Share News

తెలుగు ఉర్దూ భాషల మధ్య వారధి

ABN , First Publish Date - 2023-11-06T03:51:03+05:30 IST

తెలుగు, ఉర్దూ సాహిత్యాలకు మెహక్‌ హైదరాబాదీ ఓ వారధిలా నిలిచారని వక్తలు కొనియాడారు.

తెలుగు ఉర్దూ భాషల మధ్య వారధి

మెహక్‌ హైదరాబాదీకి వక్తల ప్రశంస

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): తెలుగు, ఉర్దూ సాహిత్యాలకు మెహక్‌ హైదరాబాదీ ఓ వారధిలా నిలిచారని వక్తలు కొనియాడారు. తద్వారా హిందు, ముస్లింల మధ్య సుహృద్భావనను పెంపొందించేందుకు ఆయన కృషి చేస్తున్నారని ప్రశంసించారు. మెహక్‌ హైదరాబాదీ తెలుగులోకి అనువదించిన ‘గుల్‌దస్త’ (హిందువులపై హైదరాబాద్‌ ఉర్దూ కథలు), ‘అస్థిపంజరం’ (అమృతా ప్రీతమ్‌ నవల), ‘మంటో క్లాసిక్స్‌’ (ఉర్దూ కథలు), ‘హైదరాబాద్‌ ప్రజా సమరం’(చెరుకు మాధవరెడ్డి ఉర్దూ రచన) పుస్తకాల ఆవిష్కరణ సభ ఆదివారం రవీంద్ర భారతిలో జరిగింది. కవి నందిని సిధారెడ్డి మాట్లాడుతూ ఉర్దూ సాహిత్యాన్ని, ఆ రచయితల మనోభావాలను తెలుగు పాఠకులు తెలుసుకొనే అరుదైన అవకాశాన్ని మెహక్‌ తన అనువాదాలతో కల్పిస్తున్నారని అభినందించారు. ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ మెహక్‌ ఉర్దూ నేర్చుకోవడం, ఆ సాహిత్యంలోకి వెళ్లడం ఒక విశేషమైతే... సమాజానికి అవసరమైన దాన్ని అనువదించడం మరొక విశేషమని కొనియాడారు. 1950ల తర్వాత కాలంలోని సామాజిక, రాజకీయ పరిణామాలతో తెలుగు, ఉర్దూ భాషల మధ్య ఆదాన ప్రదానాలు తగ్గడం వల్ల తలెత్తిన దూరాన్ని తగ్గించే శక్తి సాహిత్యానికి ఉందన్నారు. ఉర్దూ రచయిత్రులు కమర్‌ జమాలీ, కిష్వర్‌ సుల్తానా, రచయిత ఆడెపు లక్ష్మీపతి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ గులే రాణా పాల్గొన్నారు.

Updated Date - 2023-11-06T03:51:04+05:30 IST