు 2: అభం, శుభం తెలియని చిన్నారిని చితికి పంపింది ఒక సూపర్ మార్కెట్ యాజమాన్యం నిర్లక్ష్యం.. చాక్లెట్ల కోసం వెళ్లిన బాలిక అక్కడి ఫ్రిజ్ డోర్‌ను తెరవబోగా విద్యుత్తు షాక్ తగిలి మృతి చెందింది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రానికి చెందిన గూడూరు సంయుక్త-రాజశేఖర్ దంపతుల కూతురు రిషిత (4). రెండ్రోజుల క్రితం వారు నందిపేటలోని సంయుక్త తల్లిదండుల వద్దకు వచ్చా రు. సోమవారం తిరుగు ప్రయాణంలో నందిపేటలో ఉన్న ఎన్‌మార్ట్ సూపర్ మార్కెట్‌కు రిషితతో కలిసి తల్లిదండ్రులు వెళ్లారు. అయితే చాక్లెట్ల కోసం ఫ్రిజ్ డోర్ తీయడానికి యత్నించిన రిషిత విద్యుత్తు షాక్ తగిలి దానికే అతుక్కుపోయింది. కొద్దిసేపటికి గమనించిన తండ్రి రిషితను పక్కకు లాగాడు. అప్పటికే స్పృహ కోల్పోయిన రిషితను నిజామాబాద్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు రిషిత మృతి చెందినట్లు తేల్చారు. దీంతో రిషిత శవంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఎన్‌మార్ట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఎన్‌మార్ట్‌ను మూసేయడంతో దానిపై రాళ్లు రువ్వారు. అక్కడికి వచ్చిన తహసీల్దార్ ఆనంద్‌కుమార్, ఎస్సై రాహుల్ వారిని సముదాయించారు. ఎన్‌మార్ట్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామనడంతో శాంతించారు.