వైఎస్‌ అనుచరుడు.. సూరీడుపై కేసు నమోదు

ABN , First Publish Date - 2023-09-22T02:50:26+05:30 IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి సహాయకుడిగా పనిచేసిన సూరీడుపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదుచేశారు.

వైఎస్‌ అనుచరుడు.. సూరీడుపై కేసు నమోదు

బంజారాహిల్స్‌, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి సహాయకుడిగా పనిచేసిన సూరీడుపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదుచేశారు. ఆయనతోపాటు..ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఐపీఎస్‌ అధికారి, జూబ్లీహిల్స్‌ ఠాణాలో పనిచేసే ఇద్దరు అధికారులపైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. జూబ్లీహిల్స్‌లో నివసించే సూరీడు తన కుమార్తెను ఏపీలోని కడపకు చెందిన డాక్టర్‌ సురేంద్రనాథ్‌ రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. కొద్ది కాలానికి కుమార్తె, అల్లుడి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో సూరీడు 2014లో జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. 2021 మార్చిలో తన ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించిన సురేంద్రనాథ్‌రెడ్డి.. తనను చంపేందుకు యత్నించాడంటూ సూరీడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూరీడు తప్పుడు ఫిర్యాదు చేశారని.. అతనికి ఏపీకి చెందిన ఐపీఎస్‌ అధికారి పాలరాజు, అప్పటి జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ రెడ్డి, ఎస్సై నరేశ్‌ సహకరించారని సురేంద్రనాథ్‌ కోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలను నమోదు చేసుకున్న కోర్టు.. సూరీడు, పాలరాజు, రాజశేఖర్‌రెడ్డి, నరేశ్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు జూబ్లీహిల్స్‌ పోలీసులు వెల్లడించారు.

Updated Date - 2023-09-22T02:50:26+05:30 IST